కరోనాకు ప్రజల ప్రాణాలు బలి.. ఈ అయిదుగురు దేశాధినేతలు అడ్డంగా ఫెయిలయ్యారు..!

ABN , First Publish Date - 2021-05-20T17:41:37+05:30 IST

విపత్తులను సమర్ధవంతంగా ఎదుర్కొని ప్రజల ప్రాణాలను కాపాడి, వారిలో ధైర్యం నిలిపగలిగేవాడినే నాయకుడు అంటారు. మిగిలిన సమయాల్లో ఎలా పరిపాలన సాగించినా కష్టకాలంలో తమకు అండగా ఉన్న వ్యక్తినే ప్రజలు జీవితాంతం గుర్తుంచుకుంటారు. కేరళ రాష్ట్రంలో జరిగింది అదే.

కరోనాకు ప్రజల ప్రాణాలు బలి.. ఈ అయిదుగురు దేశాధినేతలు అడ్డంగా ఫెయిలయ్యారు..!

విపత్తులను సమర్ధవంతంగా ఎదుర్కొని ప్రజల ప్రాణాలను కాపాడి, వారిలో ధైర్యం నిలిపగలిగేవాడినే నాయకుడు అంటారు. మిగిలిన సమయాల్లో ఎలా పరిపాలన సాగించినా కష్టకాలంలో తమకు అండగా ఉన్న వ్యక్తినే ప్రజలు జీవితాంతం గుర్తుంచుకుంటారు. కేరళ రాష్ట్రంలో జరిగింది అదే. నిఫా వైరస్ నుంచి నేటి కరోనా వరకు ప్రజల్లో చైతన్యాన్ని పెంచి, మహమ్మారులను సమర్ధవంతంగా ఎదుర్కొనగలిగారు కాబట్టే మళ్లీ పినరయి విజయన్‌కు పట్టం కట్టారు. ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ మాజీ మంత్రి కేకే. శైలజను రికార్డు మెజార్టీతో గెలిపించారు. అయితే కరోనా సృష్టిస్తోన్న ఈ విలయతాండవాన్ని సరిగ్గా అంచనా వేయలేక కొందరు దేశాధినేతలే తప్పటడుగులు వేశారు. ఈ కరోనా మహమ్మారి నుంచి ప్రజలను కాపాడటంలో విఫలమయ్యారు. అగ్రరాజ్యం అమెరికా నుంచి ఇటలీ, ఫ్రాన్స్, బ్రిటన్, భారత్ ఇలా ప్రతి దేశంలోనూ పీడకలలే మిగిల్చిన ఈ ప్యాండెమిక్‌ను కొన్ని దేశాలు సమర్థంగా ఎదుర్కొంటే, మరికొన్ని దేశాలు సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకోలేక తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి వచ్చింది. కొంతమంది ప్రస్తుత దేశాధినేతలు, మరికొందరు మాజీలు ఈ మహమ్మారి విజృంభిస్తోన్న సమయంలో తప్పుడు నిర్ణయాలు తీసుకున్నారు. దీని తీవ్రతను సీరియస్‌గా తీసుకోకపోవడం నుంచి సైన్స్‌ను పట్టించుకోకపోవడం, సామాజిక దూరం, మాస్క్ వంటి కనీస జాగ్రత్తలను లెక్కచేయకపోవడం వరకూ ఈ కింది నేతలంతా ఏదో ఒక పొరబాటు చేసినవాళ్లే. ఇలా కరోనాను నియంత్రించడంలో, ముఖ్యంగా సరైన నిర్ణయాలు తీసుకోవడంలో ఘోరంగా విఫలమైన ఐదుగురు దేశాధినేతల గురించి ప్రత్యేక కథనమిది..


