ఇప్పుడామె ప్రాణదాత!

ABN , First Publish Date - 2020-09-07T06:02:22+05:30 IST

గృహిణిగా ఇంటి బాధ్యతలు చూసుకొనే ఆమెకు చాలీచాలనీ భర్త సంపాదనతో కుటుంబాన్ని నెట్టుకు రావడం కష్టంగా అనిపించింది. దాంతో వేనీళ్ళకు చన్నీళ్ళలా తను కొంత సంపాదించాలనుకున్నారు...

ఇప్పుడామె ప్రాణదాత!

అవసరమైన శిక్షణ, కష్టపడే సామర్థ్యం ఉంటే ఆడా మగా అనే తేడా లేకుండా ఎవరైనా వాహనం నడపవచ్చని నేను నమ్ముతాను. మన కుటుంబానికి అర్థికంగా అండగా ఉండడంతో పాటు కొత్త దారిని ఎంచుకున్నందుకు ఇతరులకు స్ఫూర్తిగా నిలుస్తాం.


గృహిణిగా ఇంటి బాధ్యతలు చూసుకొనే ఆమెకు చాలీచాలనీ భర్త సంపాదనతో కుటుంబాన్ని నెట్టుకు రావడం కష్టంగా అనిపించింది. దాంతో వేనీళ్ళకు చన్నీళ్ళలా తను కొంత సంపాదించాలనుకున్నారు. భర్త సాయంతో డ్రైవింగ్‌ నేర్చుకున్నారు. క్యాబ్‌ డ్రైవర్‌గా మారి కుటుంబానికి ఆసరా అయ్యారు. తాజాగా తమిళనాడు ప్రభుత్వం ఆమెను అంబులెన్స్‌ డ్రైవర్‌గా నియమించింది. తమిళనాడులోనే కాదు దేశంలోనే అంబులెన్స్‌ డ్రైవర్‌గా బాధ్యతలు చేపట్టిన మొదటి మహిళగా వీరలక్ష్మి గుర్తింపు సాధించారు. ఎక్కువగా మగవాళ్లు మాత్రమే కనిపించే ఈ వృత్తిని ఆమె ఎందుకు ఎంచుకున్నారంటే...


తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి ఇటీవలే కొత్తగా 118 మంది అంబులెన్స్‌ డ్రైవర్లను నియమించారు. వారిలో చెన్నైకి చెందిన ముప్ఫై ఏళ్ల వీరలక్ష్మి ఒకరు. సల్వార్‌ మీద తెల్ల కోటు ధరించి తొలిసారిగా అంబులెన్స్‌ డ్రైవింగ్‌ సీట్లో కూర్చొన్న ఆమె కోరుకొని మరీ ఈ రంగంలోకి వచ్చారు. ‘‘డబ్బు సంపాదించేందుకు అనేక రకాల ఉద్యోగాలున్నాయి. కానీ నేను చేసే ఉద్యోగం సేవతో ముడిపడినదై ఉండాలనుకున్నా. అందుకే ఈ వృత్తిని ఎంచుకున్నా’’ అంటారు వీరలక్ష్మి.


అనుభవం కలిసొచ్చింది

వీరలక్ష్మి భర్త కూడా క్యాబ్‌ డ్రైవర్‌గా పనిచేస్తున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు. భార్యాభర్తలిద్దరూ చెన్నైలో క్యాబ్‌ నడుపుతూ ఉపాధి పొందేవారు. ‘‘లాక్‌డౌన్‌ సమయంలో క్యాబ్‌లు అంతగా నడవలేదు. దాంతో ఇతర ఉద్యోగాలు వెతుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అదే సమయంలో అంబులెన్స్‌ డ్రైవర్‌గా ఖాళీలు ఉన్నాయని తెలియగానే వెంటనే దరఖాస్తు చేశాను. ఇంటర్వ్యూ గట్టెక్కుతాననే నమ్మకం ఉంది. చివరికి అంబులెన్స్‌ డ్రైవర్‌గా ఎంపికైన తొలి మహిళను నేనే అని తెలిసి ఆశ్చర్యం, ఆనందం వేసింది. వారం రోజులు మాకు శిక్షణ ఇచ్చారు. మొదటి రోజు డ్రైవర్‌ సీటు పక్కన రక్తం మరకలు, గాయాలతో ఉన్న వారితో కలిసి కూర్చొన్నప్పుడు కొద్దిగా భయం వేసింది. అప్పుడే నాకు ఈ ఉద్యోగంలో తీవ్రత అర్థమైంది’’ అంటున్న వీరలక్ష్మి ఆటోమొబైల్‌ టెక్నాలజీలో డిప్లొమా చేశారు. ఒక ఎన్జీవో సాయంతో ఆరేళ్ల క్రితమే ఆమె డ్రైవింగ్‌ లైసెన్స్‌ సాధించారు. అప్పటి నుంచీ వివిధ రకాల వాహనాలు నడుపుతూ కుటుంబానికి ఆసరాగా నిలుస్తున్నారు. ఇప్పుడు ఆమె హెవీ వెహికిల్‌ లైసెన్స్‌ కూడా సంపాదించారు. 


కొత్తల్లో నేను క్యాబ్‌ నడపడం చూసి అందరూ ‘మహిళవు అయి ఉండి డ్రైవింగ్‌ రంగాన్ని ఎందుకు ఎంచుకున్నావు’ అని ప్రశ్నించేవారు. అయితే అవసరమైన శిక్షణ, కష్టపడే సామర్థ్యం ఉంటే ఆడా మగా అనే తేడా లేకుండా ఎవరైనా వాహనం నడపవచ్చని నేను నమ్ముతాను. మన కుటుంబానికి అర్థికంగా అండగా ఉండడంతో పాటు కొత్త దారిని ఎంచుకున్నందుకు ఇతరులకు స్ఫూర్తిగా నిలుస్తాం. ఇందులో తప్పుగా అనుకోవడానికి ఏమి లేదు’’ అంటారామె. గత నాలుగేళ్లుగా క్యాబ్‌ డ్రైవర్‌గా ప్రయాణీకులను గమ్యస్థానానికి చేర్చిన ఆమె ఇప్పుడు అత్యవసర వైద్యం అవసరమైన వారిని ఆస్పత్రికి తరలించనున్నారు. ప్రాణాలు నిలిపే అంబులెన్స్‌ డ్రైవర్‌గా వీరలక్ష్మి ఎందరికో స్ఫూర్తిగా నిలుస్తున్నారు.


నాకు ఆ భయం లేదు

‘‘కరోనా పాజిటివ్‌ వాళ్లను ఆస్పత్రికి చేర్చే అంబులెన్స్‌ డ్రైవర్‌గా ఉద్యోగం... ఎక్కడ మాకు కరోనా సోకుతుందనే భయం ఏదో మూల ఉంటుంది. కానీ కరోనా బారిన పడతాననే భయం నాలో లేదు. ఎందుకంటే అన్ని రకాల రక్షణ జాగ్రత్తలు తీసుకుంటాం. అంతేకాదు నా జాగ్రత్తలో నేను ఉంటాను. ఈ రంగంలోకి వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఆపదలో ఉన్నవారి ప్రాణాలు కాపాడే ప్రయత్నంలో భాగమైనందుకు నాకు ఎంతో సంతృప్తిగా ఉంది’’ అని వీరలక్ష్మి నవ్వుతూ చెబుతారు.

Updated Date - 2020-09-07T06:02:22+05:30 IST