వలస జీవితాల్లో వెలుగు

ABN , First Publish Date - 2020-10-01T05:37:57+05:30 IST

వలస కూలీలకు చేయూతనిచ్చారు శిప్రా శర్మ భూటాని...

వలస జీవితాల్లో వెలుగు

కరోనా కేసులు... ఆ తరువాత లాక్‌డౌన్‌ పరిస్థితులు... చేతిలో పని లేక... తినడానికి తిండి దొరక్క నలభై లక్షలమంది వలస కూలీలు సొంత రాష్ట్రాలకు తరలిపోయారు. మారిన తమబతుకు చిత్రాన్ని తలుచుకొంటూ... ఆకలితో అలమటిస్తూ... సాయం కోసం ఎదురుచూస్తున్న అలాంటి వారికి చేయూతనిచ్చారు శిప్రా శర్మ భూటాని. తన ‘కెపాసిటా కనెక్ట్‌’ సంస్థ ద్వారా ఈ విపత్కాలంలోనూ ఇరవై వేల మందికి పైగా వలస కూలీలకు నైపుణ్య శిక్షణ అందించి... ఉపాధి అవకాశాలు కల్పించి... వారి మోముల్లో చిరునవ్వులు పూయించిన ఆమె స్ఫూర్తిదాయక ప్రయాణం ఇది... 


విడ్‌-19 మహమ్మారి జనజీవనాన్ని అస్తవ్యస్తం చేసింది. ఈ ప్రభావం వలసలపై విపరీతంగా పడింది. పుట్టిన ఊరు... పెరిగిన ప్రాంతం వదిలి ఎక్కడో వేల కిలోమీటర్ల దూరంలో... పరాయి రాష్ట్రాల్లో పని పాట చేసి పొట్ట పోసుకొంటున్న వారి బతుకు చిందరవందర అయింది. పని చేసే చోట ఉండలేక... సొంత గూటికి చేరే మార్గం కనిపించక రాష్ట్రాల సరిహద్దుల్లో నిరీక్షించి నీరసించిపోయారు. చివరకు లాక్‌డౌన్‌ తరువాత అన్ని కష్టాలూ పడి ఇళ్లకు చేరితే... ఉపాధి లేక ఆకలితో అలమటించాల్సి దుస్థితి. చుట్టూ ఇలాంటి ఎన్నో దయనీయ దృశ్యాలు ‘కెపాసిటా కనెక్ట్‌’ వ్యవస్థాపకురాలు శిప్రా శర్మను కదిలించాయి. వారి కోసం ఏదైనా చేయాలి. సాధ్యమైనంతమందిని ఆదుకోవాలి. కానీ ఎలా? సరుకులు కొని ఇంటికి తీసుకెళ్లి ఇస్తే... అది తాత్కాలికమే అవుతుంది. అలా కాకుండా... ఎవరిపైనా ఆధారపడకుండా... వారి తిండి వారే సంపాదించుకోగలిగితే! ఈ సమస్యకు ఇదే సరైన పరిష్కారం అనుకున్నారామె. దాని కోసం ఏం చేయాలని ఆలోచిస్తుంటే ఆమె మదిలో మెదలిన ఆలోచనే నైపుణ్య శిక్షణ. 


పరిశ్రమలతో అనుసంధానం... 

ప్రపంచ బ్యాంక్‌ నివేదిక ప్రకారం కరోనా దెబ్బకు నలభై లక్షల మంది వలస కూలీలు ఉపాధి కోల్పోయారు. ఎక్కడో పనిచేసుకొంటున్నవారు తిరిగి వాళ్ల వాళ్ల ప్రాంతాలకు వెళ్లిపోవడం (రివర్స్‌ మైగ్రేషన్‌)తో ఆయా రాష్ట్రాలకు కొత్త సమస్యలు వచ్చిపడ్డాయి. వీటన్నింటినీ శిప్రా శర్మ అర్థం చేసుకున్నారు. సరిహద్దుల్లో ఉన్నప్పుడే వివిధ ప్రభుత్వ విభాగాల నుంచి వలసకార్మికుల వివరాలు, వారి నైపుణ్యాల వివరాలను సేకరించారు. ముందుగా తన ఆన్‌లైన్‌ ప్లాట్‌ఫామ్‌ ‘కెపాసిటా కనెక్ట్‌’ ద్వారా పలు కొర్పారేట్‌ సంస్థలు, పరిశ్రమలతో ఒప్పందం కుదుర్చుకున్నారు. ఆమె వద్దనున్న వలసల డేటాను వారి సర్వర్‌తో అనుసంధానం చేశారు. సాధ్యమైనంతమంది వలస కూలీలకు వాటిల్లో ఉపాధి అవకాశాలు కల్పించారు. 


ఖైదీలకు నైపుణ్య శిక్షణ... 

అవసరంలో ఉన్నవారికి సాయం అందించడం, దాని కోసం సవాళ్లను స్వీకరించడానికైనా వెనుకాడకపోవడం శిప్రా నైజం. ఎప్పుడూ తన ప్రపంచమే కాదు... చుట్టుపక్కలవారు కూడా బాగుండాలని కోరుకొనే ఆమె గతంలో ఎకనామిక్స్‌ ప్రొఫెసర్‌గా పనిచేశారు. 2008లోనే రాజస్తాన్‌లోని జైపూర్‌లో నైపుణ్య శిక్షణ కేంద్రాన్ని నడిపించారు. నాటి నుంచి కేంద్ర ప్రభుత్వ ‘నేషనల్‌ స్కిల్స్‌ డెవల్‌పమెంట్‌ కార్పొరేషన్‌’తో కలిసి ఎంతోమందికి వృత్తి విద్యా కోర్సులో శిక్షణ ఇచ్చారు. వీరిలో ఖైదీలు, అమరసైనికుల భార్యలు, యుద్ధం వల్ల దెబ్బతిన్న అఫ్ఘనిస్తాన్‌ మహిళలు ఉన్నారు. జైపూర్‌ కేంద్ర కారాగారంలోని మహిళా ఖైదీలకు బ్యూటీషియన్‌, కుకింగ్‌ క్లాస్‌లు తీసుకున్నారు. వెదురు, కాగితంతో రకరకాల ఉత్పత్తులు తయారు చేయడంలో శిక్షణ ఇప్పించారు. వాటిని జైలు షాప్‌లోనే విక్రయించారు. ఆ స్ఫూర్తి, అనుభవంతోనే వలసకూలీలకు కూడా నైపుణ్య శిక్షణ ప్రారంభించారు. 