భారత ప్రధాని నరేంద్రమోదీ

ప్రస్తుతం భారతదేశంలో రోజూ లక్షల్లో కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. దీనికితోడు వేల మంది ఈ మహమ్మారికి బలవుతున్నారు. కరోనాను కట్టడి చేయడంలో దేశం పూర్తిగా విఫలమైంది. దీనంతటికీ కారణం ఎవరు? అని ప్రశ్నిస్తే చాలా మంది వేలెత్తి చూపేది ప్రధాని మోదీ వైపే. ప్రపంచంలో, అలాగే భారత్‌లో కరోనా పెరుగుతున్న తరుణంలో కూడా మన దేశ ప్రధాని మాత్రం దీన్ని పట్టించుకోలేదు. ఏకంగా అంతర్జాతీయ సదస్సులో కరోనాను నియంత్రించడం ద్వారా భారత్.. ప్రపంచానికి చాలా మేలు చేసిందని, మానవజాతిని కాపాడిందని ఆయన ప్రకటించారు. మోదీ కేబినెట్‌లో ఆరోగ్య మంత్రి కూడా కరోనా ఎండ్‌గేమ్ చేరుకున్నామని, ఈ మహమ్మారి దేశంలో ముగిసినట్లేనని తేల్చేశారు. అదే సమయంలో కరోనా కేసులు పెరుగుతూ ఉండటాన్ని మోదీ సర్కారు పట్టించుకోలేదు. పరిస్థితిని చక్కదిద్దడం కోసం ఎలాంటి చర్యలూ చేపట్టలేదు. పైగా అయిదు రాష్ట్రాల్లో ఎన్నికల సందర్భంగా భారీ బహిరంగ సభలను కూడా నిర్వహించారు. ఫలితం కనిపిస్తూనే ఉంది. ఎటు చూసినా శవాల దిబ్బలు, ఆక్సిజన్ అందక ఆవిరైపోతున్న ప్రాణాలు. ఆస్పత్రుల్లో బెడ్లు లేవని మొహం మీద తలుపులు వేసేస్తే అంబులెన్సుల్లోనే కన్నుమూసిన పేషెంట్లు ఎందరో. మోదీని మరింత విమర్శలపాలు చేసిన విషయం.. వ్యాక్సిన్ ఎగుమతులు. 

(ఇది కూడా చదవండి: కరోనా కట్టడిలో బెస్ట్, వరస్ట్ దేశాల లిస్ట్ ఇదీ.. భారత్ ఏ జాబితాలో ఉందంటే..)

గతేడాది తాము కరోనాపై విజయం సాధించామని జబ్బలు చరుచుకునన మోదీ సర్కారు.. 10 మిలియన్లపైగా వ్యాక్సిన్లను ఇతర దేశాలకు పంపించింది. అయితే ఈ ఏడాది మే నాటికి కూడా మన దేశంలోని 130 కోట్ల జనాభాలు కేవలం 1.9శాతం మంది ప్రజలకు మాత్రమే వ్యాక్సిన్ అందింది. ప్రస్తుతం వ్యాక్సిన్ల కొరత వల్ల మొదటి డోసు వ్యాక్సిన్ వేయించుకున్న వారు.. రెండో డోసుకు తమ వంతు ఎప్పుడు వస్తుందా అని ఎదురుచూస్తున్నారు. 18 ఏళ్ల పై బడిన వారికి కూడా వ్యాక్సిన్ ఇచ్చేందుకు అనుమతులిచ్చిన కేంద్ర ప్రభుత్వం అందుకు సరిపడిన స్థాయిలో డోసులను మాత్రం రాష్ట్రాలకు అందివ్వలేకపోతోంది. అమెరికాలో బైడెన్ సర్కారు అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు వ్యాక్సిన్ ఇవ్వడమే ప్రథమ కర్తవ్యంగా పెట్టుకున్నారు. ప్రస్తుతం అగ్రరాజ్యంలో దాదాపు 70 శాతం మంది ప్రజలు వ్యాక్సిన్‌ను వేయించుకున్నారు. ఫలితంగా అక్కడ వ్యాక్సిన్ వేయించుకున్న వారు మాస్కులు ధరించనవసరం లేదంటూ ఉత్తర్వులు జారీ చేశారు. కానీ, భారత్‌లో మాత్రం అందుకు పూర్తి విరుద్ధంగా పరిస్థితులు ఉన్నాయి. ఓ వైపు కరోనా విజృంభిస్తోంటే, వ్యాక్సిన్ విషయంలో స్పష్టమైన విధానాన్ని రూపొందించడంలో మోదీ సర్కారు పూర్తిగా విఫలమయింది. గతేడాది లాక్‌డౌన్ పెట్టిన సమయంలో పదే పదే మీడియా ముందుకు వచ్చి ప్రజలకు ధైర్యం నూరిపోసిన ప్రధాని మోదీ, ప్రస్తుతం ముఖం చాటేస్తున్నారని విపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. 

