నవ్వుతూ బతకాలిరా..!

ABN , First Publish Date - 2020-08-12T06:00:29+05:30 IST

నవ్వు నాలుగు విధాలా మంచిదంటారు. అంతేకాదు ఒత్తిడి నుంచి బయటపడేసే ఖర్చులేని ఔషధం కూడా. అయితే ఎడతెరిపి లేని పని, తీరిక దొరకని జీవనశైలి వల్ల చాలామంది రోజుకు సగటున 18 సార్లే నవ్వుతున్నారని తాజాగా ఒక అధ్యయనం...

నవ్వుతూ బతకాలిరా..!

నవ్వు నాలుగు విధాలా మంచిదంటారు. అంతేకాదు ఒత్తిడి నుంచి బయటపడేసే ఖర్చులేని ఔషధం కూడా. అయితే ఎడతెరిపి లేని పని, తీరిక దొరకని జీవనశైలి వల్ల చాలామంది రోజుకు సగటున 18 సార్లే నవ్వుతున్నారని తాజాగా ఒక అధ్యయనం చెబుతోంది. అది కూడా ఇతరులతో మాట్లాడుతున్నప్పుడు, వాళ్లకు జాలీగా అనిపించినప్పుడు మాత్రమే నవ్వుతున్నారట. ఇదంతా ఎందుకు చెబుతున్నారంటే.. రోజులో ఎక్కువ సార్లు నవ్వుతూ ఉండేవారు ఒత్తిడిని తేలిగ్గా జయిస్తారంటున్నారు స్విట్జర్‌లాండ్‌ బసెల్‌ విశ్వవిద్యాలయం పరిశోధకులు. 


రోజులో ఎన్నిసార్లు నవ్వుతారనేది వారి వయస్సు, లింగం, ఆ రోజు వారికి ఎదురయ్యే పరిస్థితులు, అనుభవాల మీద ఆధారపడి ఉంటుందని పరిశోధకులు చెబుతున్నారు. ఇంకో విశేషమేమంటే... పురుషుల కన్నా మహిళలు సగటున రోజులో ఎక్కువ సార్లు నవ్వుతారట. బసెల్‌ యూనివర్సిటీలోని సైకాలజీ విభాగానికి చెందిన ‘క్లినికల్‌ సైకాలజీ అండ్‌ ఎపిడెమియోలజీ’ పరిశోధకులు ఇటీవల జరిపిన పరిశోధనలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. రోజువారీ జీవితంలో ఎదురయ్యే ఒత్తిడి, ఒత్తిడిని జయించడంలో నవ్వు పాత్ర మీద వారు ఈ అధ్యయనం చేశారు. 


ఎనిమిది ప్రశ్నలు... 14 రోజులు... 

పరిశోధకులు తమ అధ్యయానికి 22ఏళ్ల లోపు వయసున్న 41మంది సైకాలజీ విద్యార్థులను ఎంచుకున్నారు. వీరిలో 33 మంది అమ్మాయిలు ఉన్నారు. వీరికి మొబైల్‌ యాప్‌ ద్వారా కొన్ని ధ్వని సంకేతాలను పంపారు. వాటిని విని వీరంతా రోజుకు ఎనిమిది ప్రశ్నలకు సమాధానం చెప్పేవారు. అలా 14 రోజులు వారిని నిశితంగా పరిశీలించారు. ఎంత బిగ్గరగా నవ్వారు, ఎన్ని సార్లు నవ్వారు, నవ్వడానికి కారణం, చివరి సంకేతం వచ్చేనాటికి  ఒత్తిడి తాలూకు లక్షణాలు, ఒత్తిడి పెంచే సంఘటనలు ఏవైనా జరిగాయా వంటివి ఆరా తీశారు. నవ్వు, ఒత్తిడికి సంబంధించిన అంశాలు, దాని తాలూకు మానసిక, శారీరక లక్షణాలను పరిగణనలోకి తీసుకున్నారు. ఈ పరిశోధనకు డాక్టర్‌ జాండెర్‌ షెలెన్‌బర్గ్‌, డాక్టర్‌ ఇసబెల్లా కొలిన్స్‌ సారథ్యం వహించారు. 


ఎలా నవ్వారనేది కాదు... 

మొదటి ఫలితంలో ఎక్కువగా నవ్విన వారిలో ఒత్తిడికి కారణమయ్యే విషయాలు, ఒత్తిడి లక్షణాలు చాలా తక్కువ కనిపించాయని తేలింది. రెండో ఫలితంలో ఎలా నవ్వారు (బిగ్గరగా, చిన్నగా, ముక్తసరిగా నవ్వడం) అనేది ఒత్తిడి మీద ప్రభావం చూపలేదు. అందుకు కారణం వాళ్లంతా ఎన్నిసార్లు నవ్వామనే దాని మీదే దృష్టి పెట్టారు. అంతేతప్ప ఎలా నవ్వాము అనే  దానిమీద కాదని పరిశోధకులు చెప్పారు. 





సక్సెస్‌ మంత్ర 

విశాల దృక్పథం, అసహనం, ఆశావహ వైఖరితో ఉండండి. అలా మారగలిగితే మిమ్మల్ని చరిత్ర గుర్తుపెట్టుకొంటుంది. దేన్నయినా మార్చగల అవకాశం మీకుంది. ప్రయత్నించండి. 

- సుందర్‌ పిచాయ్‌, గూగుల్‌ సీఈఓ.

Updated Date - 2020-08-12T06:00:29+05:30 IST