ప్రాణాలు ముఖ్యం!

ABN , First Publish Date - 2020-07-11T05:40:47+05:30 IST

పెనువిపత్తు నడుమ చిక్కుకుని ఉన్నామనే ఆందోళన నుంచి ప్రజల మనస్సులను తప్పించడానికి ప్రభుత్వాలు, పాలకులు ఏవేవో ఇతర అంశాలను చర్చల్లోకి తెస్తుంటారు.

ప్రాణాలు ముఖ్యం!

పెనువిపత్తు నడుమ చిక్కుకుని ఉన్నామనే ఆందోళన నుంచి ప్రజల మనస్సులను తప్పించడానికి ప్రభుత్వాలు, పాలకులు ఏవేవో ఇతర అంశాలను చర్చల్లోకి తెస్తుంటారు. వాటి వల్ల తాత్కాలికంగా దృష్టి మరలినా, తిరిగి తిరిగి కరోనా భయమే కళ్లెదుట ప్రత్యక్షమవుతుంది. ఎందుకంటే, తాత్కాలికంగా ముందుకు వచ్చిన విశేషాలు వెనుకపట్టు పట్టగానే మళ్ళీ వార్తల్లో కనిపిస్తున్నదీ, వినిపిస్తున్నదీ వైరస్‌ సృష్టిస్తున్న విషాదమే. ఈ ప్రమాదం కళ్లు మూసుకుంటే మాయమైపోదు, ఈ భయం ఆదమరిస్తే సమసిపోదు. ఇంతటి గుబులు, కలవరం కలగడానికి కారణం– కరోనా కారణంగా సంభవిస్తున్న మరణాలు, అవి జరుగుతున్న తీరు, అంతిమక్షణాలలో బాధితులు పడుతున్న యమయాతన. కరోనా వ్యాప్తిని ఎట్లాగూ నిరోధించలేనప్పుడు, ఎక్కువగా వ్యాపించడమొక్కటే దీర్ఘకాలికంగా కొంత నిరోధకతను తెస్తుందనుకున్నప్పుడు, మరణాలను తగ్గించే వైపు ప్రభుత్వాలు, వైద్య ఆరోగ్య యంత్రాంగం దృష్టి పెడితే ప్రజలలో విశ్వాసం ఏర్పడుతుంది, మితిమీరిన భయాలకు ఆస్కారం తగ్గుతుంది. 


పారదర్శకత లేకపోవడమే అవిశ్వాసానికి కారణం. సమాచారలోపం వదంతులకు దారి తీస్తుంది. అందరికీ కావలసిన నాయకుడు దీర్ఘకాలం కనపడనప్పుడు, కారణమేమిటో తెలియనప్పుడు, ప్రజలు సహజంగానే ఆందోళన చెందుతారు, పాపం ఏ అనారోగ్యం వచ్చిందో అని కలవరపడతారు. అట్లాగే, ప్రతి చోటా, రహస్యమో, నిశ్శబ్దమో ఉన్నప్పుడు, అవసరమైన సమాచారం ఇవ్వడానికి ఎవరూ పూనుకోనప్పుడు– అబద్ధాలకు, అర్థసత్యాలకు, అపోహలకు చెలామణి పెరుగుతుంది. కరోనా పరీక్షలు ఎందుకు పరిమితంగా చేస్తున్నారు? తమకు సోకిందేమో అని భయపడుతున్నవారు పరీక్ష చేయించుకోవడానికి అవరోధాలు ఎందుకు? ఇటువంటి సందేహాలు మొదటి దశలో ప్రజలను పీడించాయి. ఏ కారణం చేత అటువంటి పరీక్షా విధానం అనుసరిస్తున్నారో, ఎందువల్ల ప్రైవేటు ఆస్పత్రులను పరీక్షలలోకి, చికిత్సలలోకి అనుమతించడం లేదో– ప్రజలకు వివరంగా చెప్పి ఉండవలసింది. నిజానికి ఆ దశలో స్వచ్ఛందంగా పరీక్షలు కావాలని కోరుకున్న వారి సంఖ్య స్వల్పమే. వారందరికీ ప్రభుత్వం పరీక్షలు జరిపినా పెద్ద కష్టమేమీ అయ్యేది కాదు. తాను చేయకా, ప్రైవేటు వారిని అనుమతించని స్థితిలో ప్రజలనుంచి ఒత్తిడి వచ్చింది, ప్రైవేటు వారిని అంగీకరించవలసి వచ్చింది. ప్రైవేటు ఆస్పత్రులను, క్లినిక్‌లను అనుమతించే విషయంలో తెలంగాణ ఒకతీరుగా, ఆంధ్రప్రదేశ్‌ మరొక తీరుగా వ్యవహరించాయి.


