Abn logo
Oct 18 2021 @ 23:39PM

మద్యానికి దసరా కిక్కు

 మద్యం మత్తులో ఊగిపోయినజిల్లా

 దసరా సరదాల్లో మద్యానికే పెద్దపీట  

 నాలుగు రోజుల్లో రూ. 29 కోట్ల అమ్మకాలు

దసరా నేపథ్యంలో మద్యం అమ్మకాల్లో జిల్లా ఎక్సైజ్‌ శాఖ రికార్డు సృష్టించింది. గతంలో ఎన్నడూ లేని విధంగా అమ్మకాల్లో రాష్ట్రంలోనే రెండో స్థానంలో నిలిచింది. మెట్రోపాలిటన్‌ నగరాలున్న కృష్ణా, గుంటూరు, తూర్పుగోదావరి, చిత్తూరు జిల్లాలను కూడా తోసిరాజని జిల్లా రెండోస్థానానికి ఎగబాకింది. మహా విశాఖ నగరం సరసన చేరింది.


ఏలూరు, అక్టోబరు 18 (ఆంధ్రజ్యోతి): దసరాకు రాష్ట్రంలో మద్యం అమ్మకాలు జోరుగా సాగాయి. జిల్లాలో దసరా సమయంలో నాలుగు రోజుల్లో 29.44 కోట్ల రూపాయల మేర మద్యాన్ని మందుబాబులు తాగేశారు. ఇంతకు మించిన అమ్మకాలు ఒక్క విశాఖపట్నం జిల్లాలో మాత్రమే జరగడం విశేషం. అత్యధిక జనసాంద్రత ఉన్న తూర్పుగోదావరి జిల్లాలో కూడా అమ్మకాలు రూ.27.74 కోట్లకు పరిమితమవ్వగా, ఆ తరువాత స్థానాల్లో 27.72 కోట్ల అమ్మకాలతో కృష్ణా జిల్లా 26.05 కోట్ల అమ్మకంతో గుంటూరు జిల్లా వెనుకంజలో పడ్డాయి. 

ఒక్క రోజులో రూ.11 కోట్ల అమ్మకాలు

దసరా పండగరోజు మందుబాబులు విందు చేసుకున్నారు. మొత్తం నాలుగు రోజుల్లో రూ.29 కోట్ల రూపాయల అమ్మకాలు జరుగ్గా, ఒక్క దసరా రోజే 10.87 కోట్ల రూపాయల మద్యాన్ని మందుబాబులు తాగేశారు. ఇది రోజువారీ అమ్మకాలకు అక్షరాలా రెట్టింపుగా ఉంది. ఆ ఒక్క రోజే జిల్లాలో 10,103 కేసుల మద్యం, 3,745 కేసుల బీరు ఖర్చయి పోయింది. పండగ ముందు రోజు 14వ తేదీన కూడా ఇదే స్థాయిలో మద్యం అమ్మకాలు జోరుగా సాగాయి. ఆరోజు 9.24 కోట్ల రూపాయల అమ్మకాలు జరగాయి. ఇది జిల్లా రోజువారీ సగటు కంటే 150 శాతం ఎక్కువ. పండగ అనంతరం మద్యం అమ్మకాలు సాధారణ స్థాయికి వచ్చాయి. ప్రస్తుతం అమ్మకాలు రూ.5 కోట్లకు పరిమితమయ్యాయి.