సంక్షోభంలో ‘జీవిత బీమా’

ABN , First Publish Date - 2020-09-19T06:24:00+05:30 IST

జీవిత బీమా సంస్థ గత ఆర్థిక సంవత్సరంలో డివిడెండ్, పన్నుల రూపంలో 13,586 కోట్ల రూపాయలు ప్రభుత్వానికి చెల్లించింది.

సంక్షోభంలో ‘జీవిత బీమా’

జీవిత బీమా సంస్థ గత ఆర్థిక సంవత్సరంలో డివిడెండ్, పన్నుల రూపంలో 13,586 కోట్ల రూపాయలు ప్రభుత్వానికి చెల్లించింది. ప్రభుత్వ బడ్జెడ్‌ లోటును భర్తీ చేసుకునేందుకు అవసరమైన నిధులను ఆ సంస్థ సమృద్ధిగా సమకూర్చగలదు. ఈ వాస్తవాన్ని విస్మరించి ఎల్‌ఐసి వాటాలు విక్రయించేందుకు పట్టుదలగా ఉండడంలో పాలకుల ఆంతర్యమేమిటి?


దేశకేపిటల్‌ మార్కెట్లో అతి పెద్ద వ్యాపారానికి కేంద్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. 32 కోట్ల రూపాయల ఆస్తులు కలిగిన మేరు పర్వతంలాంటి భారతీయ జీవితబీమా సంస్థలో వాటాలు విక్రయించే ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఎల్‌ ఐ సిలో వాటాలు అమ్మడం గురించి దేశ ఆర్ధికమంత్రి ఈ ఏడాది బడ్జట్‌‌ ప్రసంగంలో పేర్కొన్నారు. బడ్జట్ లోటును తీర్చడానికి అనేక ప్రభుత్వరంగ పరిశ్రమల వాటాలను అమ్మాలనే కేంద్ర ప్రభుత్వ విధానంలో భాగంగా దీన్ని ఆమె ప్రస్తావించారు.



వాస్తవానికి ప్రభుత్వరంగ పరిశ్రమలను ప్రవేటీకరించడం అనేది 1991 నుంచి మన దేశంలో అమలవుతున్న నయా ఉదారవాద విధానాలలో భాగమే. కేంద్రంలో ఏ ప్రభుత్వమున్నా మూడు దశాబ్దాలుగా ఇవే విధానాలు అమలవుతున్నాయి. అయితే, మిగిలిన ప్రభుత్వాలకు, ఎన్‌ డి ఎ ప్రభుత్వాలకు ఈ విషయంలో మౌలికంగా ఒక తేడా ఉంది. కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వాలు ఎంతోకొంత విచక్షణ చూపించేవి. ప్రజల నుంచి వ్యతిరేకత వస్తే వెనక్కు తగ్గేవి. కానీ, 2014 నుంచి అధికారంలో ఉన్న ఎన్‌ డి ఎ ప్రభుత్వం ప్రతిఘటనను కూడా ఖాతరు చేయకుండా వేగంగా ముందుకు పోయారు. 2019 తరువాత రెండోసారి అధికారంలో వచ్చాక మోదీ సర్కార్ ఆ దూకుడును మరింత పెంచింది. ప్రభుత్వరంగ సంస్థలు అధికారంలో ఉన్న పార్టీల ఆస్తులేమీ కాదు. కోట్లాది ప్రజలు చెల్లించిన పన్నుల ద్వారా దశాబ్దాలుగా నిర్మించిన సిరుల కేంద్రాలవి. అధికారంలో ఉన్న పార్టీలు వాటి విషయంలో తమ ఇష్టమొచ్చినట్లు వ్యవహరించడానికి వీలు లేదు. అందుకు ప్రజల అనుమతించరని పాలకవర్గాలు గుర్తించి తీరాలి. 