విభిన్న రంగాల్లో మెరుగులు... 

వలస కూలీలకు ప్రస్తుత పరిస్థితులకు తగ్గట్టుగా ఆమె శిక్షణ ఇస్తున్నారు. తద్వారా వారు జీవనోపాధి పొందడమే ఆమె అంతిమ లక్ష్యం. ‘‘మార్చిలో లాక్‌డౌన్‌ ప్రకటించినప్పుడు లక్షల మంది వలస కూలీలు తమ సొంత రాష్ట్రాలకు పయనమయ్యారు. ముఖ్యంగా బిహార్‌, ఉత్తరప్రదేశ్‌, రాజస్తాన్‌ రాష్ట్రాలవారు. ఈ క్రమంలో మా మొదటి ప్రాధాన్యం... వారందరి వివరాలు సేకరించడం. అలా 55 లక్షల మంది వివరాలు సంపాదించాం. దాని ద్వారా వారు ఏఏ పనుల్లో నిష్ణాతులో తెలుసుకోగలిగాం. తరువాతి లక్ష్యం... ఇతర రంగాల్లో కూడా వారికి శిక్షణనివ్వడం. ప్రస్తుతం పీపీఈ కిట్లు, మాస్క్‌లకు విపరీతమైన డిమాండ్‌ ఉంది. వారికి వాటి తయారీ నేర్పించాం. దీనివల్ల చాలామంది సంబంధిత పరిశ్రమల్లో ఉద్యోగాలు లభించాయి. అలాగే ‘కెపాసిటా కనెక్ట్‌’ డేటాబేస్‌ నుంచి కంపెనీలే కావల్సిన వర్కర్లను ఎంచుకొనే అవకాశం కల్పించడంతో కొంత ప్రయాస తప్పింది’’ అంటారు శిప్రా శర్మ. 


అంతేకాదు... ఎక్కడవున్నా వలస కార్మికులు వివిధ ఉత్పత్తుల తయారీ నేర్చుకొనేలా ‘స్కిల్‌ మిత్రా’ పేరుతో ఓ యాప్‌ను రూపొందించారు షిప్రా శర్మ.


బడా సంస్థలతో అనుసంధానం... 

‘కెపాసిటా కనెక్ట్‌’ చొరవతో వేలమంది వలస కార్మికుల జీవితాల్లో మార్పు వచ్చింది. డెలివరీ బాయ్‌గా ఒకరు... మాస్క్‌లు కుట్టి ఇంకొకరు... నర్సుగా మరొకరు... సరికొత్త వృత్తుల్లో ఇమిడిపోయారు. ఒక్కొక్కరు సగటున నెలకు రూ.15 వేలు సంపాదించుకొంటున్నారు. ఇప్పటి వరకు ఈ సంస్థ ద్వారా 20 వేల మంది ఉపాధి పొందారు. హెల్త్‌కేర్‌, లాజిస్టిక్స్‌ రంగాల్లో ఉద్యోగాలకు అధిక డిమాండ్‌ ఉంటోంది. 


‘‘అమెజాన్‌, పేటీఎమ్‌, పోర్టియా, రాజస్థాన్‌ టెక్స్‌, జస్ట్‌ క్లీన్‌, స్విగ్గీ, జొమాటో వంటి కంపెనీలకు ఉద్యోగులను అందించగలిగాం. ఇవికాకుండా రాజస్థాన్‌, యూపీల్లోని పరిశ్రమల్లో కూడా అవకాశాల కోసం ప్రయత్నిస్తున్నాం. మా డేటాబే్‌సలో ఉన్న 55 లక్షల మందికీ బల్క్‌ ఎస్‌ఎంఎ్‌సల ద్వారా ధైర్యం చెబుతున్నాం. సొంత రాష్ట్రాల్లో వారికి ఉపాధి లభించేలా కృషి చేస్తున్నాం. అలాగే ఈ ప్రక్రియను వేగవంతం చేయడానికి ఉద్యోగ మేళాలు కూడా నిర్వహిస్తున్నాం’’ అని చెబుతున్నారామె. వలసల జీవితాల్లో వెలుగులు నింపేందుకు శిప్రా చేస్తున్న ప్రయత్నం అభినందనీయం.


‘స్కిల్‌ మిత్రా’ పేరుతో  రూపొందించిన యాప్‌లో మాస్క్‌లు ఎలా కుట్టాలి... డెలివరీ పర్సన్‌గా ఎలా మారాలి లాంటి వివరాలు  ఉంటాయి. అందరికీ అర్థమయ్యేలా ఐదు భాషల్లో యాప్‌ మెటీరియల్‌ రూపొందించాం. ఇక పలు రాష్ట్రాల్లో మేము ఏర్పాటు చేసిన నైపుణ్య శిక్షణ కేంద్రాల్లో వారం వారం తర్ఫీదునిస్తున్నాం.

Updated Date - 2020-10-01T05:37:57+05:30 IST