వైవాహిక వివాదాలతో వివాహ వ్యవస్థ బలహీనపడుతోంది

ABN , First Publish Date - 2022-02-09T09:07:42+05:30 IST

వైవాహిక వివాదాలతో వివాహ వ్యవస్థ బలహీనపడుతోందని సుప్రీంకోర్టు ధర్మాసనం విచారం వ్యక్తం చేసింది. దంపతుల మధ్య అనుబంధాలు దూరమవుతూ.....

వైవాహిక వివాదాలతో వివాహ వ్యవస్థ బలహీనపడుతోంది

అనుబంధాలు దూరమవుతున్నాయి : సుప్రీం

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 8: వైవాహిక వివాదాలతో వివాహ వ్యవస్థ బలహీనపడుతోందని సుప్రీంకోర్టు ధర్మాసనం విచారం వ్యక్తం చేసింది. దంపతుల మధ్య అనుబంధాలు దూరమవుతూ.. సంఘర్షణలు పెరుగుతున్నాయని వ్యాఖ్యానించింది. ఈ క్రమంలో గృహ హింస నిరోధక చట్టాలు, ఐపీసీ సెక్షన్‌ 498ఏ వంటి సెక్షన్లు దుర్వినియోగమవుతున్నాయని అభిప్రాయపడింది. ఇటీవలి కాలంలో ఈ సంస్కృతి పెరిగిందని ఆక్షేపించింది. పట్నా హైకోర్టు ఓ వివాహితకు అనుకూలంగా ఇచ్చిన తీర్పుపై అత్తింటి వారు సుప్రీంకోర్టులో అప్పీల్‌ చేశారు. జస్టిస్‌ ఎస్‌.అబ్దుల్‌ నజీర్‌, జస్టిస్‌ కృష్ణ మురారీలతో కూడిన ధర్మాసనం మంగళవారం ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టింది. పట్నా హైకోర్టు తీర్పును పక్కన పెడుతూ.. ఆ వివాహిత అత్తమామలు, ఇతర కుటుంబ సభ్యులు, బంధుమిత్రులకు ఈ కేసుతో సంబంధం లేదని తేల్చింది. ‘‘అసలు ఘటన సమయంలో లేనివారిపై ప్రాసిక్యూషన్‌కు ఎలా అనుమతిస్తారు? జిల్లా కోర్టు కూడా వారికి సంబంధం లేదని తేల్చింది కదా?’’ అని వ్యాఖ్యానించారు. చాలా వరకు భర్తలు 498ఏ కేసుల్లో ‘చాలెంజ్‌’ చేయకపోవడం వల్ల దోషులుగా తేలే ప్రమాదముందని పేర్కొంది. కాగా.. ఈ కేసులో పిటిషనర్‌కు 2017 సెప్టెంబరులో వివాహమవ్వగా.. మూణ్నెల్ల తర్వాత తన భర్త, అత్తింటివారు, బంధుమిత్రులు కట్నంగా కారు కోసం డిమాండ్‌ చేస్తున్నారంటూ బిహార్‌లోని పూర్నియా పోలీసులకు ఫిర్యాదు చేశారు. ట్రయల్‌ కోర్టు ఆమె అత్తింటివారు, బంధుమిత్రుల ప్రమేయం లేదని తేల్చినా.. విచారణకు ఆదేశాలు జారీ చేసింది. తొలుత వారు తమపై కేసును రద్దుచేయాలని కోరుతూ పట్నా హైకోర్టును ఆశ్రయించగా.. ధర్మాసనం వారి పిటిషన్‌ను కొట్టివేస్తూ తీర్పునిచ్చింది. దీంతో వారు సుప్రీంకోర్టును ఆశ్రయించారు.

Updated Date - 2022-02-09T09:07:42+05:30 IST