పేగులకూ మెదడుకూ లింక్‌!

ABN , First Publish Date - 2021-08-03T05:30:00+05:30 IST

పర్యావరణం, జన్యువులు, భావోద్వేగ అంశాలు... ఇలా మానసిక ఆరోగ్యాన్ని ప్రభావితం చేసే అంశాలు

పేగులకూ మెదడుకూ లింక్‌!

పర్యావరణం, జన్యువులు, భావోద్వేగ అంశాలు... ఇలా మానసిక ఆరోగ్యాన్ని ప్రభావితం చేసే అంశాలు బోలెడు. అయితే మానసిక సమస్యలకు మూలాలు మెదడులోనే ఉన్నాయనేది నిజం కాదు. పేగుల ఆరోగ్యం కూడా మెదడును ప్రభావితం చేసి, మానసిక సమస్యలకు కారణమవుతుందని పరిశోధనల్లో తేలింది. 


పేగుల్లో నివశించే విభిన్న బ్యాక్టీరియా సమూహాలు క్లిష్టమైన మానసిక ఆరోగ్యం మీద ప్రభావాన్ని చూపిస్తాయి. సాధారణంగా మెదడు, పేగులు ఒకదానితో మరొకటి అనుసంధానమై ‘గట్‌ - బ్రెయిన్‌ యాక్సిస్‌’ అనే మాధ్యమం ద్వారా సంభాషించుకుంటూ ఉంటాయి. ఈ సంబంధాన్ని అర్థం చేసుకోగలిగితే మానసిక సమస్యలను సరికొత్త మార్గాల్లో తేలికగా పరిష్కరించవచ్చని పరిశోధకులు చెబుతున్నారు.


పేగుల్లో మంచి బ్యాక్టీరియాలో కొరత తలెత్తి, పేగుల్లో వాపు మొదలైనప్పుడు, ఫలితంగా మానసిక సమస్యలు తలెత్తడాన్ని పరిగణలోకి తీసుకుంటూ గట్‌ - బ్రెయిన్‌ యాక్సిస్‌’ సామర్థ్యాన్ని పరిశోధకులు వెలుగులోకి తీసుకురావడం జరిగింది. అయితే పేగులు మెదడుకు మధ్య ఇలాంటి దగ్గర సంబంధం ఏర్పడడానికి కారణాన్ని కూడా వారు విశ్లేషించారు. దైనందిన జీవితంలో మన ఆహారశైలిలో చోటుచేసుకునే మార్పుల కారణంగా పేగుల్లోని బ్యాక్టీరియాలో మార్పులు చోటుచేసుకుని, ఫలితంగా గట్‌ - బ్రెయిన్‌ యాక్సిస్‌ క్రమం తప్పుతుంది. బ్యాక్టీరియా మనం తిన్న ఆహారాన్ని శోషించుకుని కొన్ని అణువులను విడుదల చేస్తాయి. అవి రక్తప్రసరణ ద్వారా మెదడుకు చేరుతూ ఉంటాయి.


ఈ అణువులు నాడుల చివర్లను ప్రేరేపించి, మెదడుకు సంకేతాలు పంపుతాయి. ఇలా పేగులకూ మెదడుకూ లింక్‌ ఉంది కాబట్టి ఆరోగ్యకరమైన, నట్స్‌, సీడ్స్‌, విభిన్న పండ్లు, కూరగాయలతో కూడిన వృక్షసంబంధమైన ఆహారం ఎక్కువగా తీసుకోవడం ద్వారా పేగుల ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. పేగులను ఆరోగ్యంగా ఉంచుకోగలిగితే మానసిక సమస్యల బారి నుంచి తప్పించుకోవచ్చు అంటున్నారు పరిశోధకులు.


Updated Date - 2021-08-03T05:30:00+05:30 IST