జీవన గీత!

ABN , First Publish Date - 2020-12-25T05:48:29+05:30 IST

ఇది భగవద్గీతా దేవి ప్రార్థన మాత్రమే కాదు. పంచమవేదమైన మహాభారతంలో భగవంతుడైన శ్రీకృష్ణుడు అర్జునుడికి ఉపదేశించిన ఉపనిషత్సారాన్నంతా ప్రోదుచేసి దీనిలో పొందుపరిచాడు.

జీవన గీత!

నేడు గీతా జయంతి


భగవద్గీతలో ఆధ్యాత్మికతతో పాటు ఆరోగ్య విషయాలు, శారీరక, మానసిక బలహీనతలు తొలగించగల ఆచరణాత్మకమైన ఉపదేశాలు, హెచ్చరికలు, అన్ని వయసుల వారూ జీవితంలో విజయాలు సాధించడానికి దోహదపడే మార్గదర్శకాలు కోకొల్లలు. వ్యక్తిత్వ వికాసానికీ, వ్యవస్థల పురోగతికీ ఆనాడే మెలకువలు సూచించాడు శ్రీకృష్ణుడు. 


  • పార్థాయ ప్రతిబోధితాం భగవతాం నారాయణేన స్వయం
  • వ్యాసేన గ్రథితాం పురాణమునినాం మధ్యే మహాభారతమ్‌
  • అద్వైతామృత వర్షిణీం, భగవతీం అష్టాదశాధ్యాయినీమ్‌
  • అంబ! త్వామను సందధామ్‌ భగవద్గీతే భవద్వేషిణీమ్‌


ది భగవద్గీతా దేవి ప్రార్థన మాత్రమే కాదు. పంచమవేదమైన మహాభారతంలో భగవంతుడైన శ్రీకృష్ణుడు అర్జునుడికి ఉపదేశించిన ఉపనిషత్సారాన్నంతా ప్రోదుచేసి దీనిలో పొందుపరిచాడు. ఆధ్యాత్మికంగా అద్వైతమనే అమృతాన్ని పంచాడు. ఇదంతా వేదాంతమనీ, జీవిత చరమదశలో చదవాల్సినదనీ అపోహతో - ఆ గ్రంథం మీద ఒక పుష్పాన్ని ఉంచి, భద్రంగా దాచిపెట్టేవారు నిత్య జీవితాన్ని నడపడానికి తెలుసుకోవాల్సిన విషయాలెన్నో భగవద్గీతలో ఉన్నాయి. 


కురుక్షేత్ర సంగ్రామ ఆరంభానికి ముందు శ్రీకృష్ణుడు నాటిన విత్తు భగవద్గీత. అది అంతలోనే మొలకై, ‘ఇంతింతై... వంటుడంతై’ అన్నట్టు మహా కల్పవృక్షంగా పెరిగింది. సమస్త ఉపనిషత్తుల సారాన్నీ పూవులుగా పూయించి, ఆ సుమాలను వ్యాసుడి ద్వారా సమస్త లోకానికీ అందించాడు శ్రీకృష్ణుడు. ఇదొక యజ్ఞం. ఆ యజ్ఞ ఫలాన్ని అందుకొని, ఆరగించి... ముక్తిని (అనుకున్న కార్యాన్ని) ఇక్కడే సాధించాలి. ఫలితం ఆస్వాదించాలి. భగవద్గీత చెప్పింది ఇదే!


బుద్ధి శుద్ధి కావాలంటే...

‘‘మన జీవన పయనం సాఫీగా సాగాలంటే, ఎత్తుపల్లాలను అధిగమించాలంటే, జీవితంలో అనుకున్నవి సాధించాలంటే ప్రతిరోజూ ఉదయాన్నే ‘భగవద్గీత’ అనే క్షీర సాగరంలో మునగాలి’’ అన్నాడు అమెరికన్‌ రచయిత హెన్రీ డేపిట్‌ థోరో. ప్రతి శ్లోకాన్నీ పఠించి, అర్థం చేసుకుంటే బుద్ధి శుద్ధి అవుతుందని చెప్పాడు. ఆధునిక విజ్ఞానం జనాన్ని పరుగులు పెట్టిస్తున్నదే తప్ప పడితే లేవడం ఎలాగో నేర్పడం లేదు. జీవితంలో విలువలను పెంపొందించుకోవాలంటే మానసికంగా పరిణతి పొందాలి. మనో దౌర్బల్యం మన సామర్థ్యాలను బలహీనపరుస్తుంది. 


ఆరోగ్య గీత...

