ప్రగతిని విస్మరించి విమర్శలా!?

ABN , First Publish Date - 2020-06-25T06:20:18+05:30 IST

తెలంగాణ అవతరణ తర్వాత జరుగుతున్న సామాజిక, ఆర్థిక అభివృద్ధి పట్ల రాష్ట్రంలోనే కాదు, జాతీయ స్థాయిలో సామాజికవేత్తలు, మేధావుల్లో ఆసక్తి నెలకొన్నది. కుతూహలపూరితమైన చర్చ సాగుతున్నది...

ప్రగతిని విస్మరించి విమర్శలా!?

సమాజంలోని అన్ని వర్గాల ప్రజలకు అభివృద్ధి సంక్షేమ ఫలాలను అందించిన ఘనత కేసీఆర్ ప్రభుత్వానిదే అనటం అతిశయోక్తి కాదు. ఇది ఏదో రాజకీయ ప్రయోజనంతో అంటున్న మాట కాదు. క్షేత్ర స్థాయిలో అభివృద్ధి సంక్షేమ ఫలాలను అనుభవిస్తున్న వారి అభిప్రాయం. ఒక్క మాటలో చెప్పాలంటే ఇవ్వాళ తెలంగాణలో ప్రభుత్వం అందిస్తున్న పథకాల ఫలాలు అందుకోని సామాజిక వర్గమంటూ లేదు.


తెలంగాణ అవతరణ తర్వాత జరుగుతున్న సామాజిక, ఆర్థిక అభివృద్ధి పట్ల రాష్ట్రంలోనే కాదు, జాతీయ స్థాయిలో సామాజికవేత్తలు, మేధావుల్లో ఆసక్తి నెలకొన్నది. కుతూహలపూరితమైన చర్చ సాగుతున్నది. రాష్ట్ర ఏర్పాటు తర్వాత అనతికాలంలోనే జరుగుతున్న అభివృద్ధి సంక్షేమాల విషయంలో అందరిలోనూ అమితాసక్తి ఉన్నది. ఇన్నేండ్లుగా లేనిది ఇప్పుడెలా సాధ్యమైందన్నది అందరి ధర్మసందేహం. అలాగే, క్షేత్రస్థాయి వాస్తవాలను గమనంలోకి తీసుకోకుండానే తమవైన రాజకీయ స్వార్థ ప్రయోజనాలకోసం విమర్శలు చేస్తున్నవారూ కొంతమంది ఉన్నారు. వీటన్నింటినీ ఎలా అర్థం చేసుకోవాలి? 


తెలంగాణ రాష్ట్రసాధన ఉద్యమం నీళ్లు, నిధులు, నియామకాల కోసం జరిగిందన్నది విదితమే. అయితే వీటిని దేనికి దాన్ని విడదీసి చూపిస్తూ యాంత్రికంగా విమర్శలకు దిగటం దృష్టిలోపం, దృక్పథ లోపమే తప్ప మరేమీ కాదు. తెలంగాణ వచ్చిన తర్వాత నీళ్ల విషయంలో ఎంత కసరత్తు జరిగిందో, ఎంత పురోగతి ఉన్నదో ఎంత చెప్పుకొన్నా తక్కువే. ఎన్నో ఏండ్లుగా ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్న చందంగా ఉన్న తెలంగాణలోని ప్రాజెక్టులను ప్రజల ప్రయోజనాలకు అనుగుణంగా రీడిజైన్ చేసి ఈ ఆరేండ్లకాలంలో అనేక ప్రాజెక్టులను పూర్తిచేశారు. కరువుకూ, వలసలకూ ప్రతిరూపమైన మహబూబ్‌నగర్ మొదలు రాష్ట్రంలో లక్షా నలభై వేల ఎకరాలకు సాగునీరు అందించటమే దీనికి నిదర్శనం. దీంతో గతంలో ఎన్నడూ లేని స్థాయిలో పంటల దిగుబడి వచ్చి దేశస్థాయిలో చర్చ జరిగింది. ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఈ ఏడు సేకరించిన వరిధాన్యంలో సింహభాగం తెలంగాణ నుంచేనని స్వయంగా కేంద్ర అధికారులే చెప్పారు. అలాగే, వృథాగా సముద్రంలో కలుస్తున్న గోదావరి నీళ్లను తెలంగాణలో సాగుకోసం వినియోగించుకునేందుకు కాళేశ్వరం ప్రాజెక్టుకు ముఖ్యమంత్రి కేసీఆర్ రూపకల్పన చేశారు. బహుశా ప్రపంచంలోనే అతిపెద్ద ఎత్తిపోతల ప్రాజెక్టుగా, సమకాలీన చరిత్రలో మానవ నిర్మిత అద్భుత కట్టడంగా అది ప్రశంసలు అందుకుంటున్నది. కాళేశ్వరం ప్రాజెక్టు, దానికి అనుబంధంగా రిజర్వాయర్లు, కాలువల తవ్వకం ఇప్పటికే గరిష్ఠంగా పూర్తయ్యింది. మరో ఏడాది కాలంలో నిర్దేశించుకున్న లక్ష్యాలకు అనుగుణంగా రిజర్వాయర్లు అన్నీ పూర్తి అయితే తెలంగాణ అంతా సస్యశ్యామలం కావటం ఖాయం.


