నివురుగప్పిన నిప్పులా నిరుద్యోగ తెలంగాణ

ABN , First Publish Date - 2020-06-24T05:53:57+05:30 IST

తెలంగాణ ఉద్యమమే నీళ్లు, నిధులు, నియామకాల పునాదుల మీద ఏర్పడ్డది. ఇటీవల పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యుడు విఠల్ నియామకాలపై ఓ ప్రకటన చేస్తూ అదో పెద్ద సబ్జెక్టు, ఎవరికీ అర్థం కాదు,...

నివురుగప్పిన నిప్పులా నిరుద్యోగ తెలంగాణ

తెలంగాణ ఉద్యమమే నీళ్లు, నిధులు, నియామకాల పునాదుల మీద ఏర్పడ్డది. ఇటీవల పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యుడు విఠల్ నియామకాలపై ఓ ప్రకటన చేస్తూ అదో పెద్ద సబ్జెక్టు, ఎవరికీ అర్థం కాదు, ఎవరు అర్థం చేసుకోలేరు అని వ్యాఖ్యానించడం విడ్డూరంగా అనిపించింది. నిజంగా ఇది ఎవరికీ అర్థం కాని సబ్జెక్టా? ప్రజలకు, నిరుద్యోగులకు తెలవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. 


ఇంటికొక ఉద్యోగం–లక్ష ఉద్యోగాలన్నది తెలంగాణ సాధించిన తక్షణమే 2014లో తీర్చాల్సిన ఉద్యమ నినాదం. దానిని 2014 నుండి 2020 వరకు పాడిందే పాట అన్న చందంగా ప్రభుత్వం, పబ్లిక్ సర్వీస్ కమిషన్ సాగదీస్తూ వచ్చాయి. అంతేగాక పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యుడే వేరే డిపార్ట్‌మెంట్లలో నింపిన ఉద్యోగాలతో కలిపి ఇప్పటివరకు లక్ష ఉద్యోగాలు నింపినం అని రాజకీయ ఉపన్యాసం చేస్తూ ప్రకటన చేయడం ఎంతవరకు సబబు?. తెలంగాణ సాధించక ముందే, శ్రీకృష్ణ కమిషన్ పర్యటించే నాటికే 89 వేల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని అది తన రిపోర్టులోనే పేర్కొంది. తెలంగాణ సాధించే నాటికి దాదాపుగా లక్షా 50 వేల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. కొత్త జిల్లాల ఏర్పాటుతో, పదవీ విరమణ చేసిన ఉద్యోగాలతో కలిపి ఆరు సంవత్సరాల తర్వాత దాదాపుగా మూడు లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయనేది అంచనా. ఆరు సంవత్సరాల తర్వాత కమిషన్ సభ్యుడు లక్ష ఉద్యోగ నియామకాల ఘనకీర్తిని ఇలా ప్రకటించడం వెనుక ఉన్న ఆంతర్యమేమిటో? ఉస్మానియా, కాకతీయ తదితర యూనివర్సిటీలలో చదువుతున్న నిరుద్యోగుల పట్ల ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు చాలా కక్షపూరితంగా ఉంది. ఆ వైఖరికి వత్తాసు పలుకుతూ ఒక ఉద్యమ సంఘం నాయకుడే ఇదో పెద్ద సబ్జెక్టు, ఎవరికీ అర్థంకాదన్నట్టు మాట్లాడటం సరికాదు. ఇది నాడు తెలంగాణ ఉద్యమంలో తమ చదువులను, భవిష్యత్తును త్యాగం చేసి అమరులైన విద్యార్థివీరులను అవమానించడమే.