పరీక్షలు తగినన్ని చేయడం విషయంలో కూడా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ పోలికకు నిలబడవలసి వచ్చింది. తెలంగాణ ప్రభుత్వం తీరును ప్రతిపక్షాలు మాత్రమే కాక, కేంద్రమంత్రులు, న్యాయస్థానాలు కూడా ప్రశ్నించాయి. అటు ఆంధ్రప్రదేశ్‌లో పరీక్షలు అధికంగా చేస్తున్నప్పటికీ, వాటి విశ్వసనీయత ప్రశ్నార్థకమైంది. అధికారపక్షం నేతలే భౌతికదూరాలను పాటించకుండా, గుమిగూడవద్దనే నిబంధనను లెక్కచేయకుండా వ్యవహరించారు. ఎవరెన్ని చెప్పినా, చాలా కాలం పెడచెవిన పెట్టిన తెలంగాణ ప్రభుత్వం చివరకు 50 వేల అదనపు పరీక్షలు చేయడానికి సంసిద్ధత చూపింది. ఆ పరీక్షలు మొదలుకాగానే, పాజిటివ్‌ల సంఖ్య విపరీతంగా పెరగడం గమనార్హం. పాత పద్ధతిలోనే పరీక్షలు జరిపి ఉంటే, ఈ వ్యాప్తి తీవ్రత తెలిసేది కాదు. ఈ లోగా, ప్రైవేటు వైద్యరంగం పూర్తిగా రంగంలోకి దిగింది. దురదృష్టవశాత్తూ, ప్రస్తుత మానవీయ విషాదస్థితిని డబ్బు చేసుకుందామనే ధోరణి పెరిగింది. ఇంతకాలం ప్రజారోగ్యరంగాన్ని అలక్ష్యం చేసినందుకు పర్యవసానమా అన్నట్టు, ప్రభుత్వ కోవిడ్‌ వైద్యశాలలను ప్రజలు పూర్తిగా విశ్వసించడం లేదు. నిజానికి, ఎంతో సాహసంతో, అంకితభావంతో కరోనా రోగులకు చికిత్స చేస్తున్న ప్రభుత్వ వైద్య, ఆరోగ్య సిబ్బందిని శంకించడం సబబు కాదు. ప్రభుత్వ ఆస్పత్రులలో సమస్యలేమైనా ఉంటే, అవి వసతులకు, సిబ్బంది సంఖ్యకు సంబంధించినవి, ప్రభుత్వ విధానానికి సంబంధించినవి. ఇప్పుడు ఉన్నట్టుండి, వైద్య ఆరోగ్య మౌలిక వసతులను పెంచలేరు, అట్లాగని, ప్రైవేటు వైద్య రంగాన్ని నియంత్రించలేరు. స్పెయిన్‌లో చేసినట్టు, అన్ని ప్రైవేటు ఆస్పత్రులను తాత్కాలికంగా జాతీయం చేసే ధైర్యం ఎట్లాగూ మన నేతలకు లేదు. కనీసం, వైద్యవ్యాపారుల ధనదాహాన్ని నియంత్రించవచ్చు, చికిత్స అందుబాటులో తారతమ్యాలు ఏర్పడకుండా చూడవచ్చు. ప్రభుత్వ ఆస్పత్రులలో పడకలు ఖాళీగా ఉండడమేమిటి, ప్రైవేటు ఆస్పత్రులలో పడకలు దొరకకపోవడమేమిటి, ఒక ప్రైవేటు ఆస్పత్రి నుంచి మరొకదానికి తిరుగుతూ, మార్గమధ్యంలోనే పేషెంట్లు మరణించడమేమిటి? ప్రభుత్వ ఆరోగ్యరంగాన్ని ఇంతగా దిగజార్చిన ప్రభుత్వాలు, రాజకీయ పార్టీలు, వారి నేతలు సిగ్గుపడాలి. 