మంటికైనా ఇంటోడు కావాలని తెలంగాణలో సామెత. సీమాంధ్ర వలస పాలన తర్వాత అధికారం చేపట్టిన తెలంగాణ ఉద్యమ నేత కేసీఆర్ ఇంటోని తీరుగా ప్రజా సంక్షేమం పట్ల ఎంత నిబద్ధతతో వ్యవహరిస్తున్నారో ఆయన పాలనా తీరును బట్టి అవగతమవుతున్నది. ఆసరా పింఛన్లు, కల్యాణలక్ష్మి, వికలాంగుల పింఛన్లు, వృద్ధులకు ఆసరా, వివిధ మత వర్గాలకు అందిస్తున్న ఆర్థిక సంక్షేమ పథకాలు సంక్షేమ పాలనకు అద్దం పడుతున్నవి. అన్నింటికీ తలమానికంగా చెప్పుకోవాల్సింది రైతుబంధు పథకం. రైతుకు పెట్టుబడి రూపంలో ఏటా రెండుపంటలకు అందిస్తున్న ఆర్థిక సాయం వారికి జవజీవంగా నిలిచింది. సాగుకు మౌలిక అవసరాలైన విత్తనాలు, ఎరువులు, పురుగుమందులను సకాలంలో అందుబాటులో ఉంచటంతో పాటు, నకిలీ విత్తనాల బెడద నుంచి రైతాంగాన్ని ప్రభుత్వం కాపాడింది. కరోనా నేపథ్యంలో ప్రపంచమంతా అతలాకుతలమైన సందర్భంలో కూడా, రైతులు పండించిన పంటను కల్లాల దగ్గరే ప్రభుత్వం కొనుగోలు చేయటం రైతు సంక్షేమం పట్ల ప్రభుత్వానికి ఉన్న నిబద్ధతకు తార్కాణం.


దశాబ్దాలుగా వ్యవసాయరంగం సంక్షోభంలో కూరుకుపోయింది. దీనికి కారణం కేంద్ర ప్రభుత్వాలు మొదలుకొని రాష్ర్టాలదాకా ఏ ప్రభుత్వం కూడా రైతులు ఎదుర్కొంటున్న మౌలిక సమస్యల గురించి ఆలోచించలేదు, పట్టించుకోలేదు. పండించిన పంటకు గిట్టుబాటు ధర లేక రైతులు పురుగుమందే పెరుగన్నంగా తిని ఆత్మహత్యలకు పాల్పడిన దుస్థితి. దేశవ్యాప్తంగా ఒక అధ్యయనం ప్రకారం ఏటా మూడు లక్షల మంది దాకా రైతులు ఆత్మహత్యల పాలయ్యారు. ఇలాంటి సంక్లిష్ట పరిస్థితిలో అధికారం చేపట్టిన కేసీఆర్ వ్యవసాయరంగ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టిపెట్టి ఇప్పటికే అనేక సమస్యలను పరిష్కరించారు. ఇంకా పరిష్కరించాల్సినవి ఉన్నాయని చెప్తూ అన్నింటినీ దూరం చేయటం కోసం కంకణబద్ధులై కృషి చేస్తున్నారు. దీనిలో ప్రధానంగా చెప్పుకోవాల్సింది నియంత్రిత వ్యవసాయవిధానం. ప్రజా అవసరాలు, మార్కెట్ డిమాండ్ తదితర అంశాలను పరిగణనలోకి తీసుకొని పంటల సాగు ఉండాలని, ఏ రైతూ గిట్టుబాటు ధర లేక నష్టపోకూడదనే ఉద్దేశంతో కేసీఆర్ ప్రభుత్వం కృషిచేస్తున్నది. ఇవన్నీ చూసినప్పుడు తెలంగాణలో రైతే రాజుగా వెలుగొందే రోజు ఎంతో దూరంలో లేదని అర్థమవుతుంది. 


