అక్కడ అలా.. ఇక్కడ ఇలా..!

ABN , First Publish Date - 2020-06-06T09:52:12+05:30 IST

మందసలో పేదల కోసం సేకరించిన స్థలం ఇది. సర్వేనెంబరు 101/2లో మొత్తం రెండు పార్టుల్లో ఉన్న ఈ 7.17 ఎకరాలను అధికారులు చదును చేసి.. అంతర్గత రహదారులు వేశారు.

అక్కడ అలా.. ఇక్కడ ఇలా..!

ఇళ్ల స్థలాలు చదును చేయడానికే రూ.64 లక్షల బిల్లులా?


పలాస/మందస, జూన్‌ 5:

మందసలో పేదల కోసం సేకరించిన స్థలం ఇది. సర్వేనెంబరు 101/2లో మొత్తం రెండు పార్టుల్లో ఉన్న ఈ 7.17 ఎకరాలను అధికారులు చదును చేసి.. అంతర్గత రహదారులు వేశారు. ఇందుకోసం రూ.64 లక్షలు ఖర్చయిందట. ఇప్పటివరకు రూ.46.86 లక్షల మేర బిల్లు చేసినట్లు తెలిసింది. మిగిలిన బిల్లులు త్వరలోనే ఖాతాల్లోకి జమవుతాయి. వాస్తవంగా పది ఎకరాల లోపు ఉన్న స్థలాన్ని నిబంధనల మేరకు చదును చేయడానికి రూ.3 లక్షలకు మించి అవ్వదు. కానీ అధికారులు మాత్రం చదును కోసమే రూ.64 లక్షలు ఖర్చు చేయడం చర్చనీయాంశంగా మారింది. 


50 ఎకరాల చదునుకు రూ.16 లక్షలే..!

పలాస-కాశీబుగ్గ మునిసిపాలిటిలో పేదల కోసం రామకృష్ణాపురంలోని సర్వేనెంబర్లు 157, 158, 159, 160, 162లో మొత్తం 50 ఎకరాల స్థలాన్ని అధికారులు సేకరించారు. రైతులకు నష్టపరిహారం చెల్లిస్తామని ఒప్పించారు. కొండలు, గోతులు, మొక్కలతో నిండిన ఈ స్థలాన్ని చదును చేసి పక్కా వెంచరుగా మార్చడానికి కేవలం రూ.16 లక్షలు మాత్రమే ఖర్చయింది. 


మందస, పలాస ప్రాంతాల్లో స్థలాల చదునుకు ఉన్న వ్యత్యాసాన్ని గమనిస్తే ఎవరికైనా నిధులు పక్కదోవ పట్టాయనే అనుమానం రాకమానదు. కేవలం ఓ పార్టీ నాయకులను ప్రసన్నం చేసుకోవడానికి అధికారులు ఈ విధంగా అదనపు ఖర్చులు చేసినట్లు స్థానికంగా ప్రచారం జరుగుతోంది. మందసలో పట్టణ సొగసులు కూడా లేవు. స్థలాల చదును కోసమే ఇంతభారీగా నిధులు ఖర్చు చేసి అధికారులు చేతివాటం ప్రదర్శించారని పలువురు చర్చించుకుంటున్నారు.


పలాస, వజ్రపుకొత్తూరు మండలాల్లో మాత్రం రాజకీయ నాయకుల ప్రమేయం ఉన్నా, భూములు కొనుగోలుకు    భారీగా చేతులు మారాయనే ప్రచారాలు తప్ప.. చెల్లింపులు లేవని స్పష్టమవుతోంది. రైతుల భూముల సేకరణలో పలాస ఉద్దానం ప్రాంతానికి చెందిన ఓ మహిళా ప్రతినిధి అధికారులు-రైతులకు అనుసంధాన కర్తగా వ్యవహరించారు. ఇదిలా ఉండగా పలాసలో కొండలు పిండిచేసి కొంతవరకు రహదారులకు వినియోగించినా, కంకర అమ్మకాలు కూడా యథేచ్ఛగా సాగాయి.


అధికార పార్టీకి చెందిన ముగ్గురు నాయకులు ఈ వ్యవహారంలో కీలకపాత్ర పోషించారన్నది స్పష్టమవుతోంది. వీరికి అధికారులు కూడా సహకరించారని అప్పట్లో ప్రచారం జరిగినా.. అంతా ఒకేపార్టీకి చెందిన వారు కావడంతో ఈ అంశం వెలుగుచూడలేదు. మందస మండలంలో జరిగిన తంతుపై ఉన్నతాధికారులు దృష్టి సారించినట్లయితే మొత్తం వ్యవహారం బయటపడే అవకాశం ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు. 

Updated Date - 2020-06-06T09:52:12+05:30 IST