కాలేయం జర భద్రం!

ABN , First Publish Date - 2021-04-20T05:30:00+05:30 IST

శరీరంలోని ప్రధాన అంతర్గత అవయవాల్లో ఒకటైన కాలేయం అతి పెద్ద రసాయన కర్మాగారం లాంటిది. శరీర ఎదుగుదలకు అవసరమైన 500 రకాల శరీర జీవక్రియలకు తోడ్పడడంతో పాటు, గ్లూకోజ్‌, ప్రొటీన్‌, కొవ్వులు, మెటబాలిజం, జీర్ణప్రక్రియల్లో కాలేయం కీలక పాత్ర పోషిస్తుంది...

కాలేయం జర భద్రం!

శరీరంలోని ప్రధాన అంతర్గత అవయవాల్లో ఒకటైన కాలేయం అతి పెద్ద రసాయన కర్మాగారం లాంటిది. శరీర ఎదుగుదలకు అవసరమైన 500 రకాల శరీర జీవక్రియలకు తోడ్పడడంతో పాటు, గ్లూకోజ్‌, ప్రొటీన్‌, కొవ్వులు, మెటబాలిజం, జీర్ణప్రక్రియల్లో కాలేయం కీలక పాత్ర పోషిస్తుంది.


శరీరంలోని అత్యంత ప్రత్యేకమైన అవయవమైన కాలేయం తిరిగి పెరిగే గుణం కలిగి ఉంటుంది. అవయవం దెబ్బతిన్న సందర్భాల్లో కొత్త కాలేయ కణాలు పెరిగి, జీవక్రియలు సజావుగా సాగేలా చేస్తాయి. అయితే కాలేయం 80శాతం మేరకు దెబ్బతిన్నప్పుడు, అది తిరిగి కోలుకోలేక, తిరిగి సరిదిద్దలేనంతగా డ్యామేజ్‌ అవుతుంది. ఈ పరిస్థితి లివర్‌ ఫెయిల్యూర్‌కు, అంతిమంగా మరణానికి దారి తీస్తుంది.


నిశ్శబ్దంగా చంపేస్తుంది!

కాలేయ వ్యాధి తిరిగి సరిదిద్దలేనంతగా, చివరి దశకు చేరుకున్నప్పుడు మాత్రమే లక్షణాలు బయల్పడతాయి. ఆ సమయంలో కాలేయ మార్పిడి ఒక్కటే ప్రత్యామ్నాయం. కాలేయం జబ్బుపడడానికి లివర్‌ డ్యామేజ్‌కు దారి తీసే, కొన్ని అత్యంత కీలకమైన కారణాలు... మద్యం, హెపటైటిస్‌ బి, హెపటైటిస్‌ సి, ఫ్యాటీ లివర్‌.


కాలేయం తిరిగి సరిదిద్దలేనంత చివరి దశ ‘సిర్రోసిస్‌’కు చేరుకునేంత వరకూ లక్షణాలు కూడా బయల్పడవు. విపరీతమైన నిస్సత్తువ, అలసట, కండరాలు కరిగిపోవడం లాంటి లక్షణాలు ప్రారంభంలో కనిపించవచ్చు. వ్యాధి తీవ్రమైన దశలో రక్తపు వాంతులు, నల్లని మలం, కామెర్లు, పొట్టలో నీరు చేరడం, కాళ్ల వాపు, శ్వాస అందకపోవడం, అయోమయం, మత్తు మొదలైన లక్షణాలు కనిపిస్తాయి.


వ్యాయామం అవసరం!

- ఫ్యాటీ లివర్‌ రుగ్మత అయిన ‘నాష్‌’తో తలెత్తిన సిర్రోసిస్‌ ఇటీవలి కాలంలో ఎక్కువగా బయల్పడుతోంది. ఇందుకు కొవిడ్‌ సమయంలో వ్యాయామానికి ఆస్కారం లేని, ఒత్తిడితో కూడిన జీవనశైలిని గడపడం ప్రధాన కారణం. అలాగే ఊబకాయం, మధుమేహం, అధిక కొలెస్ట్రాల్‌తో కూడిన మెటబాలిక్‌ సిండ్రోమ్‌ కూడా కాలేయానికి మద్యంతో కలిగే నష్టానికి సమాన నష్టాన్ని కలిగిస్తాయి. ఈ పరిస్థితి రాకుండా ఉండాలంటే, ఆరోగ్యకరమైన జీవనశైలిని అనుసరిస్తూ, క్రమం తప్పక వ్యాయామం లేదా యోగా చేస్తూ, అధిక రక్తపోటు, మధుమేహాలను అదుపులో ఉంచుకోవాలి.



