జోరుగా అక్రమ మద్యం వ్యాపారం

ABN , First Publish Date - 2021-06-14T05:29:26+05:30 IST

దర్శి ప్రాంతంలో అక్రమ మద్యం వ్యాపారం జోరుగా సాగుతోంది. గ్రామాల్లో బెల్ట్‌షాపులు పుట్టగొడుగుల్లా వెలిశాయి.

జోరుగా అక్రమ మద్యం వ్యాపారం
దర్శిలో పట్టుబడిన నకిలీ మద్యం (ఫైల్‌)

పట్టించుకోని స్థానిక అధికారులు

మద్యందుకాణాల్లో సిబ్బంది చేతివాటం

దర్శి, జూన్‌ 13 : దర్శి ప్రాంతంలో అక్రమ మద్యం వ్యాపారం జోరుగా సాగుతోంది. గ్రామాల్లో బెల్ట్‌షాపులు పుట్టగొడుగుల్లా వెలిశాయి. కూల్‌డ్రింక్‌ షాపులు, చిల్లర దుకాణాల్లో సైతం మద్యం విచ్చలవిడిగా విక్రయిస్తున్నారు. పోలీసుల దాడుల్లో తరచూ అక్రమ మద్యం పట్టుబడుతూనే ఉంది. అయితే ఎక్సైజ్‌ అధికారులు పట్టించుకున్న దాఖలాలు లేవు. మద్యం దుకాణాల నుంచి నేరుగా అక్రమ వ్యాపారులకు మద్యం తరలిస్తున్నారు. మద్యం విక్రయించే సిబ్బంది కొంతమంది అక్రమ వ్యాపారులతో కుమ్మకై ఈ వ్యాపారం చేస్తున్నట్లు సమాచారం. కరోనా లాక్‌డౌన్‌  నేపథ్యంలో అన్ని దుకాణాలతో పాటు మద్యం దుకాణాలను కూడా మధ్యాహ్నం 12 గంటలకు మూసేస్తున్నారు. దీన్ని ఆసరాగా చేసుకొని  కొంతమంది దళారులు మద్యం విక్రయించే సిబ్బందితో కుమ్మకై ముందుగానే మద్యం సీసాలను అధిక సంఖ్యలో బయటకు తరలించుకుంటున్నారు. మద్యానికి అలవాటు పడినవారు షాపులు మూసిన తర్వాత బయట వ్యక్తుల వద్ద కొనుగోలు చేస్తున్నారు. అక్రమ వ్యాపారులు ఒకొక్క క్వాటర్‌ బాటిల్‌కు రూ.100 నుంచి రూ.150 అదనంగా తీసుకుంటున్నారు. ఇంత జరుగుతున్నా ఎక్సైజ్‌ అధికారులు పట్టించుకున్న దాఖలాలు లేవు. ప్రస్తుతం ఈ వ్యాపారం గ్రామాలకు కూడా విస్తరించింది. గ్రామాల్లో చిల్లర దుకాణాల్లో, బడ్డీ బంకుల్లో నిల్వ చేసుకొని అధిక ధరలకు విక్రయిస్తున్నారు. అక్రమార్కులు గ్రామాలకు కూడా మద్యాన్ని సరఫరా చేస్తున్నారంటే ఏ స్థాయిలో మద్యం దుకాణాల నుంచి సీసాలు బయటకు వస్తున్నాయో అర్థం చేసుకోవచ్చు.  

రెస్టారెంట్లలో విచ్చలవిడిగా విక్రయాలు 

 మండలంలోని పలు రెస్టారెంట్లలో మద్యం విక్రయాలు విచ్చలవిడిగా జరుగుతున్నాయి. రెస్టారెంట్ల నిర్వాహకులు ముందుగానే మద్యం దుకాణాల్లో అధిక మొత్తంలో సీసాలు తెచ్చుకొని నిల్వ చేసుకొని వ్యాపారం చేస్తున్నారు. ఒకొక్క మనిషికి నాలుగు సీసాల కంటే ఎక్కువ ఇవ్వకూడదనే నిబంధన ఉన్నప్పటికీ మద్యం షాపుల్లోని సిబ్బంది ఇతరుల పేరుతో రెస్టారెంట్లకు మద్యం సరఫరా చేస్తూ లబ్ధిపొందుతున్నారు. రెస్టారెంట్‌ల నిర్వాహకులు వినియోగదారుల నుంచి బాటిల్‌కు రూ.150 అదనంగా తీసుకొని మద్యం సేవించేందుకు కూడా అనుమతి ఇస్తున్నారు.  ఈ రెస్టారెంట్లలో మద్యం సేవించే అనుమతులు లేకపోయినప్పటికీ రాత్రి 10 గంటల వరకు రెస్టారెంట్లలో మద్యం సేవించేందుకు సిట్టింగులు వేయిస్తున్నారు. మద్యం అధిక ధరలకు విక్రయించే అవకాశం లభించడంతో పాటు ఆహర పదార్థాలపై కూడా అధిక ధరలు వేసి నిర్వాహకులు సొమ్ము చేసుకుంటున్నారు. ఇటీవల కాలంలో నాలుగు కొత్త రెస్టారెంట్లు వెలిశాయంటే ఈ వ్యాపారం ఎంత లాభసాటిగా ఉందో అర్ధం చేసుకోవచ్చు. వీరి నుంచి ఎక్సైజ్‌ అధికారులకు నెలమామూళ్లు ఉన్నాయని ఆరోపణలున్నాయి.  ఇటీవల జిల్లా ఎన్‌పోర్స్‌మెంట్‌ అధికారులు దాడులు నిర్వహించి నాలుగు రెస్టారెంట్లలో విక్రయిస్తున్న అక్రమ మద్యం సీసాలను పట్టుకొని నిర్వాహకులపై కేసులు నమోదు చేశారు. అదేవిధంగా పోలీసులు పలు ప్రాంతాల్లో దాడులు చేసి గ్రామాల్లో బెల్ట్‌షాపుల ద్వారా విక్రయిస్తున్న మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఎక్సైజ్‌ అధికారులు మాత్రం అక్రమ మద్యం వ్యాపారం ముమ్మరంగా జరుగుతున్నప్పటికీ పట్టించుకోవటం లేదు. మద్యం షాపుల్లో పనిచేస్తున్న సిబ్బంది చేతివాటం ప్రదరిస్తూ అధిక ధరలకు విక్రయిస్తున్నప్పటికీ నియంత్రించటం లేదు. జిల్లా ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు రెండురోజుల క్రితం ముండ్లమూరు మండలంలోని ఉల్లగల్లు మద్యంషాపులో సిబ్బంది అధిక ధరలకు విక్రయిస్తున్నారనే సమాచారంతో దాడులు నిర్వహించి కేసులు నమోదు చేశారు. ఇప్పటికైనా ఇక్కడ జరుగుతున్న మద్యం అక్రమ వ్యాపారాన్ని ఉన్నతాధికారులు గుర్తించి తగు చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్‌ చేస్తున్నారు.

Updated Date - 2021-06-14T05:29:26+05:30 IST