గ్రామీణ ప్రాంతంలోని వివిధ కుల వృత్తిదారుల సంక్షేమం, అభివృద్ధి కోసం తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధతో పనిచేస్తున్నది. చాకలి, మంగలి, గొల్ల కురుమ, గంగపుత్ర తదితర సామాజిక వర్గాల అభివృద్ధికోసం ప్రత్యేక ప్యాకేజీలు, ఆర్థిక సాయాలు అందుతున్నాయి. గొర్రెల పంపకం, చేప పిల్లల పెంపకంతో ఆయా వర్గాల అభివృద్ధికి చర్యలు తీసుకున్నారు. ఇలా చెప్పుకొంటూపోతే సమాజంలోని అన్ని వర్గాల ప్రజలకు ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ ఫలాలను అందించిన ఘనత ఒక్క కేసీఆర్ ప్రభుత్వానిదే అనటం అతిశయోక్తి కాదు. ఇది ఏదో రాజకీయ ప్రయోజనం తో అంటున్న మాట కాదు. క్షేత్ర స్థాయిలో అభివృద్ధి సంక్షేమ ఫలాలను అనుభవిస్తున్న వారి అభిప్రాయం. ఒక్క మాటలో చెప్పాలంటే ఇవ్వాళ తెలంగాణలో ప్రభుత్వం అందిస్తున్న పథకాల ఫలాలు అందుకోని సామాజిక వర్గమంటూ లేదు.


వలసవాద పార్టీ అయిన టీడీపీకి చెందిన, బీసీల నాయకుడిగా చెలామణి అవుతున్న, మలిదశ తెలంగాణ ఉద్యమంలో ప్రత్యక్షంగా కాని పరోక్షంగా కాని ఎప్పుడు జై తెలంగాణ అని నినదించని నేత ఒకరు ఈ మధ్య తెలంగాణలో నిరుద్యోగం పెరుగుతున్నదని, ప్రభుత్వం నియామకాలు చేపట్టకుండా ప్రజలను వంచించిందని విమర్శించారు! దేశమంతా తెలంగాణ సాధిస్తున్న ప్రగతి పట్ల ఆశ్చర్యం, ఆసక్తి కనబరుస్తున్న నేపథ్యంలో కూడా ఈ బీసీ నేతకు రాష్ట్రంలో అమలవుతున్న అభివృద్ధి సంక్షేమ పథకాలు, ఫలాలు కనిపించకపోవటం విడ్డూరమే. ఇవ్వాళ తెలంగాణ సమస్త రంగాల్లో సమగ్రాభివృద్ధి దిశగా పయనిస్తున్నది. ఐటీ రంగం మొదలుకుని వ్యవసాయం దాకా సమస్త ఉత్పాదక, సేవా రంగాలు ఎంతో పురోభివృద్ధి దిశగా ముందుకు పోతున్నాయి. వీటిని చూడనిరాకరించటం అభివృద్ధి నిరోధక రాజకీయ దివాలాకోరుతనం తప్ప మరోటి కాదు. ప్రతిపక్షాలు విమర్శనాత్మకంగా, నిర్మాణాత్మకంగా వ్యవహరించినప్పుడే ప్రజాస్వామ్యం ఫలప్రదం అవుతుంది. ప్రజలకు మరింత మేలు జరుగుతుంది. కానీ దురుద్దేశపూరిత నిందారోపణలు చేసినవారు మాత్రం ప్రజల అసహ్యానికి గురై చరిత్ర చెత్త కుప్పల్లోకి విసిరివేయబడుతారు. అందుకు ఎవరూ మినహాయింపు కాదు.

గోసుల శ్రీనివాస్ యాదవ్

Updated Date - 2020-06-25T06:20:18+05:30 IST