Jun 22 2021 @ 00:17AM

ఓటీటీకి ‘లైగర్‌’?

విజయ్‌ దేవరకొండ కథానాయకుడిగా నటిస్తున్న పాన్‌ ఇండియా చిత్రం ‘లైగర్‌’ ఓటీటీ వేదికలో విడుదల కానుందా? అంటే... ‘కావొచ్చు’ అంటున్నాయి సినీ వర్గాలు. ఒకవేళ కరోనా మూడో దశ మళ్లీ లాక్‌డౌన్‌ విధించే పరిస్థితులు తీసుకొస్తే... ఓటీటీలో విడుదల చేయడమే మంచిదని భావిస్తున్నారట. అయితే, ముందు సినిమా సిద్ధం కావాలి. ఇప్పటికే చిత్రీకరణకు రెండుసార్లు కరోనా అడ్డుపడింది. ఈసారి కరోనాకు అవకాశం ఇవ్వకుండా త్వరగా మిగతా చిత్రాన్ని పూర్తి చేయనున్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో సెట్‌ రెడీగా ఉంది. ప్రతి సినిమాను చాలా వేగంగా పూర్తి చేయడం దర్శకుడు పూరి జగన్నాథ్‌కు అలవాటు. కరోనా వల్ల ఆయన కూడా నెమ్మదించక తప్పలేదు. ఇప్పుడు ముందు సినిమాను పూర్తి చేసి, ఆ తర్వాత ఓటీటీ వేదికలతో రేటు గురించి మాట్లాడాలనుకుంటున్నారట. ఓ ప్రముఖ ఓటీటీ నుంచి చిత్రానికి ఆఫర్‌ వచ్చిందని తెలిసింది. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుదల చేయనున్నారు. ఓటీటీ వేదికల నుంచి భారీ మొత్తాన్ని ఆశిస్తున్నారు. కరణ్‌ జోహార్‌, పూరి జగన్నాథ్‌, ఛార్మీ కౌర్‌, అపూర్వ మెహతా నిర్మిస్తున్న ఈ చిత్రంలో అనన్యా పాండే కథానాయిక.