నేటి సాయంత్రం.. శ్రీశైలం గేట్ల ఎత్తివేత!

ABN , First Publish Date - 2021-07-28T08:02:06+05:30 IST

ఎగువ నుంచి వరద కొనసాగుతుండడంతో శ్రీశైలం ప్రాజెక్టులోకి భారీగా నీరు చేరుతోంది. మంగళవారం రాత్రి 8 గంటలకు 4.57 లక్షల క్యూసెక్కుల వరద ప్రవాహం వచ్చింది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 877.23 అడుగుల మేర నీరుంది. 215 టీఎంసీల నిల్వ సామర్థ్యానికి గాను

నేటి సాయంత్రం.. శ్రీశైలం గేట్ల ఎత్తివేత!

ఎగువ నుంచి ప్రాజెక్టుకు భారీగా వస్తున్న వరద నీరు

24గంటల వ్యవధిలో 30టీఎంసీల రాక.. 4.57లక్షల క్యూసెక్కులకుపైగా ప్రవాహం

మరో 3 రోజుల పాటు ఇదే ఉధృతి..

80% నిండిన డ్యాం.. 174 టీఎంసీలకు నిల్వ


హైదరాబాద్‌/ధరూరు/దోమలపెంట, జూలై 27(ఆంధ్రజ్యోతి): ఎగువ నుంచి వరద కొనసాగుతుండడంతో శ్రీశైలం ప్రాజెక్టులోకి భారీగా నీరు చేరుతోంది. మంగళవారం రాత్రి 8 గంటలకు 4.57 లక్షల క్యూసెక్కుల వరద ప్రవాహం వచ్చింది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 877.23 అడుగుల మేర నీరుంది. 215 టీఎంసీల నిల్వ సామర్థ్యానికి గాను 174.29 టీఎంసీలకు చేరింది. మంగళవారం ఉదయం 6 గంటలకు తీసిన లెక్కల ప్రకారం 24 గంటల్లో డ్యాంలోకి 30 టీఎంసీల నీరు వచ్చింది. అంతకుముందు రెండు రోజులు వరుసగా 26, 28 టీఎంసీల నీరు చేరింది. అంటే.. ఈ మూడు రోజుల్లోనే దాదాపు 85 టీఎంసీల నీరు వచ్చింది. కృష్ణా ప్రాజెక్టులతో పాటు, తుంగభద్ర నుంచి నీటి విడుదల కొనసాగుతుండడంతో మరో మూడు రోజుల పాటు రోజుకు శ్రీశైలానికి 4 లక్షల క్యూసెక్కుల పైగా వరద ప్రవాహం వచ్చే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో బుధవారం మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 5 గంటల మధ్య గేట్లను పది అడుగుల మేర ఎత్తనున్నట్లు ప్రాజెక్టు ఎస్‌ఈ వెంకటరమణయ్య తెలిపారు.


నాలుగైదు రోజులు గేట్లు తెరిచి ఉంచే అవకాశాలున్నాయి. దీంతో లోతట్టు ప్రాంతాల్లో నివాసం ఉంటున్నవారిని అధికారులు అప్రమత్తం చేశారు. ఈ నెలలో 27 రోజుల్లో శ్రీశైలంలోకి 131 టీఎంసీలు చేరడం విశేషం. మరోవైపు కర్ణాటకలోని ఆలమట్ట్టికి 3.61 లక్షల క్యూసెక్కుల వరద వస్తుండగా.. ఔట్‌ ఫ్లో 3 లక్షల క్యూసెక్కులుగా ఉంది.  తుంగభద్రకు 1.48 లక్షల క్యూసెక్కుల ఇన్‌ ఫ్లో వస్తుండగా 1.31 లక్షల క్యూసెక్కులను దిగువకు పంపుతున్నారు.  జూరాలకు మంగళవారం 3.28 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వచ్చింది. 31 గేట్లను ఎత్తి 3.12 లక్షల క్కూసెక్కులను విడుదల చేస్తున్నారు.  కాగా, శ్రీశైలం ఎడమ గట్టు విద్యుత్కేంద్రంలో 5 యూనిట్ల ద్వారా 14.148 మిలియన్‌ యూనిట్ల విద్యుదుత్పత్తి చేశారు.