ఇప్పుడిక లక్షలాది శీఘ్ర పరీక్షలు చేస్తామని ప్రభుత్వాలు ముందుకు వస్తున్నాయి. ఒకప్పుడు పరీక్షల ప్రాతిపదికను, అందుబాటును ప్రజలు ప్రశ్నించారు కానీ, ఇప్పుడు పరీక్షలను పెంచడం మాత్రమే సరిపోదు. పరీక్షంటే, చికిత్స కాదు. నిర్ధారణ జరిగిన రోగుల విషయంలో వైఖరి ఏమిటి? నమూనాలు ఇచ్చిన తరువాత, ఫలితం వచ్చే దాకా ఏ చికిత్సా అందని స్థితిని ఎట్లా సరిచేయాలి? హోంక్వారంటైన్‌లో ఉన్న రోగికి అకస్మాత్తుగా ప్రాణాంతక సమస్యలు వస్తే, వెంటనే రంగంలోకి దిగే అత్యవసర సేవ ఎటువంటిది కావాలి? వెంటిలేటర్లు, ఆక్సిజన్‌ సదుపాయం ఉన్న అంబులెన్స్‌లను సమకూర్చలేమా? దూరాభారం అయి, ఆపద సమయంలో ప్రైవేటు ఆస్పత్రికి వెళ్లవలసి వస్తే, ఏ రోగికీ అత్యవసర చికిత్స నిరాకరించకుండా శాసనం చేయలేమా? ఇళ్లలో కానీ, రోడ్డు మీద అంబులెన్స్‌లలో కానీ రోగులు మరణించకూడదు. రోగ నిర్ధారణకు, చికిత్స ప్రారంభానికి మధ్య వ్యవధి ఎక్కువగా ఉండకూడదు. ప్రాణం పోకుండా చూడడమే ముఖ్యం కావాలి. 


ప్రభుత్వం పరిస్థితిని ఉన్నదున్నట్టు చెప్పడం ఇకనైనా మొదలుపెట్టాలి. భయంతో గుండెలు ఆగిపోతున్నాయి. పాజిటివ్‌ వస్తుందేమోనని ఫలితం రాకుండానే ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ప్రచారంలోకి దిగండి. ధైర్యం చెప్పే ప్రచారం, ఆశ్వాసన ఇచ్చే ప్రచారం, అత్యవసరం వస్తే ఆదుర్దా, ఆందోళన చెందకుండా నిబ్బరాన్ని అందించే ప్రచారం కావాలి. ప్రజల ముందుకు వచ్చి మాట్లాడే నాయకులు కావాలి. సాధికారంగా, అనునయంగా చెప్పే వైద్య నిపుణులు కావాలి. ప్రభుత్వ ప్రచార యంత్రాంగం, సాంస్కృతిక ప్రచార దళాలు అన్నీ ఒకే పనిమీద ఉండాలి. ఏం చేస్తున్నారు, వాళ్లంతా?

Updated Date - 2020-07-11T05:40:47+05:30 IST