(ఇది కూడా చదవండి: కరోనా నేర్పిన పాఠాలు.. అమెరికా నుంచి భారత్ నేర్చుకోవాల్సిందేంటి)

(ఇది కూడా చదవండి: కరోనా కథ ముగిసిందట.. ఇకపై మాస్కులు అక్కర్లేదట.. బీజేపీ నేతల వింత వ్యాఖ్యలెన్నో..!)


బ్రెజిల్ ప్రెసిడెంట్ జైర్ బొల్సనారో

ప్రస్తుతం ప్రపంచంలో అత్యధిక కరోనా కేసులు నమోదైన దేశాల జాబితాలో భారత్ తర్వాత ఉంది బ్రెజిల్ దేశమే. దీనికి ప్రధాన కారణం ఆ దేశాధ్యక్షుడు జైర్ బొల్సనారో. కరోనాతో ప్రపంచం మొత్తం అల్లాడుతుంటే ఆయన మాత్రం ‘‘ఇది జస్ట్ ఫ్లూ’’ అంటూ కొట్టిపారేశారు. మాస్కులు వేసుకొండి, సామాజిక దూరం పాటించండి అంటూ నిపుణులు చేసిన హెచ్చరికలను కావాలని పెడచెవినపెట్టారు. ఆయన్ను చూసి బొల్సనారో అనుచరులు కూడా ఇదే పని చేశారు. దేశంలో కరోనా కేసులు విపరీతంగా నమోదవుతున్న రోజుల్లో కూడా లాక్‌డౌన్ తొలగించాలంటూ ఒక వర్గం ప్రజలు నిరసనలు చేశారంటే వారిని బొల్సనారో మాటలు, చేతలు ఎంతలా ప్రభావితం చేశాయో అర్థం చేసుకోవచ్చు. సామాజిక దూరం, మాస్కుల గురించి ప్రజలకు అవగాహన కల్పించేందుకు ప్రభుత్వం చేపట్టిన చర్యలను కూడా బొల్సనారో అడ్డుకున్నారు. అధ్యక్షుడిగా తన అధికారం ఉపయోగించి లాక్‌డౌన్ సమయంలో కూడా స్పాలు, జిమ్స్‌ను ‘నిత్యావసరాలు’ అంటూ ఓపెన్ చేసుకోవడానికి అనుమతులు ఇచ్చారు. బొల్సనారో చేష్టల వల్ల దేశంలో కరోనా సంక్షోభం తీవ్రరూపం దాల్చింది. ప్రభుత్వంలో కూడా అసంతృప్తి కలుగజేసింది. కరోనా వచ్చిన ఒక్క ఏడాదిలోనే బ్రెజిల్‌లో నలుగురు ఆరోగ్యమంత్రులు మారారంటే అక్కడ ఎంతటి అస్థిర పరిస్థితులు ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. వ్యాక్సిన్ విషయంలో కూడా బొల్సనారో అపోహలు సృష్టించారు. అగ్రరాజ్యం అమెరికా సహా పలు దేశాధినేతలు స్వయంగా వ్యాక్సిన్ వేయించుకొని, ప్రజలను కూడా ప్రోత్సహిస్తుంటే.. బొల్సనారో మాత్రం తాను వ్యాక్సిన్ వేయించుకోనని, దాని వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయని తేల్చేశారు. 


బెలారస్ అధ్యక్షుడు అలెగ్జాండర్ లుకాషెంకో

కరోనా మహమ్మారి మిగతా దేశాల్లో సృష్టిస్తున్న విలయాన్ని చూసి కూడా చూడనట్లు వదిలేసిన నేత బెలారస్ అధ్యక్షుడు అలెగ్జాండర్ లుకాషెంకో. ఇటలీ, స్పెయిన్, అమెరికా వంటి దేశాల్లో ఈ మహమ్మారి వల్ల ఏర్పడ్డ శవాల దిబ్బలను చూసిన తర్వాత కూడా దేశంలో కరోనా నియంత్రణకు ఆయన ఎటువంటి చర్యలూ తీసుకోలేదు. లాక్‌డౌన్ పెట్టడానికి ససేమిరా అన్నారు. వోడ్కా తాగినా, సానా (ఆవిరి స్నానం) చేసినా, పొలం పనులు చేసినా కరోనా మన దరికి చేరదని ప్రజల ముందు నోటికి వచ్చినట్లు మాట్లాడేశారు. ఆ దేశ ప్రజల పరిస్థితులను ఇంకా దిగజార్చిన విషయం లుకాషెంకోకు కూడా కరోనా రావడం. ఆయన అసింప్టమాటిక్. దీంతో ‘‘చూశారా.. కరోనా వచ్చినా ఏం కాదు. దీని గురించి భయపడాల్సిన అవసరం లేదు’’ అని ఆయన ప్రచారం మొదలు పెట్టారు. కరోనా పేషెంట్లను కలవడానికి వెళ్లేప్పుడు కనీసం మాస్కు పెట్టుకోలేదు. కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చినా తాను తీసుకోనని తేల్చేశారు. ప్రస్తుతం ఈ దేశ జనాభాలో కనీసం 3శాతంమంది కూడా వ్యాక్సిన్ తీసుకోలేదంటే ఆ క్రెడిట్ మొత్తం అధ్యక్షుడు అలెగ్జాండర్‌దే.

