పబ్లిక్‌ ఇష్యూకు లిఖిత ఇన్‌ఫ్రా

ABN , First Publish Date - 2020-09-24T06:16:34+05:30 IST

హైదరాబాద్‌కు చెందిన లిఖిత ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ పబ్లిక్‌ ఇష్యూకు వస్తోంది.

పబ్లిక్‌ ఇష్యూకు లిఖిత ఇన్‌ఫ్రా

29 నుంచి ప్రారంభం.. రూ.61 కోట్ల సమీకరణ

షేర్‌ ధర శ్రేణి రూ.117-120


హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): హైదరాబాద్‌కు చెందిన లిఖిత ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ పబ్లిక్‌ ఇష్యూకు వస్తోంది. చమురు, గ్యాస్‌ రవాణాకు పైపు లైన్లు వేయడం, సిటీ గ్యాస్‌ పంపిణీ ప్రాజెక్టులను నిర్వహించడం, గ్యాస్‌పైపు లైన్ల నిర్వహణ సేవల రంగాల్లో కంపెనీ కార్యకలాపాలు నిర్వహిస్తోంది. భారత్‌-నేపాల్‌ మధ్య మొదటి ట్రాన్స్‌-నేషనల్‌ క్రాస్‌-కంట్రీ హైడ్రోకర్బన్‌ పైప్‌లైన్‌ ప్రాజెక్టును నిర్వహించిన మొదటి కంపెనీ తమదేనని లిఖిత ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ గడ్డిపాటి శ్రీనివాసరావు తెలిపారు. 16 రాష్ట్రాలు, రెండు కేంద్ర పాలిత ప్రాంతాల్లో వివిధ ప్రాజెక్టులను లిఖిత ఇన్‌ఫ్రా నిర్వహిస్తోంది. ప్రభుత్వ రంగ చమురు కంపెనీలు, అదానీ, టోరెంట్‌, ఐజీఎల్‌ తదితర కంపెనీలు లిఖిత ఇన్‌ఫ్రా ఖాతాదారుల జాబితాలో ఉన్నాయి. ఇష్యూ మంగళవారం (ఈనెల 29న) ప్రారంభమై, అక్టోబరు ఒకటిన ముగుస్తుంది. రూ.10 ముఖ విలువ కలిగిన షేరుకు కంపెనీ రూ.117-120 ధరల శ్రేణిని నిర్ణయించింది. తాజాగా 51 లక్షల షేర్లను జారీ చేస్తుంది. ఇష్యూ తర్వాత చెల్లించిన మూలధనంలో  ఐపీఓ షేర్ల వాటా 25.8 శాతం ఉంటుంది. పబ్లిక్‌ ఇష్యూ ద్వారా రూ.61.20 కోట్ల వరకూ రాగలవని కంపెనీ అంచనా వేస్తోంది. ఈ నిధులను నిర్వహణ మూలధన అవసరాలకు వినియోగిస్తారు. ఇష్యూలో క్యూఐబీలకు 50 శాతం, నాన్‌ ఇన్‌స్టిట్యూషనల్‌ ఇన్వెస్టర్లకు 15 శాతం, రిటైల్‌ మదుపుదారులకు 35ు షేర్లను కేటాయిస్తారు. 2019-20 ఏడాదికి కంపెనీ రూ.162.79 కోట్ల ఆదాయంపై రూ.19.87 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. 2020, జులై 31 నాటికి కంపెనీ చేతిలో రూ.662.58 కోట్ల విలువైన ఆర్డర్లు ఉన్నాయి. 

Updated Date - 2020-09-24T06:16:34+05:30 IST