మద్యం విక్రయాల జోష్‌

ABN , First Publish Date - 2020-12-01T08:49:45+05:30 IST

జీహెచ్‌ఎంసీ ఎన్నికల నేపథ్యంలో మద్యం విక్రయాలు జోరుగా సాగాయి. పార్టీ కార్యకర్తలు, ఓటర్లకు పంపిణీ చేయడానికి రాజకీయ నేతలు మద్యం సరుకును భారీగా కొనుగోలు చేసినట్లు

మద్యం విక్రయాల జోష్‌

2 రోజుల్లో రూ.284 కోట్ల సరుకు లిఫ్టింగ్‌

గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలోనే 41 శాతం 

డిపోల నుంచే నేరుగా రహస్య ప్రదేశాలకు

శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున డంపింగ్‌

రాష్ట్రవ్యాప్తంగా వెయ్యి కోట్ల వరకు అమ్మకాలు!


హైదరాబాద్‌, నవంబరు 30 (ఆంధ్రజ్యోతి): జీహెచ్‌ఎంసీ ఎన్నికల నేపథ్యంలో మద్యం విక్రయాలు జోరుగా సాగాయి. పార్టీ కార్యకర్తలు, ఓటర్లకు పంపిణీ చేయడానికి రాజకీయ నేతలు మద్యం సరుకును భారీగా కొనుగోలు చేసినట్లు సమాచారం. దీనిని శివారు ప్రాంతాలు, ఇతర డెన్‌లలో డంప్‌ చేసి పెట్టుకున్నట్లు తెలిసింది. మంగళవారం గ్రేటర్‌ హైదరాబాద్‌ ఎన్నికలు ఉండడంతో సోమవారం సాయంత్రం నుంచే మద్యం పంపిణీ ప్రారంభమైంది. డిపోల నుంచి వైన్‌ షాపులకు మద్యం వెళ్లకుండా మార్గం మధ్యలోనే దారిమళ్లించినట్లు తెలిసింది. వైన్‌ షాపుల ఓనర్లతో మాట్లాడి పెద్దమొత్తంలో తరలించారు. గ్రేటర్‌ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని నవంబరు 28, 29వ తేదీల్లో దుకాణాల ఓనర్లు భారీగా మద్యం, బీరును లిఫ్ట్‌ చేశారు.


బేవరేజెస్‌ కార్పొరేషన్‌ పరిధిలోని మద్యం డిపోల నుంచి ఈ రెండు రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా ఏకంగా రూ.284.47 కోట్ల మద్యం, బీరును లిఫ్ట్‌ చేశారు. 28న రూ.176.28 కోట్ల లిక్కర్‌, బీరును లిఫ్ట్‌ చేశారు. రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు జీహెచ్‌ఎంసీ పరిధిలోని మద్యం దుకాణాలను నవంబరు 29న సాయంత్రం 6 గంటల వరకే తెరవడానికి అనుమతి ఇచ్చారు. అయినా మద్యం డిపోల నుంచి రూ.108.19 కోట్ల మద్యం, బీరును లిఫ్ట్‌ చేశారు.


ఇందులో జీహెచ్‌ఎంసీ పరిధిలోని దుకాణాలు 28న రూ.73.16 కోట్లు, 29న రూ.26.11 కోట్ల మద్యం, బీరును లిఫ్ట్‌ చేశాయి. అంటే 28న 41.50 శాతం, 29న 24.13 శాతం మేర లిఫ్ట్‌ చేశాయి. అయితే... రాష్ట్రంలోని మద్యం షాపుల నుంచి ఈ రెండు మూడు రోజుల్లోనే దాదాపు రూ.1000 కోట్ల వరకు విక్రయాలు సాగినట్లు సమాచారం. ఇందులో జీహెచ్‌ఎంసీ షాపుల నుంచే రూ.500 కోట్ల వరకు అమ్మకాలు నమోదైనట్లు అంచనా. సాధారణంగా మద్యం దుకాణాల ఓనర్లు వరుసగా లిఫ్ట్‌ చేస్తూ వచ్చిన మద్యం, బీరును నిల్వ ఉంచుకుని విక్రయాలు సాగిస్తుంటారు. అందుకే డిపోల నుంచి లిఫ్ట్‌ చేసిన దాని కంటే వైన్‌ షాపుల ద్వారా సాగించిన విక్రయాల విలువ చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ పూర్తి వివరాల రికార్డులు ఉండవు.


షాపుల ద్వారా సాగిన భారీ విక్రయాల్లో ఎక్కువ రాజకీయ పార్టీల వాటే ఉన్నట్లు తెలిసింది. పార్టీల నేతలు మద్యం షాపుల నుంచి ఎక్కువ కొనుగోలు చేశారు. దుకాణాల వరకు రాకుండానే డిపోల నుంచి నేరుగా రహస్య ప్రదేశాలకు తరలించారు. జీహెచ్‌ఎంసీని ఆనుకుని ఉన్న శివారు మునిసిపాలిటీల్లో మద్యం విక్రయాలపై నిషేధం లేదు. ఈ దృష్ట్యా శివారు ప్రాంతాల్లోనే ఎక్కువ డంప్‌ చేసి పెట్టుకున్నట్లు తెలిసింది. దీనిని నగరంలోని రహస్య ప్రాంతాలకు తరలించి, ఆది, సోమవారాల్లో పంపిణీ చేశారు.

Updated Date - 2020-12-01T08:49:45+05:30 IST