అనుమతి కొంతే.. తవ్వేది ఎంతో!

ABN , First Publish Date - 2021-04-08T07:35:33+05:30 IST

ఆయన అధికార పార్టీకి చెందిన నాయకుడు. పార్లమెంటు నియోజకవర్గ స్థాయి నేత. మైనింగ్‌లో ఏదైనా తను చెప్పిందే నడవాలి. ఆయన బంధువు ఒకాయన రెండెకరాల్లో గ్రావెల్‌ తవ్వకాలకు తాత్కాలిక అనుమతి తెచ్చుకున్నారు. అయితే ఆ రెండెకరాలకు తోడు మరో రెండెకరాల్లోనూ ఎలాంటి అనుమతులు లేకుండా..

అనుమతి కొంతే.. తవ్వేది ఎంతో!

  • -గుంటూరులో యథేచ్ఛగా తవ్వకాలు
  • -ఓ పార్లమెంటు స్థాయి నేత దందా
  • -తొలుత రెండెకరాల్లో అనుమతులు
  • -ఆపై మరో రెండెకరాల్లోనూ తవ్వకం
  • -సీనరేజి ఎగ్గొట్టి రూ.కోట్లు జేబులోకి
  • -గ్రావెల్‌ ఎక్కడ తవ్వినా లారీకివెయ్యి
  • -అధికార నేత భీతితో తనిఖీల్లేని వైనం


(అమరావతి - ఆంధ్రజ్యోతి)

ఆయన అధికార పార్టీకి చెందిన నాయకుడు. పార్లమెంటు నియోజకవర్గ స్థాయి నేత. మైనింగ్‌లో ఏదైనా తను చెప్పిందే నడవాలి. ఆయన బంధువు ఒకాయన రెండెకరాల్లో గ్రావెల్‌ తవ్వకాలకు తాత్కాలిక అనుమతి తెచ్చుకున్నారు. అయితే ఆ రెండెకరాలకు తోడు మరో రెండెకరాల్లోనూ ఎలాంటి అనుమతులు లేకుండా...ప్రభుత్వ సీనరేజి ఎగ్గొట్టి అక్రమంగా గ్రావెల్‌ తవ్వేసి అమ్మేస్తున్నారు. అంతే కాదు..అక్కడ కొందరి పొలా ల్లో ఉన్న గ్రావెల్‌ను తవ్వుకునేందుకు కూడా ప్రభుత్వ అనుమతులు ఆయనకు అక్కర్లేదు. ‘లారీకి వెయ్యి రూపాయలు ఇవ్వండి...మిగతాది నేను చూసుకుంటా’ అనే భరోసా ఇచ్చి ఆ మేరకు సొమ్ములు వసూలుచేస్తున్నారు. అక్రమంగా మైనింగ్‌ చేసుకోవడానికి అండగా ఉంటున్నారు. గుంటూరు నగరం సమీపంలో జరుగుతున్న ఈ అక్రమ మైనింగ్‌ తతంగంపై అధికారులు కిమ్మనడం లేదు. అధికార పార్టీ నాయకుడు కావడంతో మాట్లాడకుండా ఉండిపోతున్నారని తెలిసింది. వివరాల్లోకి వెళితే.. గుంటూరు నగరం సమీపంలో గుంటూరు గ్రామీణ మండలం పొత్తూరు, ఓబులనాయుడుపాలెం భూముల్లో తవ్వకాలకు తొలుత ఒక రెండెకరాలకు అనుమతి తెచ్చారు. దానిని చూపించి మరోచోట రెండెకరాల్లో తవ్వేస్తున్నారు. ప్రతిరోజు వందలకొద్దీ లారీల గ్రావెల్‌ను అక్రమంగా అమ్మేస్తున్నారు. ఒక్కో లారీ గ్రావెల్‌ను రూ.2,500 -3,000కు అమ్ముతున్నట్లు సమాచారం. రవాణా ఖర్చులు గ్రావెల్‌ కొనుగోలుదారులవే. ఈ రెండున్నర-మూడువేలల్లో లోడింగ్‌ చేయడానికి, ఇతర ఖర్చులు కలిపి రూ.500లోపే. మిగిలిందంతా సదరు రాజకీయ నేత, ఆయన బంధువుల జేబుల్లోకి వెళ్తోందని ప్రభుత్వానికి రావాల్సిన సీనరేజి సొ మ్ము కూడా చెల్లించడం లేదని సమాచారం. సీనరేజి కట్టే ప ని కూడా లేకపోవడంతో ఆ డబ్బూ వారికే వెళ్తోంది. గత 2 నెలలుగా ఈ దందా సాగుతున్నదని తెలిసింది. ఈ లెక్కన చూస్తే కొన్ని కోట్ల రూపాయలను అక్రమంగా కొల్లగొట్టేశారని అంటున్నారు. వాగు పోరంబోకు భూముల్లో అక్రమ మైనింగ్‌ యథేచ్ఛగా సాగుతోంది. ప్రైవేటు లే అవుట్లు, నిర్మాణాల కోసం భూమిని ఎత్తు చేయడం తదితర అవసరాలకు ఇక్కడ గ్రావెల్‌కు బాగా డిమాండ్‌ ఉంది. ఈ ప్రాంతం జాతీయ రహదారికి ఆనుకుని ఉండడంతో ఎప్పుడూ ఏవో ఒక రియల్‌ ఎస్టేట్‌ వెంచర్లు, గోదాముల నిర్మాణంలాంటివి సాగుతుంటాయి. వాటన్నింటికీ గ్రావెల్‌ అవసరం. 


గ్రావెల్‌ తవ్వితే నేతకు వాటా

సదరు రాజకీయ నేత అండదండలతో ఆయన బంధువు సాగిస్తున్న అక్రమ మైనింగ్‌తో పాటు మరో అక్రమానికి కూ డా తెరతీశారు. అక్కడ ప్రైవేటు పట్టా భూముల్లో ఉన్న గ్రావెల్‌ను తమకు లారీకి వెయ్యి రూపాయల చొప్పున ఇచ్చి...బయటకు అమ్ముకోవచ్చనే డీల్‌ కుదుర్చుకున్నట్లు తెలిసింది. అంటే అక్రమంగా గ్రావెల్‌ తవ్వుకున్నందుకు అధికార పార్టీ నాయకుడికి వాటా అన్నమాట. ఈ పద్ధతిలో ప్రైవేటు భూముల్లో కూడా అక్రమంగా మైనింగ్‌ చేసేస్తున్నారని సమాచారం. అయితే అధికార యంత్రాంగం మాత్రం ఇదేమీ పట్టనట్లు వ్యవహరిస్తోంది. 

Updated Date - 2021-04-08T07:35:33+05:30 IST