ఒకలాంటి

ABN , First Publish Date - 2021-05-10T06:14:28+05:30 IST

తప్పిపోయిన ఒక మనిషి తలపులాంటి ఒక రంగు వెలిసిన దృశ్యం లాంటి ఒక చిలుం పట్టిన మాటలాంటి...

ఒకలాంటి

తప్పిపోయిన ఒక మనిషి తలపులాంటి

ఒక రంగు వెలిసిన దృశ్యం లాంటి

ఒక చిలుం పట్టిన మాటలాంటి

ఒక పారేసుకున్న పర్సులో ఫొటోలాంటి

ఒక ఒరిగిపోయిన గోడ మీద నినాదంలాంటి

ఎండిపోయిన చెరువులో కొంగల కాళ్లముద్రలాంటి

వడలిన జిల్లేడుపూల పాలమరకలాంటి

రేగి గాలిలో గిరికీలు కొడుతున్న కాగితంలాంటి

పగులుకళ్ల దిగుడుబాయి లోదిగులులాంటి

కట్టేస్తే గింజుకునే గేదె బుసలాంటి

నడినెత్తి ఎండ మింగేసిన నీడలాంటి

వదిలేసిన పత్తికట్టెలు ఏరుకునే ముదుసలిలాంటి

చెట్టుకింద చేరిన మేకల కేకల అసహనంలాంటి

కుక్క కరుచుకెళుతున్న పిల్లాడి 

                     నోటికాడ కూడులాంటి

చలికి వణుకుతున్న బిచ్చగాడి ఆకలిచురకలాంటి

కక్కుళ్లు లేని కొడవలి మందపు కోతలాంటి

ధరల దెబ్బకి నోరు పెగలని సరుకుల చిట్టాలాంటి

పొలంలోంచి ఎగిరిపోతున్న గింజల ఆర్తనాదంలాంటి

రోజుకొక సంస్థ గొంతునులిమే వ్యవస్థలలాంటి

గొంతెత్తే పిడికిళ్ల చేతులకు మొలిచే కటకటాల్లాంటి

వాడు వీడు కాదు అందరి నెత్తి మీద

      తన్నే రాజకీయరాబందు గోళ్లలాంటి

నిస్సత్తువలాంటి నిస్తేజంలాంటి 

నిర్వేదంలాంటి నిస్సహాయతలాంటి

పెగలని ప్రశ్నలాంటి

పాడుపడిన పాటల్లాంటి

పోగుపడిన సజీవశవాల మూలుగుల్లాంటి

కూలుతున్న బతుకుల కమురు వాసనలాంటి

లోపల తగలబడుతున్న చిటపటల్లాంటి

ఏం చేయలేక నూరే పళ్ల పటపటల్లాంటి

జీవం లేని మధ్యతరగతి మందహాసంలాంటి

దిక్కూదరి తోచని దేశప్రజల చూపులాంటి

రేపటి రోజు మీద భయంలాంటి బాధలాంటి


అదొకలాంటి

ఇదీ అని చెప్పలేని ఒకలాంటి

జలదరింపులాంటి

నిద్ర రాలిపోయిన రాత్రికి అంటుకున్న

కలల నుసిలాంటి...

ఒకలాంటి....

పి. శ్రీనివాస్‌ గౌడ్‌

99494 29449

Updated Date - 2021-05-10T06:14:28+05:30 IST