శ్రీరాంసాగర్‌కు 5,585 క్యూసెక్కులు

నిజామాబాద్‌ జిల్లాలోని శ్రీరామసాగర్‌ ప్రాజెక్టుకు 5,585 క్యూసెక్కుల వరద వస్తోంది. 36 మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తి కొనసాగుతోంది. కామారెడ్డి జిల్లాలోని నిజాంసాగర్‌ ప్రాజెక్టులోకి 679 క్యుసెక్కుల వరద వచ్చి చేరుతోంది. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ, అన్నారం బ్యారేజీల నుంచి దిగువకు నీటి విడుదల కొనసాగుతోంది. మేడిగడ్డ బ్యారేజీలోకి 2.48 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండగా 79 గేట్లను ఎత్తి 2.60 లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. అన్నారం బ్యారేజీలోకి 39వేల 600 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో చేరుతుండగా ఏడు గేట్లను ఎత్తి 31,500 క్యూసెక్కులను విడుదల చేశారు.


కృష్ణా ట్రైబ్యునల్‌ విచారణ వాయిదా

తెలంగాణ దాఖలు చేసిన పిటిషన్‌పై క్రాస్‌ ఎగ్జామినేషన్‌ చేయడానికి వీలుగా 28, 29, 30వ తేదీల్లో జరగాల్సిన కృష్ణా ట్రైబ్యునల్‌ విచారణ వాయిదా పడింది. కృష్ణా జలాలపై ఇరు రాష్ట్రాలు పిటిషన్లు వేయగా ఏపీని ఇప్పటికే క్రాస్‌ ఎగ్జామినేషన్‌ చేసేశారు. ట్రైబ్యునల్‌లోని ఒక సభ్యుడి ఆనారోగ్యంతో తెలంగాణ పిటిషన్‌పై క్రాస్‌ ఎగ్జామినేషన్‌ను వాయిదా వేశారు. ట్రైబ్యునల్‌ సమావేశాల్లో పాల్గొనేందుకు తెలంగాణ బృందం 4 రోజుల క్రితమే ఢిల్లీ వెళ్లింది. అంశాల వారీగా జవాబులు చెప్పేందుకు సమాయత్తమైన అధికారులు నిరాశతో వెనుదిరిగారు. 


శ్రీశైలం డ్యాం గేట్ల ద్వారా లీకవుతున్న నీరు

కొన్ని రోజులుగా వరద ఉధృతి నేపథ్యంలో శ్రీశైలం డ్యాం గేట్ల నుంచి నీరు లీకవుతోంది. మార్చి, ఏప్రిల్‌, మే నెలల్లో గేట్లకు మరమ్మతులు చేపట్టినప్పటికీ ఈ పరిస్థితి తలెత్తడం గమనార్హం. పనుల్లో నిర్లక్ష్యమే దీనికి కారణంగా భావిస్తున్నారు. ఇప్పటికే డ్యాం మరమ్మతులు పూర్తి చేశామని అధికారులు చెబుతుండగా.. గేట్ల రబ్బర్‌ సీల్‌ సక్రమంగా గాడిలో బిగించలేదు. దీంతో భారీగా నీరు లీకవుతున్నదని ఇంజనీర్లు అభిప్రాయపడుతున్నారు. ఈ విషయమై డ్యాం ఎస్‌ఈ వెంకటరమణయ్యను వివరణ కోరగా సీఈ ఆదేశాలుంటేనే వివరాలు తెలియజేస్తామని చెప్పారు. కాగా, కృష్ణా నదిలో.. శ్రీశైలం డ్యాంకు ఎగువన 44 కి.మీ. దూరంలో సోమవారం తెల్లవారుజామున భూ ప్రకంపనలు రావడంతో అధికారులు భద్రతా చర్యలపై దృష్టిసారించారు.

Updated Date - 2021-07-28T08:02:06+05:30 IST