Abn logo
Dec 1 2020 @ 00:59AM

వెలుగుల వేడుక

  1. పుష్కర ఘాట్లలో భక్తుల రద్దీ
  2. శివాలయాల్లో కార్తీక దీపకాంతులు
  3. శ్రీశైలంలో లక్ష దీపోత్సవం
  4. శ్రీమఠంలో తెప్పోత్సవం


(న్యూస్‌ నెట్‌వర్క్‌, ఆంధ్రజ్యోతి) పుష్కర వేడుకలు తుది దశకు చేరాక భక్తుల రద్దీ పెరుగుతోంది. కార్తీక పౌర్ణమి,  సోమవారం కలిసి రావడంతో శివాలయాలు, తుంగభద్ర పుష్కరఘాట్లు దీప కాంతులను సంతరించుకున్నాయి. భక్తులు లేక  బోసిపోయిన పుష్కర ఘాట్లను  కార్తీక పౌర్ణమి శోభాయమానం చేసింది.  మేలిగనూరు నుంచి సంగమేశ్వరం వరకు  23 ఘాట్లలో  భక్తులు కార్తీక, పుష్కర స్నానాలు చేశారు. 


భక్త సందోహం

కర్నూలు(న్యూసిటీ): నగరంలోని రాంభొట్ల, రాఘవేంద్ర మఠం ఘాట్‌లలో భక్తుల సంఖ్య పెరిగింది. ఉదయం 6 గంటల నుంచి పుష్కర స్నానాలు ఆచరించి కార్తీక దీపాలను నదిలో వదిలారు. అనంతరం ఘాట్‌ దగ్గరలో ఉన్న శివాలయంలో దీపాలు వెలిగించారు. 


పులకించిన సంగమేశ్వరం

ఆత్మకూరు/కొత్తపల్లి: సప్తనదుల సంగమేశ్వర క్షేత్రం పుష్కరాలు 11వ రోజు కళకళలాడింది. కార్తీక పౌర్ణమి కావడం వల్ల భక్తులు విశేష సంఖ్యలో తరలివచ్చారు. పుష్కర జలాలతో సంప్రోక్షణ చేసుకున్నారు. మహిళలు నదీజలాల్లో దీపాలు వదిలారు. వాయనాలు సమర్పించారు. వారసులు పితృదేవతలకు పిండ ప్రదానం చేశారు. లలితా సంగమేశ్వరులను తెలకపల్లి రఘురామశర్మ పుష్కర జలాలచే అభిషేకించారు. ఎగువ ఉమామహేశ్వరాలయంలో పూజలు చేశారు. ఒడ్డున తుంగభద్ర మాత విగ్రహం వద్ద మహిళలు దీపాలు వెలిగించారు. క్షేత్రంలో పుష్కర బృహస్పతి గాయత్రీ యాగం కొనసాగింది. సాయంత్రం పురోహితులు గంగహారతి ఇచ్చారు. 


నేడు కళ్యాణోత్సవాలు

పుష్కరాల ముగింపు సందర్భంగా మంగళ వారం సాయంత్రం సంగమేశ్వరంలో దేవతా మూర్తులకు కళ్యాణోత్సవాన్ని నిర్వహిస్తామని ఆలయ పురోహితులు తెలకపల్లి రఘురామ శర్మ తెలిపారు. లలితా సంగమేశ్వరులకు, శ్రీదేవీ భూ దేవీ సమేత వెంకటేశ్వర్లకు, సీతారాముల వార్లకు, లక్ష్మీ సమేత నరసింహస్వామివార్లకు, రమా సమేత సత్యనారాయణ స్వామివార్లకు కళ్యాణం జరిపిస్తామని వెల్లడించారు. 


లక్ష దీపోత్సవం.. తెప్పోత్సవం

మంత్రాలయంలో సోమవారం రాత్రి లక్ష దీపోత్సవం వైభవంగా జరిగింది. మఠం ఘాట్‌ వద్ద భక్తులు దీపాలను వెలిగించారు. మొదటిసారి మంత్రాలయంలో తెప్పోత్సవం నిర్వహించారు. వేడుకను చూసేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. శ్రీమఠం నుంచి ప్రత్యేక పల్లకిలో రామచం ద్రుడు, ప్రహ్లాదరాయల ఉత్సవ మూర్తులను ఊరేగింపుగా నది వద్దకు తోడ్కొని వచ్చారు. నది వద్ద పూజలు చేశారు. అనంతరం అలంకరించిన తెప్పపై నదిలో ఊరేగించారు. పీఠాధిపతి సుభుదేంద్ర తీర్థులు ప్రత్యేక హారతులిచ్చారు. పండితులు నదీమతల్లికి హారతులు పట్టారు. 


