మద్యేమార్గం

ABN , First Publish Date - 2021-06-24T06:23:54+05:30 IST

మద్యేమార్గం

మద్యేమార్గం
ఎస్‌ఈబీ పోలీసులు స్వాధీనం చేసుకున్న విదేశీ మద్యం సీసాలు

చెన్నై టు బెజవాడ విదేశీ మద్యం

ఎస్‌ఈబీకి చిక్కిన ముగ్గురు 

108 విదేశీ మద్యం సీసాల స్వాధీనం

విజయవాడ, ఆంధ్రజ్యోతి : నగరంలో విదేశీ మద్యం అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. దీనిపై నిఘా పెట్టిన ఎస్‌ఈబీ పోలీసులు అప్సర థియేటర్‌ వద్ద సెల్‌ఫోన్‌ షాపు నిర్వహిస్తున్న ఎం.భాస్కరరావును పట్టుకున్నారు. షాపులో బుధవారం తనిఖీలు నిర్వహించగా, 25 విదేశీ మద్యం సీసాలు కనిపించాయి. అతడ్ని విచారణ చేయగా, మరో రెండు పేర్లు వెలుగులోకి వచ్చాయి. మారుతీనగర్‌కు చెందిన వెలంపల్లి శ్రీనివాస్‌తో పాటు ఎం.శ్రీధర్‌ వద్ద విదేశీ మద్యం ఉన్నట్టు సమాచారం వచ్చింది. వెలంపల్లి శ్రీనివాస్‌ ఇంట్లో తనిఖీలు చేయగా, 83 మద్యం సీసాలు లభించాయి. ఈ ముగ్గుర్నీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి మొత్తం 108 మద్యం సీసాలు స్వాధీనం చేసుకున్నారు. వాటి విలువ రూ.8లక్షలు ఉంటుందని ఎస్‌ఈబీ పోలీసులు తెలిపారు. 

చెన్నై నుంచి విజయవాడ వరకు..

విదేశీ మద్యంతో పట్టుబడిన వారిని విచారణ చేయగా, చెన్నై విమానాశ్రయం పేరు వెలుగులోకి వచ్చింది. విదేశాల నుంచి దేశానికి వచ్చే ప్రయాణికులు అక్కడి నుంచి రెండు, మూడు విదేశీ మద్యం సీసాలను తెచ్చుకునే అవకాశం ఉంది. వారి నుంచి ఆ సీసాలను విమానాశ్రయంలోనే కొంటున్నారు. ప్రయాణికుల ఇన్నర్‌ లాంజ్‌లో ఈ వ్యవహారం నడిచిపోతోంది. విదేశాల నుంచి వచ్చిన ప్రయాణికులను గుర్తించి, మద్యం సీసాలను కొనుగోలు చేయడానికి ప్రత్యేకంగా అక్కడ కొంతమంది ఏజెంట్లు ఉంటు న్నారు. ఇన్నర్‌ లాంజ్‌లు లావాదేవీలు పూర్తయ్యాక సరుకు బయటకు వస్తుంది. అక్కడి నుంచి జాతీయ రహదారి మీదుగా విజయవాడ చేరుకుంటుంది. ఇక్కడ వివిధ మార్గాల్లో పరిచయమైన వారికి విషయాన్ని చెప్పి అమ్మకాలు సాగిస్తున్నారు. అప్సర థియేటర్‌ వద్ద సెల్‌ఫోన్‌ షాపు నిర్వహిస్తున్న ఎం.భాస్కరరావు సరిగ్గా ఇదే పనిచేస్తున్నాడు. చెన్నై నుంచి తెచ్చిన సరుకును షాపులో భద్రంగా ఉంచుతున్నాడు. షాపునకు వచ్చిన ఖాతాదారులకు విషయం చెప్పి సొమ్ము చేసుకుంటున్నాడు. విదేశీ మద్యంలో రకరకాల బ్రాండ్లు ఉంటాయి. ఏ బ్రాండ్‌ను మందుబాబులు అధికంగా తాగుతారో అటువంటి వాటిని ఎంపిక చేసుకుని తీసుకొస్తున్నారు. ఉదాహరణకు గెన్‌ఫ్లిచ్‌ మద్యం సీసా ఖరీదు రూ.5వేలు. దీన్ని ఇక్కడ రూ.6వేల నుంచి 7వేల వరకు విక్రయిస్తున్నారు. బ్రాండ్‌లకు ఉన్న ఖరీదును బట్టి కాసులు గడిస్తున్నారు.

Updated Date - 2021-06-24T06:23:54+05:30 IST