రూ.7.72 లక్షల కోట్లు

ABN , First Publish Date - 2021-04-22T06:39:58+05:30 IST

గత ఆర్థిక సంవత్సరం (2020-21)లో లిస్టెడ్‌ కంపెనీలు ప్రైవేట్‌ ప్లేస్‌మెంట్‌ పద్ధతిన బాండ్ల జారీ ద్వారా రూ.7.72 లక్షల కోట్లు సమీకరించాయి. అంతక్రితం ఆర్థిక సంవత్సరం (2019-20)తో పోలిస్తే...

రూ.7.72 లక్షల కోట్లు

  • 2020-21లో బాండ్ల జారీ ద్వారా లిస్టెడ్‌ కంపెనీలు సేకరించిన నిధులు 
  • 2019-20తో పోలిస్తే 14శాతం పెరుగుదల

న్యూఢిల్లీ: గత ఆర్థిక సంవత్సరం (2020-21)లో లిస్టెడ్‌ కంపెనీలు ప్రైవేట్‌ ప్లేస్‌మెంట్‌ పద్ధతిన బాండ్ల జారీ ద్వారా రూ.7.72 లక్షల కోట్లు సమీకరించాయి. అంతక్రితం ఆర్థిక సంవత్సరం (2019-20)తో పోలిస్తే 14 శాతం అధికమిది. అంతేకాదు, ఏదేని ఆర్థిక సంవత్సరంలో లిస్టెడ్‌ కంపెనీల ఈ మార్గంలో సేకరించిన నిధుల్లో ఇదే అత్యధికం. చౌక వడ్డీ రేట్లు, వ్యవస్థలో అదనపు ద్రవ్య లభ్యత అంశాలు ఇందుకు ప్రధానంగా దోహదపడ్డాయి. ఈ మార్గంలో నిధుల సమీకరణ మున్ముందు మరింత పెరిగేందుకు ఈ రెండు అంశాలే కీలకమని రిలయన్స్‌ సెక్యూరిటీస్‌ స్ట్రాటజీ విభాగ అధిపతి వినోద్‌ మోదీ అన్నారు. 2020-21లో ప్రైవేట్‌ ప్లేస్‌మెంట్‌ పద్ధతిన మొ త్తం 1,995 ఇష్యూలు నమోదయ్యాయి. 2019-20లో ఇష్యూల సంఖ్య 1,787గా ఉంది. మరిన్ని విషయాలు.. 


  1. క్యాపిటల్‌ మార్కెట్‌ నియంత్రణ మండలి సెబీ వద్ద ఇందుకు సంబంధించి 2007-08 ఆర్థిక సంవత్సరం నుంచి డేటా మాత్రమే అందుబాటులో ఉంది. 2007-08లో నిధుల సమీకరణ రూ.1.18 లక్షల కోట్లుగా నమోదైంది. 
  2. సాధారణంగా లిస్టెడ్‌ కంపెనీలు ఆర్థిక సామర్థ్యాన్ని మరింత పటిష్ఠం చేసుకోవడం, రుణ భారం తగ్గించుకోవడం లేదా నిర్వహణ మూలధన అవసరాల కోసం ఈ మార్గంలో నిధులు సేకరిస్తుంటాయి. 
  3. ఈ మార్గంలో నిధుల సేకరణకు బాండ్లపై తక్కువ వడ్డీ ప్రధాన కారణమని గ్రో సహ-వ్యవస్థాపకులు హర్ష్‌ జైన్‌ అన్నారు. మొండి బకాయిల భయంతో గడిచిన కొన్నేళ్లలో  బ్యాంక్‌లు, ఎన్‌బీఎ్‌ఫసీలు కంపెనీలకు పెద్దమొత్తంలో రుణాలిచ్చేందుకు ముందుకు రాకపోవడం మరో కారణమన్నారు. 
  4. ప్రైవేట్‌ ప్లేస్‌మెంట్‌ ద్వారా లిస్టెడ్‌ కంపెనీలు సంస్థాగత ఇన్వెస్టర్లకు సెక్యూరిటీలు లేదా బాండ్లు జారీ చేస్తాయి.  
  5. బాసెల్‌-3 ప్రమాణాలకు ప్రమాణాలకు అనుగుణంగా మూలధనాన్ని పెంచుకునేందుకు పలు బ్యాంకులు సైతం ఈ మార్గంలో నిధులు సేకరించాయి.  
  6. ఈ బాండ్లలో పెట్టుబడులు పెట్టేందుకు ఎల్‌ఐసీ వంటి దేశీయ సంస్థాగత ఇన్వెసర్లు అధిక  ఆసక్తి కనబరుస్తుండటమూ కంపెనీల నిధుల సేకరణకు కలిసి వస్తోంది. 
  7. కరోనా సంక్షోభం నేపథ్యంలో ఈ ఏడాది ఈ మార్గంలో నిధుల సేకరణ మరింత పెరగవచ్చని అంచనా. 

Updated Date - 2021-04-22T06:39:58+05:30 IST