మద్యము సుమతీ!

ABN , First Publish Date - 2020-05-07T06:12:21+05:30 IST

రెండు రోజుల నుంచి ప్రసారమాధ్యమాల్లో కొత్తరకం క్యూలు కనిపిస్తున్నాయి. అంతకు ముందు, ఖాళీ రోడ్ల మీద ఒక అంచున ఎవరో వరసగా నడిపిస్తున్నట్టు, వేలాదిమంది వలస కూలీల పాదయాత్రలు కనిపించేవి...

మద్యము సుమతీ!

రెండు రోజుల నుంచి ప్రసారమాధ్యమాల్లో కొత్తరకం క్యూలు కనిపిస్తున్నాయి. అంతకు ముందు, ఖాళీ రోడ్ల మీద ఒక అంచున ఎవరో వరసగా నడిపిస్తున్నట్టు, వేలాదిమంది వలస కూలీల పాదయాత్రలు కనిపించేవి. ఇప్పుడు కనిపిస్తున్న వరుసలు, మద్యం దుకాణాల ముందు నుంచి అనంతదూరాల దాకా విస్తరించినవి. ఒకే సందర్భంలో అనేక సన్నివేశాలు, విరుద్ధ దృశ్యాలు, విలోమ వాస్తవాలు, ఆభాస చిత్రాలు– భారతదేశ వేదిక మీద సహజమే. 


సామాజిక మాధ్యమాలలో బహు చమత్కారులు కొందరుంటారు. ‘‘తాగకుండా ఉండగలమని ప్రజలు నిరూపించారు, కానీ, తాగించకుండా ఉండలేమని ప్రభుత్వాలే ప్రకటించుకున్నాయి’’ అని ఒక వ్యాఖ్య. ‘‘కరోనాతో కుప్పకూలిన ఆర్థిక వ్యవస్థను, తాగితూలే తాగుబోతులు మాత్రమే నిలబెట్టగలరట’’ అని మరో వ్యాఖ్య. ఇందుకు ఏ రాష్ట్రప్రభుత్వాన్నీ ప్రత్యేకంగా నిందించలేము. కేంద్రమే అనుమతించినప్పుడు, తప్పు దానిదే కదా? అన్న ప్రశ్నలు వస్తున్నాయి. పేదప్రజల ఆరోగ్యాన్ని, ఆర్థికాన్ని కొద్దిగా కాపాడగలిగిన శక్తి తన చేతిలో ఉండి కూడా, కేంద్రం ఎందుకు మద్యానికి పచ్చజెండా ఊపిందో అర్థం కాదు. కేంద్రంలో అధికారం లో ఉన్నవారు చెప్పే సూక్తులు, సుభాషితాలను దృష్టిలో పెట్టుకుంటే, ఇటువంటి అనుమతి ఇంత తొందరగా ఇవ్వవలసింది కాదు. నిజానికి మద్యపానాన్ని అనుమతించడమా మానడమా అన్నది రాష్ట్రాల అంశం. విపత్తుల చట్టాన్ని ఎడాపెడా ఉపయోగించుకుంటున్న కేంద్రప్రభుత్వం అనేక అధికారాలను తన చేతిలోకి తీసుకుంటున్నందున, ప్రజాజీవనంలో అనుమతించే అంశాలను వారే సూచిస్తున్నారు. కేంద్రం చెప్పింది కాబట్టి కొన్ని రాష్ట్రాలు ముందే దుకాణాలు తెరిచాయి. పక్కరాష్ట్రాలు తెరుస్తున్నాయి కాబట్టి, తాము మూసి ఉంచడంలో అర్థం లేదని మరికొన్ని తెరిచాయి. నిర్ణయం ఎవరిదైనా, ఇంతకాలం స్తంభించిన జనజీవనం ఇప్పుడు తూలడం మొదలయింది.


