వాహనం అమ్మితే ఫాస్టాగ్‌ క్లోజింగ్‌ ఇలా

ABN , First Publish Date - 2021-01-30T05:32:49+05:30 IST

తమ వాహనాలను యజమానులు అమ్మిన పక్షంలో ఫాస్టాగ్‌ను వెంటనే వదిలించుకోవాల్సిందే. లేదంటే యజమాని జేబుకు చిల్లుపడుతుంది.

వాహనం అమ్మితే ఫాస్టాగ్‌ క్లోజింగ్‌ ఇలా

తమ వాహనాలను యజమానులు అమ్మిన పక్షంలో ఫాస్టాగ్‌ను వెంటనే వదిలించుకోవాల్సిందే. లేదంటే యజమాని జేబుకు చిల్లుపడుతుంది. అది ఎలాగంటే.... ప్రైవేటు, కమర్షియల్‌ వాహనాలకు ఫాస్టాగ్‌ను కేంద్ర రహదారులు, ఉపరితల రవాణా మంత్రిత్వ శాఖ తప్పనిసరి చేసిన విషయం తెలిసింది.

ఈ ఫాస్టాగ్‌ సహాయంతో టోల్‌ ఫీజు డిజిటల్‌ రూపంలో కట్‌ అవుతుంది. వినియోగదారుడు వ్యాలెట్‌ లేదంటే సేవింగ్స్‌ అకౌంట్‌ నుంచి నేరుగా సొమ్ము బదలాయింపు జరుగుతుంది. రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్‌(ఆర్‌ఎఫ్‌ఐడి) విధానంలో ఈ వసూలు జరుగుతుంది. ఈ నేపథ్యంలో వాహనాన్ని అమ్మివేసినప్పుడు ఫాస్టాగ్‌ను వదిలించుకోని పక్షంలో ఆపై టోల్‌ చెల్లింపులు సైతం ఆటోమేటిక్‌గా పాత యజమాని వ్యాలెట్‌ లేదంటే సేవింగ్స్‌ అకౌంట్‌ నుంచి కట్‌ అవుతూ ఉంటుంది. వాహనం రిజిస్ట్రేషన్‌ నంబర్‌తో ఈ ఫాస్టాగ్‌ లింక్‌ అయి ఉండటమే దీనంతటికీ అసలు కారణం. అలాగే వాహనం రిజిస్ట్రేషన్‌ నంబర్‌ కొనుగోలు చేసిన వ్యక్తి పేరుకు బదలాయింపు జరగకుంటే కూడా ఇబ్బందే. కొత్త యజమాని ఫాస్టాగ్‌ను పొందలేడు. 



వాహనాన్ని అమ్మిన వ్యక్తి ఫాస్టాగ్‌ను వదలించుకోడానికి సులువైన  పద్ధతి ఒకటి ఉంది. హెల్ప్‌లైన్‌ నంబర్‌ 1033కి ఫోన్‌ చేసి, రిక్వెస్ట్‌ పంపడం ద్వారా ఫాస్టాగ్‌ను తొలగించుకోవచ్చు. సదరు ఫాస్టాగ్‌ ప్రొవైడర్‌ సహాయంతోనూ వదిలించుకోవచ్చు. పేటీఎం(18001204210), ఐసిఐసీఐ బ్యాంక్‌ (18002100104), యాక్సిస్‌ బ్యాంక్‌ (management@axisbank.com), హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్‌ (18001201243) ల హెల్స్‌లైన్‌ నెంబర్లు ఈ విషయంలో తోడ్పడతాయి.


Read more