కరోనా సంక్షోభంలోనూ రూ. 684 కోట్లకు తాగేశారు..!

ABN , First Publish Date - 2020-10-29T17:51:01+05:30 IST

కరోనా సంక్షోభం జిల్లాలో దాదాపుగా అన్ని రకాల వ్యాపారాలనూ దెబ్బ తీసేసింది. ఎన్నో రంగాలు ఆటుపోట్లకు లోనై వాటిపై ఆధారపడ్డ వేలాదిమంది కార్మికులు, కూలీలు, చిరుద్యోగులు బతుకుదెరువు కోల్పోయారు. అయితే అంతటి సంక్షోభంలో కూడా జిల్లాలో మద్యం ప్రియులు అక్షరాలా రూ.684 కోట్లకు పైగా మద్యం తాగేశారు. గతేడాది జిల్లాలో 344 మద్యం దుకాణాలు, 35 బార్లు వున్నాయి.

కరోనా సంక్షోభంలోనూ రూ. 684 కోట్లకు తాగేశారు..!

పుణ్యక్షేత్రాల్లో మద్యం అమ్మకాలపై కనిపించని కరోనా ప్రభావం

తమిళ, కన్నడ సరిహద్దుల్లో విక్రయాలను దెబ్బతీసిన ధరలు


తిరుపతి (ఆంధ్రజ్యోతి): కరోనా సంక్షోభం జిల్లాలో దాదాపుగా అన్ని రకాల వ్యాపారాలనూ దెబ్బ తీసేసింది. ఎన్నో రంగాలు ఆటుపోట్లకు లోనై వాటిపై ఆధారపడ్డ వేలాదిమంది కార్మికులు, కూలీలు, చిరుద్యోగులు బతుకుదెరువు కోల్పోయారు. అయితే అంతటి సంక్షోభంలో కూడా జిల్లాలో మద్యం ప్రియులు అక్షరాలా రూ.684 కోట్లకు పైగా మద్యం తాగేశారు. గతేడాది జిల్లాలో 344 మద్యం దుకాణాలు, 35 బార్లు వున్నాయి. ఆ ఏడాది మార్చి నుంచీ సెప్టెంబరు వరకూ జిల్లాలో సగటున రోజుకు రూ. 5.50 కోట్ల మేరకు మద్యం విక్రయాలు జరిగాయి. ఆ మేరకు మొత్తం ఏడు నెలల్లో 214 రోజులకు గానూ రూ.1176.16 కోట్ల విలువైన మద్యం అమ్మకాలు సాగాయి. జిల్లాలో మార్చి-సెప్టెంబరు నడుమ అత్యధికంగా తిరుపతి అర్బన్‌ సర్కిల్‌ పరిధిలో రూ. 171.72 కోట్లు, మదనపల్లె సర్కిల్‌ పరిధిలో రూ. 104.55 కోట్లు, చిత్తూరు అర్బన్‌ సర్కిల్‌ పరిధిలో రూ. 101.31 కోట్లు, శ్రీకాళహస్తి సర్కిల్‌ పరిధిలో రూ. 86.63 కోట్లు చొప్పున మద్యం విక్రయాలు జరిగాయి.


ఈ ఏడాది జిల్లాలో మద్యం షాపుల సంఖ్య 344 నుంచీ 288కి తగ్గాయి. కరోనా సంక్షోభం తలెత్తడంతో మార్చి 22వ తేదీన మద్యం షాపులు, బార్లు మూతపడ్డాయి. లాక్‌డౌన్‌ తర్వాత మే నెల 8వ తేదీ నుంచీ మద్యం దుకాణాలు తిరిగి తెరుచుకున్నాయి. అలాగే ఈ నెల 4వ తేదీ నుంచీ బార్లు కూడా తెరిచేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. అంటే ఈ ఏడాది మార్చి నుంచీ సెప్టెంబరు వరకూ 214 రోజుల్లో మద్యం దుకాణాలు 46 రోజుల పాటు మూతపడ్డాయి. బార్లు అయితే ఏకంగా 192 రోజులు మూతపడ్డాయి. సాధారణంగా దొరికే మద్యం రకాలు కూడా అందుబాటులో లేకుండా పోయాయి. దానికి తోడు ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. ఇన్ని ప్రతికూలతలున్నా కూడా జిల్లాలో మార్చి-సెప్టెంబరు నడుమ 168 రోజుల వ్యవధిలో 288 మద్యం షాపుల ద్వారా రూ. 684 కోట్ల మేరకు మద్యం విక్రయాలు జరగడం రికార్డనే చెప్పాలి. రోజువారీ సగటున చూస్తే గతేడాది రూ. 5.50 కోట్ల మద్యం అమ్మకాలు జరగగా ఈ ఏడాది కేవలం మద్యం షాపులు తెరిచిన రోజులకే లెక్కించినా కూడా రోజుకు సగటున రూ. 4.07 కోట్ల మేరకు విక్రయాలు జరిగాయి.


