అచ్చం సినిమాలాగే..

ABN , First Publish Date - 2021-11-28T05:00:27+05:30 IST

పెళ్లంటే పందిళ్లు, సందళ్లు, తప్పెట్లు.. తాళాలు.. తలంబ్రాలూ.. ఇది వివాహాన్ని ప్రతిబింబించే అలనాటి పాట.. కానీ ఇప్పుడు ఆ పాటను దాదాపు అందరూ మరిచిపోయారు. బుల్లెట్‌ బండెక్కి వచ్చేస్తా పా డుగ్గు.. డుగ్గు.. డుగ్గు.. డుగ్గు.. అనే వినపడుతుంది. పాటలే కాదు.. పల్లకీలు, గుర్రంపై ఊరేగింపులూ కావాలంటున్నారు. వివాహ వేడుక పూర్తయ్యే వరకు చేస్తున్న హంగామా సినిమా సీన్లను తలపిస్తున్నాయి.

అచ్చం సినిమాలాగే..

పెళ్లి వేడుకల్లో కొత్త పోకడలు

ప్రతి ఘట్టం గుర్తుండిపోయేలా ఏర్పాట్లు

పల్లకిలో వధువు.. గుర్రంపై వరుడు

ఎక్కడ చూసినా డుగ్గు.. డుగ్గు.. బుల్లెట్‌ బండి పాటే


పెళ్లంటే పందిళ్లు, సందళ్లు, తప్పెట్లు.. తాళాలు.. తలంబ్రాలూ.. ఇది వివాహాన్ని ప్రతిబింబించే అలనాటి పాట.. కానీ ఇప్పుడు ఆ పాటను దాదాపు అందరూ మరిచిపోయారు. బుల్లెట్‌ బండెక్కి వచ్చేస్తా పా డుగ్గు.. డుగ్గు.. డుగ్గు.. డుగ్గు.. అనే వినపడుతుంది. పాటలే కాదు.. పల్లకీలు, గుర్రంపై ఊరేగింపులూ కావాలంటున్నారు. వివాహ వేడుక పూర్తయ్యే వరకు చేస్తున్న హంగామా సినిమా సీన్లను తలపిస్తున్నాయి.


కొండపాక, నవంబరు 27 : ప్రస్తుతం పెళ్లిళ్ల సందడి మొదలైంది. వరుస ముహూర్తాలతో వివాహాలు జరుగుతున్నాయి. జీవితంలో మరుపురాని మహత్తర ఘట్టాన్ని జీవితాంతం గుర్తుండిపోయే విధంగా చేసుకునేందుకు పల్లె, పట్నం అని తేడాలేకుండా ప్రజలు ఆసక్తిని కనబరుస్తున్నారు. హుందాగా వివాహ వేడుకలను నిర్వహిస్తున్నారు. ప్రస్తుత యువత తమ అభిరుచికి తగ్గట్లు కొత్త కొత్త ఆర్భాటాలతో సందడి సందడిగా చేసుకుంటున్నారు. 


కారు పోయి పల్లకీ వచ్చే

పల్లకీలో పెళ్లికూతురు రాణిలా ఉంది... మహారాణిలా ఉంది.... అని అంటుంటే సంతోషించని వారు ఎవరుంటారు. వధువు తల్లిదండ్రులు ఆ మాట వినేందుకు ఎంతో ఉత్సుకతను కనబరుస్తారు. అందుకే ఆ ఆనందాన్ని పొందాలని చాలా మంది తమ గారాల కూతురిని పల్లకీలో ఊరేగించేందుకు ఆసక్తి చూపుతున్నారు. నవవధువును పల్లకీలో ఎక్కించి సంబుర పడిపోయేవారి సంఖ్య పెరిగిపోయింది. ప్రస్తుతం చాలా రకాల పల్లకీలు అందుబాటులో ఉంటున్నాయి. గతంలో పల్లకీలు పోయి, వాటి స్థానంలో పూలతో అలంకరించిన ఖరీదైన కార్లు వచ్చాయి. అయితే ఇటీవల కొందరు సంప్రదాయ పద్ధతిని అనుసరిస్తూ పల్లకీల వైపు ఆసక్తిని కనబరుస్తున్నారు. దీంతో మాయమైనవి అనుకున్న పల్లకీలు మళ్లీ మనకళ్ల ముందు కదలాడుతున్నాయి. మేనా, డోలీ, పల్లకీ ఇలా రకరకాల పేర్లతో ఎవరి అభిరుచులకు తగిన విధంగా వివాహ వేడుకలకు పల్లకీలు సిద్ధంగా ఉంటున్నాయి. ధగధగలాడే రత్నాలు, మంచుపూలను తలపించే తెల్లని ముత్యాలు, రంగురంగుల పూలతో కూడిన పల్లకీ, ముత్యాల పల్లకీ ఇలా రకరకాల డిజైన్లతో సిద్ధంగా ఉన్నాయి. అలాగే వరుడిని గుర్రంపై ఊరేగిస్తున్నారు. గుర్రంపై ఎక్కే మండపానికి వస్తున్నారు.


కొత్త విధానాలకు స్వాగతం

మంగళస్నానాలు మొదలుకొని అత్తవారింటికి సాగనంపే వరకు ఆ తర్వాత బరాత్‌లు ఎంతో ఆర్భాటంగా చేస్తున్నారు. మంగళస్నానాలను హల్దీ పేరుతో సంప్రదాయబద్ధంగా బంధువులంతా ఒకే డ్రెస్‌ కోడ్‌తో, ప్రత్యేక అలంకరణతో పసుపు పూసుకుంటూ వేడుకగా నిర్వహిస్తున్నారు. పెళ్లిపీఠల మీదకు నడిచి వచ్చే వధువు పట్టువస్త్రాలు, నగలను అలంకరించి, పారాణి పెట్టి నలుగురు ఆడవాళ్లు తీసుకొచ్చేవారు.. అయితే ఇదంతా నిన్న మొన్నటివరకు.. ప్రస్తుతం నూతన పద్ధతిలో వధువులు పెళ్లి మండపానికి వస్తున్నారు. వధువు డ్యాన్స్‌ చేస్తూ వేదిక వద్దకు రావడం ఈ మధ్య కొన్ని పెళ్లిల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నది. వధువు అప్పగింతలు పూర్తయ్యాక బరాత్‌ను కలర్‌ కలర్‌ లైటింగ్స్‌తో, డీజే సౌండ్‌తో, బాణసంచా వెలుగులతో ఉత్సాహంగా చేసుకుంటున్నారు. ఇంటిల్లిపాది సంతోషంగా చిందులు వేస్తున్నారు. ఏ పెళ్లి బరాత్‌లో చూసినా వధూవరులు బుల్లెట్‌ బండి పాటపై డ్యాన్స్‌ చేస్తూ అలరిస్తుండగా బంధువులంతా చుట్టూ చేరి వారు సైతం స్టెప్పులేస్తున్నారు. 


Updated Date - 2021-11-28T05:00:27+05:30 IST