ప్రభుత్వసంస్థల ప్రైవేటీకరణకు, వాటిలో వాటాల అమ్మకానికి ప్రభుత్వం ప్రస్తుతం రెండు కారణాలు చెబుతోంది. ఒకటి,- అది తమ సంస్కరణలలో భాగమని, రెండోది బడ్జట్‌ లోటు పూడ్చుకోవడమని. అందువల్ల ఈ రెండు అంశాలను పరిశీలించాలి. అందులోనూ ఎల్‌ఐసి ని దృష్టిలో ఉంచుకుని ప్రత్యేకంగా ఈ పరిశీలన ఉండాలి. మూడు దశాబ్దాల నుంచి ఈ విధానాలు అమలవుతున్నా, మిగిలిన సంస్థల వలె కాకుండా ఇప్పటికీ నూటికి నూరు శాతం ప్రభుత్వ వాటాలున్న అతి పెద్ద ప్రభుత్వ సంస్థ ఎల్‌ఐసినే. మిగిలిన సంస్థలకు లేని ప్రత్యేకత ఎల్‌ఐసికి మరొకటి ఉంది. అందులో ప్రజలు దీర్ఘకాలం, అంటే 35 సంవత్సరాల వరకు తమ పొదుపు మొత్తాన్ని దాచుకుంటారు. ఈ మూడున్నర దశాబ్దాల కాలంలో పాలసీహోల్డర్‌ చనిపోతే, మొత్తం సొమ్ము బోనస్‌తో సహా నామినీకి చెల్లించాలి. ఇన్ని సంవత్సరాలు పాలసీహోల్డర్‌ డబ్బు కడుతుంటే ఎల్‌ఐసి వారికి తిరిగిచ్చేది మాత్రం ఆఖరునే. అంటే, సుదీర్ఘకాలం కేవలం ఒక హామీని మాత్రమే ఆ సంస్థ వారికిస్తోంది. వాస్తవంగా జీవితబీమా అంటేనే దీర్ఘకాల కాంట్రాక్టు. అనేక ప్రైవేట్ కంపెనీలు ఈ కాంట్రాక్టుకు భిన్నంగా ప్రజలకు సొమ్ము చెల్లించకుండా ఎగ్గొట్టేస్తుంటే అన్ని ఇన్సూరెన్స్‌ కంపెనీలను జాతీయం చేయాలని ప్రజల నుంచి, ఉద్యోగుల నుంచి పెద్దఎత్తున డిమాండు వచ్చింది. డాక్టర్‌ బి ఆర్‌ అంబేడ్కర్‌ ఆనాడే ఇన్సూరెన్స్‌ అనేది ప్రభుత్వ ఆధ్వర్యంలోనే ఉండాలని సూచించి జాతీయకరణకు పట్టుపట్టారు. దరిమిలా వాటిని జాతీయం చేశారు. లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ చట్టం ద్వారా 1956 సెప్టెంబర్‌ ఒకటిన ఎల్‌ఐసిని ఏర్పాటు చేశారు.


అప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక ప్రభుత్వసంస్థకు, ప్రవేట్‌సంస్థకు మధ్య తేడా ఏమిటో తెలుసుకోవడానికి ఎల్‌ఐసి ఒక నమూనాగా నిలిచింది. క్లెయిమ్‌ల పరిష్కారంలో ప్రపంచంలోనే మొదటి స్థానంలో నిలిచింది. ప్రజలు బీమా చేసుకుని ధీమాగా బతికే పరిస్థితి కల్పించింది. సుదీర్ఘకాలం వారి పొదుపు సొమ్మును ట్రస్టీగా కాపాడుతోంది. చిన్న మొక్కగా నాడు ఐదు కోట్ల రూపాయలతో ప్రారంభించిన ప్రస్థానం నేడు ఇంతింతై, అంతింతై మహావృక్షంగా ఎదిగి 32 లక్షల కోట్ల రూపాయల పైగా ఆస్తులతో సంస్థ పటిష్ఠంగా ఉంది. నామ మాత్రపు పెట్టుబడి నుంచి ఇంతటి అభివృద్ధి అంతా ప్రజల పొదుపుసొమ్ము ద్వారానే సాధ్యమైంది. అందుకే ఎల్‌ఐసిని ఒక పరస్పర ప్రయోజనకర సొసైటీ కిందే చూడాలి. అలాంటి సంస్థను ప్రభుత్వం తాకడం ఏ రకంగానూ సమర్ధనీయం కాదు. పంచవర్ష ప్రణాళికల కోసం ప్రభుత్వానికి అవసరమైన నిధులను సమకూర్చడంలో అగ్రగామిగా ఉంది. 12 పంచవర్ష ప్రణాళికలకు సంబంధించి మొత్తంగా 27.75 లక్షల కోట్ల రూపాయలు సమకూర్చింది. 13వ పంచవర్ష ప్రణాళిక కోసం ఏకంగా 28లక్షల కోట్ల రూపాయల సహాయాన్ని అందిస్తోంది. మౌలిక వసతుల కల్పన, గ్రామీణ పట్టణ ప్రాంతాభివృధ్ధి, ఇతర సామాజిక పథకాలకు పెద్ద ఎత్తున నిధులు అందిస్తూ, ప్రజలకే కాకుండా దేశానికి కూడా బీమా కల్పిస్తోంది. ఉద్యోగ నియామకాలలో కూడా సామాజిక న్యాయం పాటిస్తోంది. నేడు మొత్తం ఉద్యోగులలో 20 శాతం మందికి పైగా మహిళలే. ఇంత సామాజిక దృక్పథంతో పని చేయడం, ప్రజల పొదుపుసొమ్ముకు భద్రత కల్పించడం ఒక్క ప్రభుత్వసంస్థ ద్వారానే సాధ్యమైంది. లాభమే పరమావధిగా భావించే ఏ ఇతర ప్రైవేట్ సంస్థ దీని దరిదాపు కూడా చేరలేదు. ఇదీ! అలాంటి సంస్థను నేడు వాటాల అమ్మకంతో ప్రారంభించి క్రమేణా ప్రైవేటీకరించడాన్ని ఏ రకంగా అర్ధం చేసుకోవాలి?


