తీగలాగితే.. కదిలిన మద్యం డొంక!

ABN , First Publish Date - 2020-05-31T11:42:56+05:30 IST

తెలంగాణ రాష్ట్రం నుంచి పెద్దఎత్తున అక్రమంగా మద్యాన్ని తీసుకువచ్చి ఇక్కడ అధిక ధరలకు విక్రయించి సొమ్ము చేసుకుంటున్న ముఠా గుట్టు రట్టయింది.

తీగలాగితే.. కదిలిన మద్యం డొంక!

మద్యం రవాణాలో కానిస్టేబుల్‌ పాత్ర

గుంటూరులో బార్‌ యజమాని సహా 16 మందిపై కేసు

7గురు అరెస్టు 57 మద్యం బాటిళ్ల స్వాధీనం


 గుంటూరు, మే 30: తెలంగాణ రాష్ట్రం నుంచి పెద్దఎత్తున అక్రమంగా మద్యాన్ని తీసుకువచ్చి ఇక్కడ అధిక ధరలకు విక్రయించి సొమ్ము చేసుకుంటున్న ముఠా గుట్టు రట్టయింది. ఈ మద్యం అక్రమ రవాణాలో పోలీసులు, ప్రభుత్వ అధికారులు ఉండటం కలకలం రేగింది. అర్బన్‌, ఎస్‌ఈబీ అదనపు ఎస్పీ కరిముల్లా షరీష్‌ ఆధ్వర్యంలో జరిగిన దాడుల్లో మద్యం అక్రమ రవాణా డొంక కదిలింది. వివరాలు ఇలా ఉన్నాయి... గుంటూరు నగరంలోని శ్రీనగర్‌కు చెందిన రోహిణి, కిశోర్‌, కొండయ్య కాలనీకి చెందిన బత్తుల వెంకటేశ్వరరావు అక్రమ మద్యం విక్రయిస్తున్నట్లు సమచారం రావటంతో పోలీసులు వారిని అరెస్టుచేసి వారి వద్ద విక్రయించటానికి సిద్ధంగా ఉన్న 16 మద్యం బాటిళ్లను, రెండు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. విచారించగా తమకు కటారి అశోక్‌ కుమార్‌ మద్యం బాటిళ్ళను విక్రయించినట్లు వెల్లడించారు. పోలీసులు అశోక్‌కుమార్‌ కోసం దర్యాప్తు చేయగా, ఆయనతోపాటు, ఆయన అన్న అయిన ఏపీఎస్పీ కానిస్టేబుల్‌ కటారి శ్రీనివాసరావు కూడా పట్టుబడ్డారు.


వారిద్దరు మద్యం బాటిళ్ళతో ద్విచక్ర వాహనంపై వెళుతుండగా పోలీసులు అరెస్టు చేసి 20 మద్యం బాటిళ్ళను స్వాధీనం చేసుకున్నారు. కానిస్టేబుల్‌ శ్రీనివాసరావు కర్నూలులోని ఏపీఎస్పీ బెటాలియన్‌లో పనిచేస్తూ ప్రస్తుతం డిప్యూటేషన్‌పై ఇంటిలిజెన్స్‌లో విధులు నిర్వహిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. తన అన్న శ్రీనివాసరావు తెలంగాణ రాష్ట్రం నుంచి మద్యం తెప్పించి తమకు ఇస్తుండగా తాను నగరానికి చెందిన ఆర్‌ కిశోర్‌, టి.వెంకటేశ్వరరావు, జి.వెంకటేశ్వర్లు, యాదల వాసు, కె.సూర్య, ఉదయ్‌, జి.ఏడుకొండలు తదితరులకు మద్యం బాటిళ్లను విక్రయించినట్లు అశోక్‌కుమార్‌ వెల్లడించాడు. దీంతో పోలీసులు వారందరిపై కేసు నమోదు చేశారు. హైదరాబాద్‌లోని ఆదాయ పన్ను  శాఖ అధికారి అకౌంట్‌కు ఈ నెల 16, 17, 25వ తేదీల్లో మొత్తం రూ.60 వేలు ఆన్‌లైన్‌ ద్వారా పంపగా ఆయన తెలంగాణ కు చెందిన 348 వివిధ రకాల మద్యం బాటిళ్ళను విజయవాడలోని ఇంటిలిజెన్స్‌ హోంగార్డు శ్రీధర్‌ ద్వారా విజయవాడ వారికి పంపినట్లు వెల్లడించాడు.


అక్కడి నుంచి నగరానికి తీసుకువచ్చి తన తమ్ముడి ద్వారా ఆయనకు తెలిసిన వారికి విక్రయించి సొమ్ము చేసుకుంటున్నట్లు వెల్లడించాడు. పోలీసులు అశోక్‌కుమార్‌ ఇచ్చిన సమాచారం మేరకు సంగడిగుంటలోని వెంకటేష్‌ కోసం ప్రయత్నించగా ఆయన రమేష్‌ అనే వ్యక్తితో కలసి 20 మద్యం బాటిళ్లను విక్రయించేందుకు ప్రయత్నించగా పోలీసులు ఆ ఇరువురుని అరె స్టు చేసి ద్విచక్ర వాహనం, మరో 20 మద్యం బాటిళ్ళను స్వాధీనం చేసుకున్నారు. వెంకటేష్‌ వద్ద లభించిన చిట్టీలను పరిశీలించగా ఇప్పటివరకు అనేక మందికి పెద్ద ఎత్తున మద్యం విక్రయించినట్లు పోలీసులు గుర్తించారు. అరండల్‌పేటలోని గంగా బార్‌ నుంచి బార్‌ యజమాని కోటేశ్వరరావు, నౌకరు ద్వారా బార్‌ నుంచి మద్యం బాటిళ్లను తీసుకువచ్చి విక్రయించినట్లు వెల్లడించాడు.


దీంతో పోలీసులు గంగా బార్‌ యజమాని, నౌకరుపై పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా ఈ ముఠా నుంచి 57 మద్యం బాటిళ్ళు, నాలుగు ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకొని ఏడుగురు నిందితులను అరెస్టు చేసినట్లు ఎస్‌ఈబీ అదనపు ఎస్పీ కరీముల్లా షరీష్‌ తెలిపారు. ఈ కేసులో మరో తొమ్మిది మందిని అరెస్టు చేయాల్సి వుందన్నారు. ఈ దాడుల్లో గుంటూరు 2 టౌన్‌ సీఐ రేఖ, మాధవి, ఎస్‌ఐలు ఏఈఎస్‌ బి.చంద్రశేఖరరెడ్డి, సూపరింటెండెంట్‌, ఎన్‌ బాలకృష్ణన్‌ తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2020-05-31T11:42:56+05:30 IST