Abn logo
Nov 16 2020 @ 01:21AM

ఇంటర్నెట్‌లో పాగా వేసిన సాహిత్య సదస్సులు

ఇప్పుడు వాట్సాప్‌లు, ఈ-మెయిల్స్‌ ఎటు చూసినా రకరకాల సాహిత్య సదస్సులు, కార్యశాలలు, అధ్యాపక అభివృద్ధి కార్యక్రమాల లింకుల సందళ్ళే. గూగుల్‌ మీట్‌, జూమ్‌, వెబెక్స్‌లలో నిరంతరాయంగా సదస్సులు, కార్యశాలల రూపంలో జ్ఞానం ప్రవహిస్తోంది. కళాశాలల్లోనూ, విశ్వవిద్యాలయాల్లోనూ అయితే లక్ష నుంచి రెండు లక్షల రూపాయల ఖర్చును మిగిల్చే కార్యక్రమాలు ఇంటర్నెట్‌లో కొద్దిపాటి ఖర్చుతో (2000రూ.లోపే) జరిగిపోతున్నాయి.


కరోనా కాలంలో ఇంటర్నెట్‌ చూస్తుంటే ముచ్చటేస్తోంది. వాట్సాప్‌, ఈ-మెయిల్స్‌... ఎటుచూసినా రకరకాల సాహిత్య సదస్సులు, కార్యశాలలు, అధ్యాపక అభివృద్ధి కార్యక్రమాల లింకుల సందళ్ళే. గూగుల్‌ మీట్‌, జూమ్‌, వెబెక్స్‌లలో నిరంతరాయంగా సదస్సులు, కార్యశాలల రూపంలో జ్ఞానం ప్రవహిస్తోంది. ఈ జ్ఞానంలో తడిసి ముద్దవడానికి అర్హతలేమీ అవసరం లేదు. ఆయా కళాశాలలు, విశ్వవిద్యాలయాలు ఇచ్చిన లింకులలోకెళ్ళి ఆ సమయంలో ఆ కార్యక్రమాన్ని వీక్షిస్తే చాలు. ఈ కార్యక్రమాల్లో చాలా రకాలు ఉన్నాయి. లాభాలు, నష్టాలూ ఉన్నాయి. ఇంతకుముందు కళాశాలల్లో జరిగే ఈ సదస్సుల్లో యాభైమంది పాల్గొనడం కష్టంగా ఉండేది. అలాంటిది ఇంట ర్నెట్‌లో ఈ సంఖ్య ఒక్కోసారి వందలనుంచి వేలల్లోకి చేరుతోంది. దానికి కారణం వ్యక్తులు భౌతికంగా ఎక్కడున్నా బౌద్ధికంగా ఇంటర్నెట్‌ వారిని చేరువచేయడమే. కళాశాలల్లోనూ, విశ్వవిద్యాలయాల్లోనూ అయితే లక్ష నుంచి రెండు లక్షల రూపాయల ఖర్చును మిగిల్చే కార్యక్రమాలు ఇంటర్నెట్‌లో కొద్దిపాటి ఖర్చుతో (2000రూ.లోపే) జరిగిపోతున్నాయి. కొందరు నిర్వాహకులు కార్యక్రమం మొత్తాన్ని యూట్యూబ్‌లో కూడా అప్లోడ్‌ చేస్తున్నారు. 


ఈ కార్యక్రమాల్లో పాల్గొనేటటువంటి అభ్యర్థుల్లో నాలుగు రకాలవాళ్ళను గమనించవచ్చు: జిజ్ఞాసాపరులు, జ్ఞానార్థులు, పత్రార్థులు, కేవల పత్రార్థులు. ఏదో ఒక కొత్త విషయం తెలుసుకోవాలని ఎప్పుడూ తపించే జిజ్ఞాసా పరులు ఏ కార్యక్రమంలోనైనా తక్కువ సంఖ్యలోనే ఉంటారు. వీరు కార్యక్రమం ఆసాంతం విని ఎక్కడా కొత్త విషయం వినపడకపోతే ఎవరినీ నిందించరు కానీ, ఒక్క నిట్టూర్పు మాత్రం విడుస్తారు. ఇక జ్ఞానార్థులకు కొత్త విషయం తెలుసుకోవాలని ఉన్నా దానికో లెక్కుంటుంది. సదస్సు ఆహ్వానపత్రం చూడగానే ఏ ఉపన్యాసాలు వినాలో, ఏవి విననవసరం లేదో ముందుగానే నిర్ణయించుకొని ఆ సమయానికి కార్యక్రమానికి హాజరై వినాలను కున్నది మాత్రమే విని వచ్చేస్తారు. సర్టిఫికేట్‌కి ప్రాధాన్యతనివ్వని వీరూ సదస్సులలో తక్కువ సంఖ్యలోనే ఉంటారు. ఇక పత్రార్థులకసలు కార్య క్రమంలో విషయంతో పెద్దగా అవసరం లేదు. ఆ సదస్సుకు ధ్రువీకరణ పత్రం ఉందా లేదా? ఇది జాతీయ సదస్సా? లేక అంతర్జాతీయ సదస్సా? సదస్సులో పాల్గొన్న తర్వాత వచ్చే ధ్రువీకరణ పత్రం విలువెంత? అన్నది మాత్రమే వీరికి అవసరం. వీరు కార్యక్రమం చివరి దాకా ఉన్నా ‘‘చిత్తం చెప్పుల మీద’’ అన్న సామెతలా వీరి ధ్యాస ధ్రువీకరణ పత్రం మీదే ఉంటుంది. వీరి వల్లనే సెమినార్లు సంఖ్యాపరంగా విజయ వంతం అవుతుంటాయి. ఇక కేవల పత్రార్థులకు మాత్రం ఏ కార్యక్రమానికి నమోదు చేసుకున్నామో, దేనికి హాజరయ్యామో కూడా గుర్తుండదు. వాట్సాప్‌ గ్రూపుల్లో కనిపించిన ఫీడ్‌బ్యాక్‌లన్నీ నింపి నిర్వాహకులను సర్టిఫికేట్‌ గురించి అడుగుతూనే ఉంటారు. వీరి బాధ పడలేకే నిర్వాహకులుకూడా గూగుల్‌ సర్టిఫికేట్‌ పుణ్యమా అని ఫీడ్‌బ్యాక్‌ నింపిన ప్రతివాడికీ సర్టిఫికేట్‌ వచ్చేట్టు చేస్తున్నారు. 