కాలేయానికి గాయాలు!

కామెర్లు కాలేయం జబ్బు పడిందనడానికి సంకేతం అనే విషయం అందరికీ తెలుసు. అయితే కాలేయ జబ్బుకు దారితీసిన అసలు కారణాన్ని వైద్య సహాయంతో కనిపెట్టి, తగిన చికిత్స తీసుకోవడం ఎంతో కీలకం. మూలికా వైద్యాలు, ఇతరత్రా నాటు మందుల వల్ల కాలేయానికి మేలు కంటే హాని ఎక్కువ. కొన్ని సందర్భాల్లో తీవ్రమైన లివర్‌ ఫెయిల్యూర్‌కూ దారి తీయవచ్చు. ఇలాంటి సందర్భాల్లో కాలేయ మార్పిడి అవసరం అవుతుంది. కాబట్టి కామెర్లు కనిపించినప్పుడు కాలేయ వ్యాధి మరింత ముదిరిపోకుండా ఉండడం కోసం వైద్యుల సలహాలను తీసుకోవాలి. ఆకలి మందగించడం, పొట్ట నిండుగా ఉన్నట్టు అనిపించడం, మత్తుగా ఉండడం, బరువు కోల్పోవడం, కాళ్ల వాపు లాంటి లక్షణాలు కనిపిస్తే, ఆలస్యం చేయకుండా వైద్యులను సంప్రతించాలి. ఆలస్యం చేయడం వల్ల కాలేయ సిర్రోసిస్‌ లేదా కాలేయ కేన్సర్‌లకు గురి కాక తప్పదు. 

ఆరోగ్యకరమైన ఆహారం, జీవనశైలిని అనుసరిస్తూ, మద్యపానం మానుకుని, మధుమేహాన్ని అదుపులో ఉంచుకుంటూ హెపటైటిస్‌ పరీక్షలు క్రమం తప్పక చేయించుకుంటూ అవసరాన్ని బట్టి వైద్య సహాయం తీసుకోగలిగితే కాలేయ వ్యాధుల నుంచి రక్షణ పొందవచ్చు.


హెపటైటిస్‌ మహమ్మారి!

ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనాల ప్రకారం ప్రతి ఏటా 10 లక్షల మంది హెపటైటిస్‌ సంబంధ సమస్యలతో ప్రాణాలు కోల్పోతున్నారు. సుమారు 200 కోట్ల జనాభా ప్రస్తుతం హెపటైటిస్‌ బితో బాధపడుతోంది. హెపటైటిస్‌ బి, సిలతో కాలేయ కేన్సర్‌కు గురయ్యే అవకాశాలు 100 రెట్లు ఎక్కువ. వైరస్‌ ఏళ్ల తరబడి తిష్ఠ వేసి, కాలేయాన్ని తీవ్రంగా దెబ్బతీసి, సిర్రోసిస్‌, కాలేయ కేన్సర్‌లకు దారితీయకుండా ఉండాలంటే ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా హెపటైటిస్‌ బి, సి పరీక్షలు చేయించుకోవాలి. ఈ వైరస్‌ను ప్రారంభంలోనే కనిపెట్టగలిగితే కాలేయాన్ని కాపాడుకోగలిగే అత్యద్భుత మందులతో ప్రాణహాని నుంచి తప్పించుకోవచ్చు.





డాక్టర్‌ నవీన్‌ పోలవరపు

FRCP (గ్లాస్గో,  యుకె), MRCP (యుకె), CCT (Gastro), 

లివర్‌ ట్రాన్స్‌ప్లాంట్‌ ఫెలో (బర్మింగ్‌హామ్‌, యుకె)

చీఫ్‌ లివర్‌ స్పెషలిస్ట్‌,

అపోలో హాస్పిటల్స్‌, హైదరాబాద్‌.

కన్సల్టేషన్‌ కోసం: 9008987245

Updated Date - 2021-04-20T05:30:00+05:30 IST