తిరుపతి, శ్రీకాళహస్తిల్లో కనిపించని కరోనా ప్రభావం

జిల్లాలో పేరుమోసిన తిరుపతి, శ్రీకాళహస్తి వంటి పుణ్యక్షేత్రాల్లో మద్యం అమ్మకాలపై కరోనా సంక్షోభం ఎలాంటి ప్రభావం చూపించలేదని తేలింది. ఉదాహరణకు శ్రీకాళహస్తి సర్కిల్‌లో గతేడాది మార్చి-సెప్టెంబరు నడుమ రూ. 86.33 కోట్ల మద్యం అమ్మకాలు జరగగా ఈ ఏడాది మార్చి-సెప్టెంబరు నడుమ పరిమిత రోజుల్లోనే రూ. 85.31 కోట్ల మద్యం అమ్మకాలు జరగడం ఆశ్చర్యం కలిగిస్తోంది. గతేడాదికీ ఈ ఏడాదికీ నడుమ అమ్మకాల్లో తేడా కేవలం 1.18 శాతం మాత్రమే కావడం గమనార్హం. తిరుపతి రూరల్‌ సర్కిల్‌ పరిధిలో గతేడాది మార్చి-సెప్టెంబరు మధ్య రూ. 79.96 కోట్ల మద్యం అమ్మకాలు సాగగా ఈ ఏడాది మార్చి-సెప్టెంబరు మధ్యన రూ.73.62 కోట్ల మద్యం విక్రయాలు జరిగాయి. తేడా కేవలం 7.93 శాతం మాత్రమే. తిరుపతి అర్బన్‌ సర్కిల్‌ విషయానికొస్తే గతేడాది మార్చి-సెప్టెంబరు నడుమ రూ. 171.72 కోట్ల మద్యం వ్యాపారం జరగగా ఈ ఏడాది అవే నెలల్లో రూ. 126.62 కోట్ల వ్యాపారం జరిగింది. తేడా 26.25 శాతం మాత్రమే. ఇక పాకాల సర్కిల్‌ పరిధిలో కూడా ఇదే పరిస్థితి కనిపించింది. అక్కడ గతేడాది మార్చి-సెప్టెంబరు మధ్యకాలంలో రూ. 45.96 కోట్ల మద్యం విక్రయాలు నమోదు కాగా ఈ ఏడాది అదే కాలంలో రూ. 42.20 కోట్ల వ్యాపారం జరిగింది. 8.19 శాతమే తేడా.


ధరల ప్రభావంతో సరిహద్దుల్లో తగ్గిన అమ్మకాలు

కరోనా ప్రభావంతో కాకుండా ఇరుగుపొరుగు రాష్ట్రాల సరిహద్దుల్లో ధరల ప్రభావంతో మద్యం అమ్మకాలు తగ్గడం స్పష్టంగా కనిపించింది. ఉదాహరణకు తమిళనాడు, కర్ణాటక రాష్ర్టాలతో సరిహద్దులు కలిగిన కుప్పం సర్కిల్‌ పరిధిలో గతేడాది మార్చి-సెప్టెంబరు మధ్య 82.17 శాతం మద్యం అమ్మకాలు తగ్గగా పలమనేరు సర్కిల్‌లో 76.11 శాతం తగ్గాయి. తమిళనాడుతో సరిహద్దులు కలిగిన ప్రాంతాల విషయానికొస్తే నగరి సర్కిల్‌ పరిధిలో 72.30 శాతం, కార్వేటినగరం సర్కిల్‌లో 67.99 శాతం, సత్యవేడు సర్కిల్‌ పరిధిలో 53.36 శాతం, చిత్తూరు అర్బన్‌ సర్కిల్‌లో 42.90 శాతం, చిత్తూరు రూరల్‌ సర్కిల్‌లో 31.13 శాతం, పుత్తూరు సర్కిల్‌లో 33 శాతం చొప్పున మద్యం అమ్మకాలు తగ్గిపోయాయి. అలాగే కర్ణాటకతో సరిహద్దు కలిగిన ప్రాంతాల విషయానికొస్తే పుంగనూరు సర్కిల్‌లో 63.82 శాతం, మదనపల్లె సర్కిల్‌లో 59.68 శాతం, ములకలచెరువు సర్కిల్‌లో 56.64 శాతం చొప్పున గతేడాది కంటే మద్యం విక్రయాలు తగ్గిపోయాయి.మన రాష్ట్రంలో కంటే కూడా తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో మద్యం రకాలు నాణ్యతగానూ, ధరలు తక్కువ గానూ వుండడమే దీనికి కారణం. మొత్తానికీ రాష్ట్ర ప్రభుత్వ మద్యం విధానాల కారణంగా జిల్లా నుంచీ రూ. వందల కోట్ల ఆదాయం ఇరుగుపొరుగు రాష్ట్రాలకు మళ్ళుతోందని ఈ వివరాలే వెల్లడిస్తున్నాయి. అదే సమయంలో ప్రపంచవ్యాప్తంగా అనేక రంగాలను తీవ్రంగా ప్రభావితం చేసి ప్రజల ఆర్థిక స్థితిగతులను అమాంతం దెబ్బతీసిన కొవిడ్‌-19 సంక్షోభం జిల్లాలో మద్యం ప్రియులకు అడ్డుకట్ట వేయలేకపోయిందని, మద్యం అమ్మకాలను తగ్గించలేకపోయిందని తేటతెల్లం చేస్తున్నాయి.

Updated Date - 2020-10-29T17:51:01+05:30 IST