లోటుబడ్జట్‌ను భర్తీ చేయడానికి ఎల్‌ఐసి వాటాలు అమ్ముతామని తద్వారా 90వేలకోట్ల రూపాయలు ఈ సంవత్సరం సమకూర్చుకుంటామని ఆర్ధిక మంత్రి ప్రకటించారు. నిధులే ముఖ్యమైతే ఎల్‌ఐసి వద్ద 53వేలకోట్ల రూపాయలకు పైగా అదనపు నిధులున్నాయి. గత ఆర్ధిక సంవత్సరంలోనే ఎల్‌ఐసి ప్రభుత్వానికి 13,586 కోట్ల రూపాయలు డివిడెండు, పన్నుల రూపంలో చెల్లించింది. ఇంకా అదనంగా కావాలంటే తీసుకోవచ్చు. కానీ ప్రభుత్వం ఆ పని చేయకుండా వాటాలు అమ్మేయాలని పట్టుదలగా ఉందంటే ప్రభుత్వానికి వాస్తవంగా కావలసింది నిధులు కాదు, ఆ పేరు చెప్పి ఇటువంటి గంగిగోవు లాంటి సంస్థను తమకు ఆప్తులైన అంబానీకో, అదానీకో ధారాదత్తం చేయడమే. 23 ప్రైవేట్ కంపెనీలు జీవిత బీమా వ్యాపారాన్ని కబళించాలని ఎంత ప్రయత్నిస్తున్నా కేవలం పావలా వాటా కూడా పొందలేకపోయాయి. అందుకే నేడు ఏకంగా ఎల్‌ఐసినే కబళించేయాలని చూస్తున్నాయి.


ఇది జరగడానికి గాని అనుమతిస్తే, ఇక 1956 ముందునాటి పరిస్థితే ఏర్పడుతుంది. ప్రజల సొమ్ముకు భద్రత ఉండదు. ప్రభుత్వ అభివృద్ధి ప్రణాళికలకు నిధులుండవు. సామాజిక న్యాయం అసలే ఉండదు. సంస్కరణ విధానాలలో భాగమే ఇదని ప్రభుత్వం సమర్ధించుకుంటుంది. ఎక్కడైనా సంస్కరణలంటే ప్రజలకు మేలు జరిగేలా ఉండాలి గాని, కీడు జరిగేలా ఉండకూడదు. ఆర్ధిక సంక్షోభాన్ని తీవ్రంగా ఎదుర్కొంటున్న ప్రస్తుత పరిస్థితుల్లో ప్రభుత్వానికి నిధులు సమకూర్చే ఎల్‌ఐసి వంటి సంస్థలు ఉంటేనే దేశ ఆర్ధిక వ్యవస్థ బలోపేతమవుతుంది. ఆశ్చర్యకరంగా మోదీ సర్కార్‌ అటువంటి సంస్థలనే అమ్మేయాలని కంకణం కట్టుకుంది. నిత్యం దేశభక్తి మంత్రం జపించే పాలకులకు ఇది ఏ రకమైన దేశభక్తిగా కనపడిందో వారికే తెలియాలి. ఎల్‌ఐసి నినాదం సంస్కృతంలో ‘యోగక్షేమం వహామ్యహం’. అంటే ‘మీ సంక్షేమమే మా బాధ్యత’ అని అర్థం. నేడు ఈ సంక్షేమం స్థానంలో సంక్షోభాన్ని సృష్టించడానికి ప్రభుత్వం పూనుకుంది. కాపాడవలసినవారే గొంతు నులిమేస్తుంటే, ప్రభుత్వరంగాన్ని, అందులోనూ ఎల్‌ఐసిని కాపాడుకునే బాధ్యత ఇక ప్రజలదే.


ఎ. అజ శర్మ

ప్రధాన కార్యదర్శి, ఉత్తరాంధ్ర అభివృధ్ధి వేదిక

Updated Date - 2020-09-19T06:24:00+05:30 IST