సంపూర్ణ మానవ వికాసానికి దోహదం చేసే మహా గ్రంథం భగవద్గీత. ఆరోగ్యపరంగా ఆధునిక వైద్యశాస్త్రం చెప్పే కొన్ని విషయాలను, ముఖ్యంగా ఆహారం గురించి భగవద్గీత ఆరో అధ్యాయం వివరించింది. ఎలాంటి ఆహారం తీసుకోవాలో పదిహేడో అధ్యాయంలో ఉంది.. ఆహార విహారాల్లో సయమనం పాటించకపోవడం వల్లనే నేటి తరం వారు రోగగ్రస్థులవుతున్నారు. మనసును ఉద్రేకపరచని, రుచికరమైన, బలవర్థకమైన ఆహారాన్ని మాత్రమే తీసుకోవాలన్నది గీతోపదేశం.


మనో గీత...

శరీరం దృఢంగా ఉన్నా మనోబలం లోపిస్తే చేసే పనిలో ఫలితం సాధించలేం. ఈ విషయాన్నే భగవద్గీత రెండో అధ్యాయం మూడో శ్లోకంలో శ్రీకృష్ణుడు చెప్పాడు. అర్జునుడు మహా బలవంతుడు. కానీ మనోదౌర్బల్యం కారణంగా యుద్ధం చెయ్యనన్నాడు. కృష్ణుడు అది గమనించి, అర్జునుణ్ణి ఉత్తేజపరచి, అతనిలోని అంతర్గత శక్తిని ప్రేరేపించి, కార్యోన్ముఖుణ్ణి చేశాడు. మానసిక బలహీనత హేయమైనది. మానసికంగా కుంగిపోయిన వ్యక్తికి ధైర్యం చెబితే... ఆ బలహీనత తొలగిపోతుంది. ఆ వ్యక్తి తనలో ఉన్న మంచి లక్షణాలు గుర్తించేలా చేస్తే అతను శక్తిమంతుడవుతాడు. అర్జునుడికి కృష్ణుడు బోధించింది ఇదే!


ఒక వ్యక్తి జీవితంలో సరిగ్గా స్థిరపడకపోతే, దానికి కారణం ఇతరులేనని ఆరోపిస్తాడు. తన వైఫల్యాలకు తనే కారణం అని గుర్తించడు. మనస్సునూ, ఇంద్రియాలనూ తన ఆధీనంలో ఉంచుకుంటే తనకు తానే మిత్రుడు. అలా కానినాడు తనకు తానే శత్రువు. కాబట్టి మనస్సును నిగ్రహించుకోవడం అత్యావశ్యకం. మనస్సును నియంత్రించగలిగితేనే ఇంద్రియాలు దాని స్వాధీనంలో ఉంటాయి. దీనికి క్రమశిక్షణతో కూడిన అభ్యాసం అవసరం. మొదట ఇది కష్టంగానే అనిపిస్తుంది. అలవాటయ్యాక ఆనందాన్ని ఇస్తుంది. క్రమేపీ మనసు వశంలోకి వస్తుంది. మనసు వశమైతే సాధించలేని కార్యం ఏదీ ఉండదు. ‘యత్తదగ్రే విషమివ పరిణామే అమృతోపమమ్‌’ అని భగవద్గీత (18-37) చెప్పిన అమృతవాక్కు సారాంశం ఇదే!


ఆధ్యాత్మిక గీత...

శారీరకంగా, మానసికంగా దృఢత్వం పొందినా... ఆధ్యాత్మిక వికాసం లేకపోతే మానవ జన్మకు సార్థకత లేదు. పరిపూర్ణత సిద్ధించదు. రాగద్వేషాలు, ఇష్టానిష్టాలు, భేద బుద్ధి తొలగాలంటే ఆధ్యాత్మిక వికాసం పొందాలి. చైతన్యం కలగాలి. సమదృష్టి పెంపొందాలి. భగవంతుడు ఉన్నాడనీ, అతడే జగన్నాటక సూత్రధారి అనీ గ్రహించాలి. ‘మయిసర్వ మిదం ప్రోతం సూత్రే మణిగణా ఇవ’ అంటూ భగవద్గీత ఏడో అధ్యాయం ఏడో శ్లోకంలో దీన్నే శ్రీకృష్ణుడు బోధించాడు. ఎవరు ఏ పని చేసినా, తిన్నా, దానం చేసినా, తపస్సు చేసినా... ఫలితం ఆశించకుండా తనకే అర్పించాలని సూచించాడు (భగవద్గీత 9-27). అలా చేసినప్పుడు శరణాగతి ఏర్పడుతుంది. ఆధ్యాత్మిక వికాసం కలుగుతుంది. భగవద్గీతను జీవితంలో నిత్యపఠనీయాంశంగా చేసుకోగలిగితే అది ‘జీవనగీత’గా దారి చూపిస్తుంది. 


 ఎ. సీతారామారావు

8978799864



Updated Date - 2020-12-25T05:48:29+05:30 IST