ఇక నిర్వాహకుల్లో కూడా నాలుగు రకాలు ఉన్నారు. మొదటి రకం రాశి నిర్వాహకులు. వీరు ముందుగా లెక్క వేసుకునేది సంఖ్యాబలాన్ని. ఎంత ఎక్కువమంది వస్తే అంత గొప్పన్నట్టుగా ఉండడం వీరి వ్యవహారశైలి. అందుకే చాలా తేలికైన, ఎక్కువమంది వస్తారనుకునే అంశాన్ని మాత్రమే తీసుకుంటారు. రెండవ రకం వాసి నిర్వాహకులు. వీరు సంఖ్యకు ప్రాధాన్యం ఇవ్వరు. విషయం, పరిశోధన ముఖ్యం. వీరు సదస్సుకు అవసరమైన విషయాన్ని నిర్ణయించుకున్న తర్వాత దానికి అనుగుణమైన వక్తలనే పిలుస్తారు. ఇలాంటి కార్యక్రమాలు తక్కువగానే ఉన్నాయి. మూడవ రకం స్వార్థ నిర్వాహకులు. ఏ కార్యక్రమమైనా విజయవంతం కావాలంటే తప్పనిసరిగా ఒకరో ఇద్దరో ప్రముఖ వ్యక్తులు ఉండాలి. కానీ ఈ నిర్వాహకుల ఆహ్వాన పత్రిక చూస్తే ప్రము ఖులకు తప్ప మరొకరికి చోటు ఉండదు. సదస్సు మీదకాక, దాని ద్వారా పొందే ప్రయోజనం మీదే వీరి దృష్టి. వీరు ముఖ్య వక్తలను నిర్ణయించిన తర్వాతే సదస్సు అంశాన్ని వారికి అనుగుణంగా నిర్ణయించుకుంటారు. ప్రముఖ వ్యక్తులతో సంబంధాలను కొనసాగించడం వీరికి ముఖ్యం. ఇక నాల్గవ రకం గుర్తింపు నిర్వాహకులు. సదస్సు నిర్వహించడం ద్వారా తమకు, తమ కళాశాలకు లేదా విశ్వవిద్యాలయానికి పేరు రావాలని భావించి పదే పదే సదస్సులు నిర్వహించడం వీరి పని. గుర్తింపు కోరుకునే వారికీ సంఖ్యా బలమే ప్రధానం. సదస్సు నిర్వాహకులలో కొంతమంది తమకన్నా ఎక్కువ జ్ఞానం ఉన్నవారినిగాక తక్కువ జ్ఞానం ఉన్నవారిని మాత్రమే ఆహ్వానించే వారూ ఉన్నారు. లాభం, గుర్తింపు రెండూ కోరుకునే నిర్వాహకులూ ఉన్నారు. 


ఇంటర్నెట్‌లో ఇంత విస్తృతంగా సదస్సులు జరగడానికి మరో కారణం వక్తలైవరైనా ఎలాంటి రుసుమూ కోరకుండానే పాల్గొనడం కూడా. రుసుము ఆశించకపోవడం అనేది ఎంతకాలం కొనసాగుతుందో చెప్పలేం కానీ కొనసాగినంత కాలం మాత్రం ఈ సదస్సులు ముప్పై పువ్వులు అరవై కాయలుగా వెల్లి విరుస్తాయి. 

కరుణశ్రీ