కష్ట కాలంలో కల్పతరువులా

ABN , First Publish Date - 2021-05-20T04:45:52+05:30 IST

ఇది ఒక విలయం. కోరానా కాలం. చేతిలో పని లేక... తినడానికి తిండి దొరక్క ఎందరో పేదలు ఇబ్బందులు పడుతున్నారు. మానవతా దృక్పథంతో వారి బాధలను తమవిగా భావించి స్పందిస్తున్నారు కొందరు

కష్ట కాలంలో కల్పతరువులా

ఇది ఒక విలయం. కోరానా కాలం. చేతిలో పని లేక... తినడానికి తిండి దొరక్క ఎందరో పేదలు ఇబ్బందులు పడుతున్నారు. మానవతా దృక్పథంతో వారి బాధలను తమవిగా భావించి స్పందిస్తున్నారు కొందరు. అలాంటి వారిలో ఒకరు... ముంబయి ఫ్యాషన్‌ డిజైనర్‌ గుర్మీన్‌ శ్రీవాస్తవ్‌. లాక్‌డౌన్లతో ఉపాధి కోల్పోయిన మహిళలకు పని కల్పించి ఆదుకొంటున్నారు... 


‘‘సృజన’... ముంబయి కేంద్రంగా నడిచే ఒక స్వచ్ఛంద సంస్థ. మూడేళ్ల కిందట దాన్ని నెలకొల్పాను. దీని గురించి చెప్పాలంటే ముందు నా గురించి నేను పరిచయం చేసుకోవాలి. మాది ఛండీఘడ్‌. అక్కడే ఫ్యాషన్‌ డిజైనింగ్‌ చదివాను. ఓ కంపెనీలో రెండేళ్లు పనిచేశా. అక్కడి నుంచి ఢిల్లీలోని ఎక్స్‌పోర్ట్‌ హౌస్‌లో మూడేళ్లు ఉద్యోగం. ఈ అనుభవంతో పెద్ద పరిశ్రమ నుంచి పిలుపు వచ్చింది. సీనియర్‌ మేనేజర్‌ హోదా. మంచి జీతం. కొన్నాళ్లకు పెళ్లయింది. దీంతో ఉద్యోగానికి విరామం ఇచ్చాను. పాప పుట్టింది. ప్రసవం సమయానికి బరువు బాగా పెరిగాను. ఇంట్లో ఉన్న బట్టలేవీ నాకు సరిపోవడంలేదు. చాలా షాపుల్లో వెతికాను. ఒకటో రెండో కనిపించాయి. మహిళలకు ఎక్స్‌ట్రా మార్జిన్స్‌తో డ్రెస్‌లు దొరకడం కష్టమని అప్పుడే అర్థమైంది. ఏ బ్రాండూ వాటిని తయారు చేయడానికి ఆసక్తి చూపడంలేదు. అది నాలో కొత్త ఆలోచనలకు బీజం వేసింది. 


మా అమ్మాయి పేరునే... 

గర్భధారణ క్రమంలో మహిళలు బరువు పెరగడం సాధారం. ఆ సమయంలో వారికి బీరువాల్లో ఉన్న డ్రెస్‌లు సరిపోవు. అవి వేసుకున్నా సౌకర్యాన్నివ్వవు. వీరిని దృష్టిలో పెట్టుకుని... ‘ఎక్స్‌ట్రా మార్జిన్స్‌’తో దుస్తులు అందుబాటులోకి తేవాలనుకున్నాను. వాటి వల్ల వారికి సౌలభ్యంగా ఉండాలి. ఎక్కువ సమయం ఒంటి మీద ఉన్నా ఎలాంటి ఇబ్బందీ కలగకూడదు. ఈ ఆలోచనతోనే 2012లో మా అమ్మాయి పేరు మీద ‘నెషాస్‌ సియాహీస వస్త్ర’ కొత్త బ్రాండ్‌ ప్రారంభించాను. కేవలం గర్భిణుల కోసం డ్రెస్‌లు రూపొందించే ఏకైక లేబుల్‌ మాది. అలాగే లావుగా ఉండే మహిళలకు కూడా మా ఉత్పత్తులు అందిస్తున్నాం. 


‘సృజన’ అలా పుట్టింది... 