తెలంగాణ ఉద్యమ సమయంలో నాటి రాజకీయ, ఉద్యోగ సంఘాల నాయకులు చెప్పిన మాయమాటలు మనం యాది చేసుకోవాలె. ఆంధ్ర పాలనలో పదో తరగతి పాసైన పోరలు పశువులు కాసుకోవడానికి పోతున్నరు, మన తెలంగాణ మనకు వస్తే పదో తరగతి పాసైన వాళ్లంతా పోలీసులు అవుతారు, విశ్వవిద్యాలయాల్లో చదువుతున్న నిరుద్యోగులు కలెక్టర్లు, డీఎస్పీలు, ప్రొఫెసర్లు, డిగ్రీ లెక్చరర్లు, జూనియర్ లెక్చరర్లు, ఎమ్మార్వోలు, ఎస్సైలు, పంతుళ్ళు అవుతారని ఊకదంపుడు ఉపన్యాసాలు ఇస్తే.. ఆ ఉపన్యాసాలకు ప్రభావితమైన తెలంగాణ నిరుద్యోగులు ఉరకమంటే ఉరికిర్రు, దూకమంటే దూకిర్రు, చావమంటే చచ్చిర్రు. నాడు తెలంగాణ విద్యార్థులు పిట్టల్లా రాలిపోతుంటే కేంద్రం తప్పనిసరై తెలంగాణ ఇచ్చిందనేది అక్షర సత్యం. సాధించిన తెలంగాణలో ఆ క్రెడిట్ విద్యార్థులకు దక్కకుండా చేసే వైఖరిని మొదటి రోజు నుండి మొదలుపెట్టింది ప్రభుత్వం. దానిలో భాగంగానే ఉస్మానియా వర్సిటీనీ నిర్లక్ష్యం చేయడం, నిధులు కేటాయించకపోవడం, కొత్త నియామకాలు చేపట్టకపోవడం జరిగాయి. ఇక్కడ చదువుకొని ఉద్యమాలు చేసిన విద్యార్థులను ఏ ఒక్క ఉద్యోగానికి పనికిరాకుండా ఒక పకడ్బందీ వ్యూహం సాగుతోంది. ఉస్మానియా ఉద్యమ చరిత్రను కాలగర్భంలో కలిపే ప్రయత్నంలో భాగంగానే ప్రైవేట్ యూనివర్సిటీల ఏర్పాటుకు అనుమతి ఇవ్వడం జరిగింది. ఉస్మానియా భూముల్లో అక్రమ నిర్మాణాలు జోరందుకుంటున్నాయి. ఇక్కడ చదువుకున్న నిరుద్యోగులకు ఉద్యోగాలు దక్కకుండా చేసే పకడ్బందీ వ్యూహంతో నోటిఫికేషన్లు వెలువడుతున్నాయి. జరిగిన నియామకాల్లో ఏ ఒక్క ఉద్యోగానికీ ఉస్మానియా, కాకతీయ తదితర విశ్వవిద్యాలయాల నిరుద్యోగులు పోటీ పడకుండా జాగ్రత్తగా నోటిఫికేషన్లు ఇచ్చారు. నాడు ఉద్యమంలో పాల్గొని, నేడు ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగులకు ఏమాత్రం అక్కరకు రాని నోటిఫికేషన్లు ఇచ్చి లక్ష ఉద్యోగాలు ఇచ్చాం ప్రకటనలు చేయడం బాధాకరం.


పోలీసు ఉద్యోగాలు దాదాపు 29,000, పంచాయతీరాజ్ ఉద్యోగాలు 9355, విద్యుత్ శాఖలో 7659, సింగరేణిలో 12,500 నింపామని సర్వీస్‌ కమిషన్‌ సభ్యులు చెబుతున్నారు. పోలీసు ఉద్యోగాలకు వయోపరిమితి గరిష్టంగా 30 సంవత్సరాలు మాత్రమే. నాడు తెలంగాణ ఉద్యమంలో కొట్లాడిన నిరుద్యోగుల ప్రస్తుత వయసు 30 సంవత్సరాల పైనే కాబట్టి ఈ ఉద్యోగాలకు వారు అనర్హులైనారు. అలాగే పదోతరగతి, ఇంటర్ అర్హతతో వచ్చిన పంచాయతీరాజ్ ఉద్యోగాలకు నాడు పీజీలు, పి.హెచ్‌డి లు చేసిన నిరుద్యోగులు పోటీ పడే అవకాశం లేదు. సంబంధిత ఉద్యోగాలను పదో తరగతి ఇంటర్ నిరుద్యోగులకి వదిలి వేయడం జరిగింది. విద్యుత్ సంస్థలో, సింగరేణిలో నింపిన ఉద్యోగాలు పూర్తిగా టెక్నికల్ ఉద్యోగాలు కనుక వాటితో ఉద్యమకారులకు ఎలాంటి సంబంధం లేదు. టిఎస్‌పిఎస్సీ ద్వారా నింపిన ఉద్యోగాలు ఉస్మానియా, కాకతీయ విద్యార్థులకు ఏమాత్రం ఉపయోగపడనివి. ఈ ఆరు సంవత్సరాల్లో టీఎస్‌పిఎస్సీ ఒక్కనాడు కూడా ప్రెస్ మీట్ పెట్టి నిరుద్యోగుల పరిస్థితి మీద చర్చ గాని, సమీక్ష కానీ, సమావేశం కానీ నిర్వహించలేదు. రోజురోజుకు పెరిగిపోతున్న వయోభారంతో అనేకమంది నిరుద్యోగులు డాక్టరేట్లు సాధించినప్పటికీ తమను తాము పోషించుకోలేక, తల్లిదండ్రులను పోషించలేక పలువురు ఆత్మహత్య చేసుకుంటున్నారు. నాడు ఉద్యోగాల కోసం కొట్లాడిన నిరుద్యోగలోకం కోరుకుంది బంగారు తెలంగాణ కాదు, బువ్వ పెట్టే తెలంగాణ, బతుకునిచ్చే తెలంగాణ. అందుకే, యావత్తు తెలంగాణ నిరుద్యోగ లోకానికి అడ్డాగా ఉన్న ఉద్యమ కేంద్రం ఉస్మానియా యూనివర్సిటీని రక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఉద్యమకారుడితో పాటు, మేధావులు, ప్రజా సంఘాలు, కవులు, కళాకారులు, విద్యార్థుల పైన ఉంది. 

సాంబశివగౌడ్ దేశగాని

(ఉస్మానియా జె.ఎ.సి. నాయకులు)

Updated Date - 2020-06-24T05:53:57+05:30 IST