(ఇది కూడా చదవండి: ఇవన్నీ పచ్చి అబద్దాలే.. అసలే ప్రజలంతా కరోనా భయంతో ఉంటే నెట్టింట ఈ నీచాలేంటి..?)


అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్

కరోనా మహమ్మారి పుట్టిన తర్వాత దీని ధాటికి అత్యంత ఘోరంగా దెబ్బతిన్న దేశం ఏదైనా ఉందంటే అది అగ్రరాజ్యం అమెరికానే. ఇప్పుడంటే భారత్, బ్రెజిల్, ఇంగ్లండ్, సౌతాఫ్రికా వంటి దేశాల్లో కరోనా కొత్త వేరియంట్లు వెలుగు చూసి ప్రజల ప్రాణాలను హరిస్తున్నాయి. కానీ ఈ వైరస్ వచ్చిన కొత్తల్లో ఈ వేరియంట్లేవీ లేవు. కానీ ఇప్పుడు పైన చెప్పిన దేశాల్లో కనిపిస్తున్న హృదయ విదారక దృశ్యాలు మాత్రం అమెరికాలో గతేడాదే కనిపించాయి. దీనికి కారణం మరెవరో కాదు అమెరికా అప్పటి అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. వైరస్ వ్యాప్తి చెందుతున్న తొలి రోజుల్లో ప్యాండెమిక్ పరిస్థితులను బహిరంగంగానే తిరస్కరించిన ఈయన తప్పుడు నిర్ణయాల వల్ల అమెరికాలో కొన్ని వర్గాల ప్రజలు తీవ్రంగా నష్టపోయారు. ఎలాగంటే.. అమెరికా జనాభాలో నల్లజాతీయులు, లాటినోస్ 31శాతమే ఉంటారు. కానీ కరోనా కేసులతో సాధారణ తెల్లజాతీయుల కంటే వీరు 3.5రెట్లు ఎక్కువ మంది ఆస్పత్రుల పాలయ్యారు. మరణాలు కూడా వీరివే 2.4రెట్లు ఎక్కువ. నిరుద్యోగిత కూడా ఈ వర్గాలనే దెబ్బతీసింది. ట్రంప్ హయాంలో కరోనా విజృంభిస్తున్న తరుణంలో లాటినోస్‌లో 17.6శాతం, ఆఫ్రికన్ అమెరికన్లు 16.8శాతం ఉద్యోగాలు కోల్పోయారు. అలాగే ఆసియన్ అమెరికన్లు 15శాతం ఉద్యోగాలు కోల్పోగా తెల్లజాతి అమెరికన్లు మాత్రం 12.4శాతమే నిరుద్యోగితను చవిచూశారు.


అదే సమయంలో కరోనాకు కారణం చైనానే అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు దీనికి ‘కుంగ్ ఫ్లూ’ అని పేరుపెట్టడం కూడా దేశప్రజలపై నెగిటివ్ ప్రభావం చూపింది. ట్రంప్ మాటల వల్ల దేశంలో ఆసియన్ అమెరికన్లపై దాడులు పెరిగిపోయాయి. ఈ దాడులు ఇప్పటికీ తగ్గుముఖం పట్టలేదంటే ట్రంప్ నిర్లక్ష్యపు మాటల ప్రభావం ప్రజలపై ఎంతలా పడిందో అర్థం చేసుకోవచ్చు. వ్యాక్సిన్ తయారీలో అమెరికా కీలక పాత్ర పోషించినప్పటికీ ట్రంప్ వల్ల వ్యాపించిన తప్పుడు సమాచారం, సైన్స్ వ్యతిరేక ప్రచారం ప్రభావం మాత్రం అమెరికాపై బాగా పడింది. ఎంతలా అంటూ తాజాగా చేసిన పోలింగ్‌ సర్వేలు 24శాతం అమెరికన్లు, 41 శాతం రిపబ్లికన్లు తాము వ్యాక్సిన్ తీసుకోమని స్పష్టం చేసేంతలా. 

