మాయామద్యం!

ABN , First Publish Date - 2020-05-31T11:33:10+05:30 IST

ప్రైవేటు గుప్పెట నుంచి ప్రభుత్వం ఆధీనంలోకి మద్యం దుకాణాలు వచ్చినా అక్రమాలు మాత్రం ఆగడం

మాయామద్యం!

మద్యం దుకాణాల్లో ఎమ్మార్పీకి మంగళం

సిబ్బంది చేతివాటం


కడప, మే 30 (ఆంధ్రజ్యోతి): ప్రైవేటు గుప్పెట నుంచి ప్రభుత్వం ఆధీనంలోకి మద్యం దుకాణాలు వచ్చినా అక్రమాలు మాత్రం ఆగడం లేదు. గతంలో మాదిరే ధరల ఉల్లంఘనకు పాల్పడుతున్నారు. కావాల్సిన బ్రాండ్‌ దొరకడం లేదు. ఇచ్చిందే తాగండంటూ సిబ్బంది తెగేసి చెబుతున్నారు. కోరుకున్న మందు కావాలంటే కాస్త ఎక్కువ పెట్టాల్సిందే. వెరశి మద్యంషాపుల్లో విక్రయాలు మాయగా మారాయని మందుబాబులు గొల్లుమంటున్నారు.


ఎమ్మార్పీకి మంగళం

మద్య నియంత్రణలో భాగంగా ప్రభుత్వం దుకాణాల సంఖ్య తగ్గిస్తూ వస్తోంది. జిల్లాలో 205 మద్యంషాపులు ఉన్నాయి. కరోనా నేపథ్యంలో నాన్‌ కంటైన్మెంటు జోన్లలోని 125 చోట్ల మాత్రమే మద్యం వికయ్రాలు జరుగుతున్నాయి. దీన్ని మద్యం షాపుల్లో పనిచేసే కొందరు సిబ్బంది సొమ్ము చేసుకుంటున్నారు. ఒక్కో క్వార్టర్‌పై 20 నుంచి 50 రూపాయలు అదనంగా తీసుకుంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి. కడప, పెండ్లిమర్రి, పోరుమామిళ్ల, కలసపాడు, రాజంపేట, రైల్వేకోడూరు, లక్కిరెడ్డిపల్లె ప్రాంతాల్లో కొన్నిచోట్ల ఎమ్మార్పీ ఉల్లంఘనకు పాల్పడుతున్నట్లు తెలుస్తోంది.


బయటి మార్కెట్లకు బ్రాండెడ్‌ మద్యం

డిమాండ్‌ ఉన్న మద్యం బ్రాండ్లు షాపులో కన్నా బయట ఎక్కవగా దొరుకుతున్నాయని సమాచారం. ఫుల్‌బాటిల్‌పై రూ.600 నుంచి 700 అదనంగా తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. షాపుల్లో పనిచేసే కొందరు సిబ్బంది బ్రాండెడ్‌ మద్యాన్ని వారే బిల్లింగ్‌ చేసి బయట విక్రయిస్తున్నట్లు తెలుస్తోంది. గతంలో మద్యం వ్యాపారం నిర్వహించిన కొందరు ప్రస్తుతం షాపుల్లోని సిబ్బందితో కుమ్మక్కై బ్రాండెడ్‌ మద్యాన్ని బయటికి తెప్పించేసి విక్రయిస్తున్నట్లు చెబుతున్నారు. షాపులపై నిఘా తగ్గడంతో కొంతమంది సిబ్బంది అక్రమాలకు పాల్పడుతున్నారని అభియోగాలు ఉన్నాయి.


చర్యలు తప్పవు: ఎస్‌ఈబీ అదనపు ఎస్పీ చక్రవర్తి

మద్యం విక్రయాల్లో అక్రమాలకు పాల్పడినా, నాటుసారా తయారు చేసినా కేసులు నమోదు చేస్తాం. బ్రాండెడ్‌ మద్యాన్ని కొందరు సిబ్బంది బయటికి తరలించి బ్లాక్‌లో విక్రయిస్తున్నారనే ఫిర్యాదులున్నాయి. దీనిపై నిఘా పెట్టాం. తప్పులు చేసినట్లు తెలిస్తే సిబ్బందిపై చర్యలు తీసుకుంటాం.

Updated Date - 2020-05-31T11:33:10+05:30 IST