కొలను భారతికి పూజలు

కొత్తపల్లి: నల్లమలలో కొలువైన కొలను భారతి క్షేత్రానికి భక్తులు పోటెత్తారు. అమ్మవారికి విశేష పూజలు నిర్వహించుకున్నారు. సప్త శివాలయాల ప్రాంగణంలో మహిళలు కార్తీక దీపాలు వెలిగించారు. పురోహితులు ప్రాతఃకాల సమయంలో అమ్మవారిని అభిషేకించారు. అమ్మవారి సన్నిధిలో తమ చిన్నారులకు తల్లిదండ్రులు అక్షర్యాభ్యాసం చేయించారు. వాసవీ సత్రంలో నిర్వాహకులు అన్నదానం చేశారు. క్షేత్రంలో భక్తులు తాగునీటికి ఇబ్బందులు పడ్డారు.


మంత్రాలయంలో రద్దీ

మంత్రాలయం/ ఎమ్మిగనూరు టౌన్‌:  మంత్రాలయా నికి భక్తులు పోటెత్తారు. తెలుగు రాష్ట్రాల నుంచే కాక కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు నుంచి పెద్ద ఎత్తున తరలివచ్చారు. మఠం వీఐపీ ఘాట్‌, మఠం ఘాట్‌ కిటకిటలాడాయి. షవర్ల కింద పుణ్యస్నానాలు చేసిన భక్తులు నదిలోకి దీపాలు వదిలి సూర్య నమస్కారాలు చేశారు. పలువురు పిండ ప్రదానం చేశారు. మాధవరం, చెట్నహళ్లి గ్రామాల వద్ద నదీ స్నానాలు ఆచరించారు. అనంతరం మంత్రాలయంలోని శివాలయంలో పూజలు నిర్వహించారు. మఠంలో గ్రామదేవత మంచాలమ్మ, రాఘవేంద్రస్వామి మూల బృందావనాన్ని దర్శించుకున్నారు. పౌర్ణమి సందర్బంగా మూలరాములకు, రాఘవేంద్రస్వామి బృందావనానికి పీఠాధిపతి సుభుదేంద్రతీర్థులు విశేష పూజలు చేశారు. భక్తులకు మంత్రాక్షితలిచ్చి ఆశీర్వదించారు. శ్రీగిరిపై లక్ష దీపోత్సవం

శ్రీశైలం: శ్రీశైలంలో పుష్కరిణి వద్ద దేవస్థానం వారు లక్ష దీపోత్సవం, పుష్కరిణికి దశవిధ హారతులను నిర్వహిం చారు. స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను అలంకరించి పూజాదికాలు జరిపారు. పుష్కరిణి ప్రాంగణమంతా దీపాలను వెలిగించారు. కార్తీకమాసం మూడో సోమవారాన్ని పురష్కరిం చుకొని భక్తులు తరలివ చ్చారు. నాగుల కట్ట వద్ద, గంగాధర మండపం వద్ద దీపాలు వెలిగించారు. వేకువజాము నుంచే దర్శనాలకు అనుమతించారు. ఆర్జిత అభిషేకాలు నిర్వహించారు. సాయంత్రం ఆకాశ దీపాన్ని వెలిగించారు. ఈవో కేఎస్‌ రామరావు పర్యవేక్షించారు.


నారసింహుడికి పూజలు

ఆళ్లగడ్డ: అహోబిలం లక్ష్మీ నరసింహస్వామిని భారీ సంఖ్యలో భక్తులు దర్శించుకున్నారు. ఉదయం 5 గంటల నుంచి స్వామివారి దర్శనానికి అనుమతి ఇచ్చారు. ఆనవాయితీగా భక్తులకు కార్తీక వనభోజనాన్ని ఏర్పాటు చేశారు.  ఆలయ ధ్వజస్తంభం వద్ద  సాయంత్రం భక్తులు కార్తీక దీపాలు వెలిగించారు. ఆలయ ప్రధాన అర్చకులు వేణుగోపాలన్‌, మఠం మేనేజర్‌ వైకుంఠస్వామి పాల్గొన్నారు

 

కార్తీక శోభ

మహానంది: కార్తీక సోమవారం, పౌర్ణమి సందర్భంగా మహానందికి వేలాది మంది భక్తులు వచ్చారు. రద్దీ నేపథ్యంలో తెల్లవారుజామునే భక్తులను అనుమతిం చారు. రాత్రి 9 గంటల వరకు నిరంతర దర్శనం ఏర్పాటు చేశారు. ఆలయ పరిస రాల్లో కేదారేశ్వర నోములు, సామూహిక అభిషేకాలను నిర్వహించుకొన్నారు. 

Advertisement
Advertisement
Advertisement