ప్రయాణం ప్రాణాంతకం..!

ABN , First Publish Date - 2022-08-01T06:13:26+05:30 IST

వరుస వానలు.. రోడ్లపై గుంతలు.. కంకర.. వీటికి తోడు అంధకారం.. వెరసి మహానగర రహదారులపై ప్రయాణం ప్రాణాల మీదకు తెస్తోంది.

ప్రయాణం ప్రాణాంతకం..!

గో’దారు’ల్లో  కనిపించని మార్గం

ప్రమాదాల బారిన పడుతోన్న వాహనదారులు

ప్రధాన రహదారుల్లో వెలగని వీధి దీపాలు

ఫిర్యాదు చేసినా పట్టించుకోని జీహెచ్‌ఎంసీ


హైదరాబాద్‌ సిటీ, జూలై 31 (ఆంధ్రజ్యోతి): వరుస వానలు.. రోడ్లపై గుంతలు.. కంకర.. వీటికి తోడు అంధకారం.. వెరసి మహానగర రహదారులపై ప్రయాణం ప్రాణాల మీదకు తెస్తోంది. మోస్తరు వర్షానికే గోదారులయ్యే రహదారులపై గుంతలు, కంకర కనిపించవు. ఇక వీధి దీపాలు వెలగకుంటే పరిస్థితి..? ఊహించుకుంటేనే వామ్మో.. అనిపిస్తుంది కదూ.. నగరంలోని మెజార్టీ రహదారులపై ఇలాంటి పరిస్థితుల్లోనే వాహనదారులు ప్రయాణిస్తున్నారు. ఎక్కడ ఏం ఉందో..? ఎప్పుడు ఏం జరుగుతుందో..? అన్న భయంతో జాగ్రత్తగా వెళ్తోన్నా.. కొందరికి ప్రమాదాలు తప్పడం లేదు. ఈ క్రమంలో కొందరికి కాళ్లు, చేతులు విరుగుతుండగా.. ఇంకొందరు స్వల్ప గాయాలతో బయటపడుతున్నారు. గతంలో రోడ్డు గుంతల వద్ద ప్రమాదం జరిగి ప్రాణాలు కోల్పోయిన ఘటనలూ ఉన్నాయి. వీధి దీపాల నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించినట్టు జీహెచ్‌ఎంసీ చెబుతోన్నా.. క్షేత్రస్థాయిలో మాత్రం పరిస్థితి అధ్వానంగా ఉంది. 

అయినా.. అంతే...

గ్రేటర్‌లో 4.93 లక్షల ఎల్‌ఈడీ వీధి దీపాల ఏర్పాటు, నిర్వహణను కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఎనర్జీ ఎఫిషియేన్సీ సర్వీసెస్‌ లిమిటెడ్‌(ఈఈఎ్‌సఎల్‌)కు జీహెచ్‌ఎంసీ అప్పగించింది. ఐదేళ్లపాటు నిర్వహణ ఆ సంస్థ బాధ్యతే. విద్యుత్‌ ఆదాతోపాటు.. సాంకేతిక పరిజ్ఞానం వినియోగించి మెరుగైన నిర్వహణ చేస్తుందని ఈఈఎ్‌సఎల్‌కు బాధ్యత అప్పగించామని అధికారులు చెప్పారు. సీజన్‌లను బట్టి నిర్ణీత సమయానికి వీధి లైట్లు వెలగడం/బంద్‌ అయ్యేలా టైమర్లు అమర్చామని ప్రకటించారు. ఫిర్యాదుల స్వీకరణ, త్వరతగతిన పరిష్కరించేందుకు ప్రత్యేక వ్యవస్థ అందుబాటులోకి తీసుకువచ్చినట్టు పేర్కొన్నారు. అయినా క్షేత్రస్థాయిలో పరిస్థితులు పూర్తి భిన్నంగా ఉన్నాయి. కొన్ని ప్రాంతాల్లో పగలూ వీధి దీపాలు వెలుగుతుండగా.. ఇంకొన్ని చోట్ల రాత్రి కూడా వెలిగే పరిస్థితి లేదు. రోజుల తరబడి లైట్లు వెలగడం లేదని సర్కిల్‌, జోనల్‌ స్థాయి అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకునే పరిస్థితి లేదు. తాజాగా జూబ్లీహిల్స్‌లోని అపోలో ఆస్పత్రి చౌరస్తా నుంచి మహరాజ అగ్రసేన్‌ చౌరస్తా వరకు వీధి దీపాలు వెలగలేదు. బంజారాహిల్స్‌ రోడ్‌ నెంబర్‌-12లోనూ తరచూ వీధీ దీపాలు వెలగవు.  

వేర్వేరుగా ఫిర్యాదులు.. 

వీధి దీపాల సమస్యలపై ఫిర్యాదు చేసేందుకు అందుబాటులోకి తీసుకువచ్చిన ఏ వ్యవస్థా సక్రమంగా పని చేయడం లేదు. జీహెచ్‌ఎంసీ కంట్రోల్‌ రూమ్‌తోపాటు, డయల్‌-100, మై జీహెచ్‌ఎంసీ యాప్‌, ట్వ్టిట్టర్‌ ద్వారా ఫిర్యాదు చేసే అవకాశం ఉండగా.. ఇటీవల ఈఈఎ్‌సఎల్‌ ద్వారా మొబైల్‌ యాప్‌, టోల్‌ ఫ్రీ నెంబర్‌, ఈ మెయిల్‌, వెబ్‌ పోర్టల్‌నూ అందుబాటులోకి తీసుకువచ్చారు. వేర్వేరుగా ఫిర్యాదులు వస్తుండడంతో.. పరిష్కారంలో కొంత అయోమయం నెలకొందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. కంట్రోల్‌ రూమ్‌లో సిబ్బంది వీధి దీపాల ఫిర్యాదులను అంత సీరియ్‌సగా తీసుకోవడం లేదని, సంబంధిత అధికారులకు సమాచారమివ్వడంలోనూ జాప్యం చేస్తున్నారని సంస్థలోని విద్యుత్‌ విభాగం వర్గాలు చెబుతున్నాయి. 

తరచూ వీధి దీపాలు వెలగని కారిడార్లలో కొన్ని..

 మసాబ్‌ట్యాంక్‌ - లక్డీకాపూల్‌  లిబర్టీ జంక్షన్‌- హిమాయత్‌నగర్‌ వై జంక్షన్‌ అంబర్‌పేట గాంధీ బొమ్మ- రామంతాపూర్‌  ప్రశాసన్‌నగర్‌ ఫ ఈఎ్‌సఐ సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రి రోడ్‌ ఎస్‌ఆర్‌ నగర్‌ కాలనీ ఫ రామానాయుడు స్టూడియో రోడ్‌ ఫ అత్తాపూర్‌- కిషన్‌బాగ్‌ ఫ హైదర్‌నగర్‌- అత్తాపూర్‌ ఫ తాడ్‌బన్‌ చౌరస్తా ఫ నేషనల్‌ పోలీస్‌ అకాడమీ రోడ్‌ ఫ విజయపురి కాలనీ, ఉప్పల్‌ ఫ హబ్సిగూడ - సికింద్రాబాద్‌ 

Updated Date - 2022-08-01T06:13:26+05:30 IST