(ఇది కూడా చదవండి: భయంతో బతికిన చోటే ఇప్పుడు బిందాస్.. బైడెన్‌కు థాంక్స్ చెబుతున్న అమెరికన్లు.. )

కరోనాను సరిగ్గా డీల్ చేయకపోవడమే ట్రంప్‌ను గతేడాది జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో ఓడించిందంటే అతిశయోక్తి కాదు. ఈ ఏడాది జనవరి 20న అగ్రరాజ్య పాలనా పగ్గాలు చేపట్టిన జో బైడెన్.. కరోనా విషయంలో కీలక చర్యలను తీసుకున్నారు. మొదటి వందరోజుల్లోనే 20 కోట్ల మంది ప్రజానీకానికి కరోనా వ్యాక్సిన్‌ను అందించింది. ప్రస్తుతం ఆ దేశ జనాభాలో సగానికి పైగా మంది కరోనా వ్యాక్సిన్‌ను తీసుకున్నారు. ఫలితంగా అక్కడ కేసుల సంఖ్య కూడా రోజుకు 50వేలకు మించడం లేదు. ఒకప్పుడు అమెరికాలో రోజుకు రెండు మూడు లక్షల్లో కేసులు నమోదయ్యేవి. దాన్ని అనూహ్యంగా తగ్గించగలిగారు. 


మెక్సికో అధ్యక్షుడు ఆండ్రెస్ మాన్యుయెల్ లోపెజ్ ఒబ్రడార్

అమెరికా, భారత్ వంటి దేశాల జనాభాతో పోల్చుకుంటే మెక్సికో జనాభా తక్కువ. కానీ ఈ రెండు దేశాలతో దాదాపు సరిసమానంగా మెక్సికోలో కరోనా మరణాలు నమోదయ్యాయి. ఈ దేశంలో కరోనా సోకిన ప్రజల్లో 9.2శాతం మంది మృత్యువాత పడ్డారంటే ఇక్కడ ఈ మహమ్మారిని ఎంత గొప్పగా కట్టడి చేశారో తెలిసిపోతోంది. దీనంతటికీ కారణం ఆ దేశాధ్యక్షుడు ఆండ్రెస్ మాన్యుయెల్ లోపెజ్ ఒబ్రడార్ నిర్లక్ష్యమే. ఆయన కరోనా తీవ్రతను లెక్కచేయలేదు. లాక్‌డౌన్ పెట్టాలని మొదట్లో వచ్చిన డిమాండ్లను కూడా తోసిపుచ్చారు. చివరకు గతేడాది మార్చి 23న రెండు నెలలపాటు లాక్‌డౌన్ విధించారు. ఆ తర్వాత కూడా మాస్క్ ధరించడానికి ఆండ్రెస్ పలుమార్లు నిరాకరించారు. అలాగే అసలే నిధులు కొరతతో సమస్యలు ఎదుర్కొంటున్న మెక్సికో వైద్యరంగానికి ప్యాండెమిక్ టైంలో అండగా ఉండాల్సింది పోయి.. దీన్ని కూడా ఆండ్రెస్ పెద్దగా పట్టించుకోలేదు. ఆయన ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో ఈ రంగానికి కేటాయించే నిధుల్లో చాలా కొంచమే పెరుగుదల కనిపించింది. దీంతో కరోనా మహమ్మారిని ఎదుర్కొనే బడ్జెట్ ఆస్పత్రుల వద్ద లేకుండా పోయింది. ప్రస్తుతం ఈ దేశం కరోనా ప్రభావం నుంచి నెమ్మదిగా కోలుకుంటోంది. ఇక్కడ 10శాతం ప్రజలు వ్యాక్సిన్ కూడా తీసుకున్నారు. కానీ ఆండ్రెస్ నిర్ణయాలతో జరిగిన నష్టం పూడ్చాలంటే మాత్రం చాలా కాలం పడుతుందని నిపుణులు అంటున్నారు.

Updated Date - 2021-05-20T17:41:37+05:30 IST