మద్యం మీద నిషేధమేమీ లేదు. లాక్‌డౌన్‌ కంటె ముందు మద్యం అందుబాటులోనే ఉంది. పైగా, మద్యనిషేధం కావాలని ఎవరూ ఉద్యమించడం లేదు. కాబట్టి, ప్రభుత్వాల లాక్‌డౌన్‌ సడలింపులలో భాగంగా, మద్యజీవనం పునఃప్రారంభమైతే దానికి గాభరా పడనక్కరలేదు. కాకపోతే, ఇంతకాలం ఈ లాక్‌డౌన్‌ వెనుక, ఒక ప్రశాంత కుటుంబజీవనం, ఘర్షణలు లేని సామరస్యం సమాజంలో నెలకొని ఉండింది. లాక్‌డౌన్‌లాగే ఈ సాపేక్ష శాంతి కూడా చిరకాలం ఉండాలనుకోవడం అత్యాశ. మళ్ళీ పాత జీవితానికి మరలవలసిందే. మనుషులు శ్రమచేయాలి, ఉత్పత్తి చేయాలి, వేతనాలు పొందాలి, లాభాలు ఆర్జించాలి. సంపాదనలను ఖర్చు చేయాలి, అప్పులు తీసుకోవాలి. ఇదంతా ఒక వలయం. జనజీవనం ‘సాధారణం’ కాకపోతే, వ్యవస్థకు అవస్థే. దురదృష్టం ఏమిటంటే, వ్యసనంగా పరిగణించే మద్యంపై వచ్చే ఆదాయం ప్రభుత్వాలకు కీలకం కావడం. అది లేకపోతే బతకలేకపోవడం.


గతంలో భూమిశిస్తులు, లెవీల మీదే రాజ్యాలు ఆధారపడేవట. ఆధునిక కాలంలో భూముల ఆదాయాన్ని ఆబ్కారీ ఆదాయం మించిపోయింది. ప్రభుత్వాలకు ఇదొక నైతిక సమస్య కూడా. వ్యసనాలను ప్రోత్సహించడం బాహాటంగా చేయలేరు. అలాగని, దాన్ని నిషేధించలేరు. నిషేధాలు విధించిన సందర్భాలలో కూడా, కల్తీ మద్యం, అక్రమమద్యం పెరిగిపోతోందని చెప్పి నిషేధాన్ని ఎత్తివేసేవారు. నిజాం కాలంలో కూడా మద్యం పెద్ద ఆదాయ వనరు. అటువంటి ఆదాయంపై తమకేదో అయిష్టం ఉన్నట్టు, అప్పటి ప్రభుత్వంలో మద్యనిషేధ ప్రచారశాఖ ఒకటి ఏర్పాటు చేసి, పుస్తకాలు కరపత్రాలు ప్రచురించేవారు. ఉమ్మడిరాష్ట్రంలో మద్యనిషేధం విధించి, సడలించిన సందర్భాలలో ఎక్సైజ్‌శాఖకు ఏదో ఉదాత్తమైన పేరు పెట్టారు. మద్యపానం అనే రుగ్మతను అంతిమంగా రూపుమాపడమే లక్ష్యం అని అన్ని ప్రభుత్వాలూ చెబుతాయి. ఆ లక్ష్యసాధనలో భాగంగానే మద్యం ధరలు కూడా పెంచుతున్నామని చెబుతుంటారు. ఒక మూడు దశాబ్దాల కింద నక్సలైట్లు మద్యం ధరలు తగ్గించాలని ఉద్యమం చేసి, ప్రజలు మద్యం కొనకుండా కట్టడి చేశారు. అప్పుడు పోలీసుస్టేషన్ల ముందే పోలీసుల చేతనే మద్యం అమ్మించారు. ఇప్పుడు మద్యం షాపుల ముందు జనాన్ని నియంత్రించడానికి ప్రభుత్వ ఉపాధ్యాయులను ఉపయోగిస్తున్నారు. కాలమహిమ!


మద్యనిషేధం సాధ్యం కాకపోవచ్చును కానీ, మద్యం ఆదాయం మీద ఆధారపడే దుస్థితి నుంచి ప్రభుత్వాలు తమను తాము రక్షించుకోవడం ఎలాగో ఆలోచించాలి. రకరకాల పన్నుఎగవేతలు జరగకుండా చూస్తే, ఆరోగ్యకరమైన వ్యాపారాల నుంచే ప్రభుత్వాలకు తగినంత సొమ్ము వస్తుందేమో? నలభైరోజుల పాటు నిష్ఠగా ఇంటిపట్టున ఉండి, ఒక మహారోగాన్ని నిరోధించడానికి ప్రయత్నించిన సమాజానికి తపోభంగం జరిగినట్టు, దేశవ్యాప్తంగా మద్యం అంగళ్ళ ముందు జనం కనిపిస్తున్నారు. రోగనియంత్రణలో ఇది ఒక అవరోధం అవుతుందేమోనన్న భయం అర్థరహితం కాదు. ఆ భయమే నిజమైతే దేశమంతా పశ్చాత్తాపపడవలసి వస్తుంది.

Updated Date - 2020-05-07T06:12:21+05:30 IST