అంతా మా ఇష్టం!

ABN , First Publish Date - 2021-06-17T02:33:17+05:30 IST

నగరంలో ఉన్న మద్యం బార్లు కర్య్ఫూ సమయ వేళలు పాటించకపోయినా ఎవరూ పట్టించుకోవడం లేదు. మధ్యాహ్నం 2గంటలు దాటిన తర్వాత కూడా యథేచ్ఛగా వ్యాపారం చేసుకుంటున్నారు. వీటిని చూసి నగర ప్రజలు ఇదెక్కడి న్యాయం అంటూ నోరెళ్లబెడుతున్నారు.

అంతా మా ఇష్టం!
మద్రాస్‌ బస్టాండ్‌ ప్రాంతంలో సమయం ముగిసినా ఇంకా తెరచి ఉన్న బారు

కర్ఫ్యూ నిబంధనలు పాటించని బార్లు

2 గంటలు దాటినా మూసుకోని షెట్టర్లు

తమకు సంబంధం లేదంటున్న ఎక్సైజ్‌  

పట్టించుకోని పోలీసులు


నెల్లూరు(క్రైం), జూన్‌ 16 : నెల్లూరులో రోడ్డు పక్కన తోపుడు బండ్లు, బంకులు పెట్టుకుని జీవించే చిరువ్యాపారులు కొవిడ్‌ కర్ఫ్యూ నిబంధనల మేరకు మధ్యాహ్నం 2 గంటలు తరువాత వ్యాపారాన్ని నిలిపివేయకుంటే పోలీసులు ఇష్టం వచ్చినట్లు తిడతారు. అంతేకాక కాటానిగానీ, ఇతర వస్తువులనుగానీ స్టేషన్‌కు తరలిస్తారు. అయితే నగరంలో ఉన్న మద్యం బార్లు మాత్రం కర్య్ఫూ సమయ వేళలు పాటించకపోయినా ఎవరూ పట్టించుకోవడం లేదు. మధ్యాహ్నం 2గంటలు దాటిన తర్వాత కూడా యథేచ్ఛగా వ్యాపారం చేసుకుంటున్నారు. వీటిని చూసి  నగర ప్రజలు ఇదెక్కడి న్యాయం అంటూ నోరెళ్లబెడుతున్నారు.


నిబంధనలు వర్తించవా ?

నెల్లూరులోని పలు బార్ల యాజమాన్యాలు కర్య్ఫూ నిబంధనలు ఏమాత్రం లెక్క చేయడం లేదు. సమయం దాటిన తర్వాత కూడా ఇష్టానుసారంగా బార్లలో మద్యం అమ్మ కాలు సాగిస్తున్నారు. మధ్యాహ్నం 2గంటలు కాకముందే ప్రభుత్వ మద్యం దుకాణాలను సిబ్బంది మూసేస్తున్నారు. బార్లలో మాత్రం గడువు దాటినా మద్యం విక్రయాలు సాగు తుండటంతో మందుబాబులు వాటికి పరుగులు తీస్తున్నారు. ఇదే అదునుగా బార్ల నిర్వాహకులు అధిక ధరలకు మందు అమ్ముతూ సొమ్ము చేసుకుంటున్నారు.


పట్టించుకునే వారేరి ?

బార్లు సమయ పాలన పాటించకపోవడంపై ఎక్సైజ్‌ అధికారులను ప్రశ్నిస్తే తమకు సంబంధం లేదంటున్నారు. బార్లలో అక్రమాలు జరిగితే తమ బాధ్యత తప్ప సరైన వేళలు పాటించపోతే తామేమీ చేయలేమని చెబుతున్నారు. పోలీసులైతే బార్లవైపు కన్నెత్తి చూడటం లేదు. ప్రతి నెలా మామూళ్లు ఇచ్చేస్తున్నాం.. పోలీసులు మా బార్‌ వైపు రారు.. మీరు ప్రశాంతంగా మందు తాగండి... అని బార్ల నిర్వాహకులు మద్యం ప్రియులకు చెబుతున్నారు. మొత్తంగా బార్లకు కర్య్ఫూ వేళలతో సంబంధం లేదన్నట్లుగా వ్యాపారులు వ్యవహరిస్తున్నారు.

Updated Date - 2021-06-17T02:33:17+05:30 IST