Advertisement
Advertisement
Abn logo
Advertisement

చదువంటే ఇష్టం.. బడికి వెళ్లడం కష్టం!

  సరుగుడు- నర్సీపట్నం మార్గంలో బస్సు లేక విద్యార్థుల వస్థలు 

చమ్మచింత వద్ద నదిపై వంతెన లేకే సమస్యలు

నాతవరం, డిసెంబరు 5 : మండలంలోని సరుగుడు- నర్సీపట్నం మార్గంలో తిరిగే ఆర్టీసీ బస్సు ఏడాదిగా నిలిచిపోవడంతో  ఆయా గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటు న్నారు. ప్రధానంగా విద్యార్థుల అవస్థలు వర్ణనాతీతంగా ఉంటున్నాయి. దీంతో గత్యంతరం లేక ఒకే ఆటోలో సుమారు 35మంది సరుగుడు నుంచి పద్ధెనిమిది కిలోమీటర్ల దూరంలోని నాతవరం హైస్కూల్‌కు వేలాడుకుంటూ వెళ్తున్నారు. ఈ పరిస్థితుల్లో పిల్లలు ఇంటి వద్ద బయల్దేరిన నుంచి తిరిగి ఇంటికి చేరుకునే వరకు తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. ఇందుకోసం ఒక్కో విద్యార్థికి నెలకు ఐదు వందల రూపాయల చొప్పున ఆటోకు చెల్లిస్తున్నట్టు చెప్పారు. ఇటువంటి ప్రయాణం భయంతో పాటు పేదరికంలో ఉన్న తమవంటి వారికి భారంగా మారిందని వాపోతున్నారు. గతంలో ఆర్టీసీ బస్సు ఉన్నప్పుడు నెలకు బస్‌పాస్‌కు వంద రూపాయలు చెల్లిస్తే సరిపోయేదని అంటున్నారు. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో చమ్మచింత నుంచి సరుగుడు తారు రోడ్డు నిర్మాణానికి రూ.14 కోట్లు మంజూరయ్యాయి. అయితే, చమ్మచింత దగ్గరలో తాండవ నది కుడి కాలువపై ఉన్న పాత వంతెనను తొలగించి, ఈ నిధుల్లో  రూ.50 లక్షలను ఇక్కడ వంతెన నిర్మాణానికి కేటాయించడం జరిగిందని చెపుతున్నారు. సంబంధిత కాంట్రాక్టర్‌ రోడ్డు పనులు కొంతమేర చేపట్టి, బిల్లులు మంజూరు కాకపోవడంతో మధ్యలో వదిలేశారని, అంతేకాకుండా అసలు కొత్త వంతెన పనులు ప్రారంభించలేదని చెపుతున్నారు. ఇక్కడ వంతెన లేకపోవడంతో సరుగుడుకు వెళ్లే ఆర్టీసీ బస్సును అధికారులు నిలిపి వేశారని అంటున్నారు.  ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి, చమ్మచింత వద్ద తాండవ కుడి కాలువపై వంతెన పనులు చేపట్టి, సరుగుడుకు బస్సు సౌకర్యాన్ని పునరుద్ధరించాలని అంతా వేడుకుంటున్నారు.

Advertisement
Advertisement