ముంబయి, చుట్టు పక్కల ప్రాంతాల్లో మా లేబుల్‌కు మంచి ఆదరణ లభించింది. దీంతో 2018లో ఫ్యాషన్‌ స్టూడియో ప్రారంభించాను. మా స్టూడియో పేరున గుడ్డ సంచులు తయారు చేయించాలనుకున్నా. మార్కెట్‌లో వాటిని తయారు చేసేవారి వద్దకు వెళ్లాను. అయితే అక్కడకు వెళ్లిన తరువాత నా ఆలోచన మారిపోయింది. కారణం... అప్పటికే ఆ వ్యాపారులకు లెక్కకు మించి ఆర్డుర్లు ఉన్నాయి. ఈ పనేదో అవసరమైనవారికి కల్పిస్తే బాగుంటుందనిపించింది. ఆ డబ్బుతో వారి కుటుంబం నడుస్తుంది కదా! అది కూడా ఒక పద్ధతి ప్రకారం సాగితే పేద మహిళలకు నిరంతరం ఉపాధి దొరుకుతుంది. ఆ మంచి ఉద్దేశంతోనే ‘సృజన’ స్వచ్ఛంద సంస్థను నెలకొల్పాను. ముంబయిలోని అణగారిన వర్గాల మహిళలను సంప్రతించాను. వారికి కుట్టు, అల్లికలు, కటింగ్‌ వంటి వాటిల్లో శిక్షణ ఇచ్చాను. ఆ మహిళల ఉత్పత్తులను మార్కెటింగ్‌ కోసం కార్పొరేట్‌ కంపెనీలు, స్వయంసహాయక సంఘాలు, ఎన్‌జీఓలతో అనుసంధానం చేశాను. ఒకరికి ఒకరు సహకారం అందించుకొనేలా వీరందరినీ ఒకే వేదికపైకి తేవడంలో సఫలమయ్యాను. ఇప్పుడు వారి కాళ్లపై వారు నిలబడి, కుటుంబాన్ని నెట్టుకురావడం చూస్తుంటే నాకు ఎంతో సంతృప్తిగా ఉంటుంది. 


కరోనా సమయంలో... 

అయితే ఇదంతా నాణేనికి ఒక వైపు. ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. మహమ్మారి దెబ్బకు జీవితాలు తలకిందులయ్యాయి. రోజు కూలీ చేసుకు బతికేవారికి జీవనోపాధి లేకుండా పోయింది. దీంతో ఆ కుటుంబాలు పస్తులుంటున్నాయి. కరోనా ప్రభావం మా సంస్థపైనా, దానికి అనుబంధంగా పనిచేసేవారి పైనా పడింది. చాలామంది మహిళలు ఉపాధి కోల్పోయారు. ఇది నన్ను వేదనకు గురిచేసింది. కానీ బాధ పడుతూ కూర్చొంటే వాళ్ల కడుపు నింపేదెవరు? అందుకే మా ఫ్యాషన్‌ బ్రాండ్‌ ద్వారా ఆదుకోవాలని నిర్ణయించాను. 


విభిన్న ఉత్పత్తులు... 

మా రోజువారీ ఉత్పత్తులకు భిన్నంగా ఈ కరోనా సమయంలో ఉపయోగపడేవి ఆ మహిళలతో తయారు చేయిస్తే ఉపయోగం ఉంటుందనిపించింది. అందుకు అవసరమైన మెటీరియల్‌ అంతా మేమే అందించాం. కొలతలకు అనుగుణంగా కటింగ్‌ ఎలా చేయాలో, ఎలా కుట్టాలో నేర్పించాం. ఎంబ్రయిడరీలో తర్ఫీదునిచ్చాం. ఇప్పుడు వారు రకరకాల ఫేస్‌ మాస్క్‌లు, చెవి రింగులు, హెయిర్‌బ్యాండ్స్‌, శానిటరీ పౌచెస్‌, లాప్‌టాప్‌ స్లీవ్స్‌, క్లాత్‌ హ్యాండ్‌బ్యాగ్స్‌ వంటివి తయారు చేస్తున్నారు. పెద్దగా చదువుకోకపోయినా ఈ మహిళల్లో ఎంతో సృజన, తెలివితేటలు ఉన్నాయి. చెప్పింది చెప్పినట్టు గ్రహిస్తారు. దానివల్ల మా పని సులువైంది. ఈ ఉత్పత్తుల మార్కెటింగ్‌ బాధ్యత నాదే! సరిగ్గా గత ఏడాది లాక్‌డౌన్‌లో వీరు పని ప్రారంభించారు. ఇప్పుడూ కొనసాగిస్తున్నారు. ఆ వచ్చే డబ్బుతో కష్ట కాలంలో తమ ఇల్లు గడుపుతున్నారు. పిల్లల స్కూల్‌ ఫీజులు కట్టారు. నా వంతు బాధ్యతగా నేను చేయగలిగింది ఇది! ఇలా అందరూ తలా ఒక చెయ్యి వేస్తే మరెందరో కడుపులు నిండుతాయి.

Updated Date - 2021-05-20T04:45:52+05:30 IST