ఎల్‌జేపీ ఓట్లు చీల్చే పార్టీ : సుశీల్ మోదీ

ABN , First Publish Date - 2020-10-16T20:25:54+05:30 IST

బీహార్‌లో ఎన్డీయేతో పొత్తు తెగతెంపులు చేసుకున్న లోక్ జనశక్తి పార్టీ (ఎల్‌జేపీ)ని 'ఓట్లు చీల్చే పార్టీ'గా రాష్ట్ర ..

ఎల్‌జేపీ ఓట్లు చీల్చే పార్టీ : సుశీల్ మోదీ

పాట్నా: బీహార్‌లో ఎన్డీయేతో పొత్తు తెగతెంపులు చేసుకున్న లోక్ జనశక్తి పార్టీ (ఎల్‌జేపీ)ని 'ఓట్లు చీల్చే పార్టీ'గా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, బీజేపీ నేత సుశీల్ కుమార్ మోదీ అభివర్ణించారు. బీజేపీ ఇస్తానన్న సీట్ల కన్నా ఎల్‌జేపీ ఎక్కువ సీట్లు కోరుకుందని, ఆ తర్వాత ఎన్డీయే నుంచి వైదొలిగిందని చెప్పారు. ఎల్జేజేపీ ఓట్లు చీల్చే పార్టీ అని, బీహార్‌లో బీజేపీ ప్రభుత్వాన్ని ఎల్జేపీ కోరుకోవడం లేదని అన్నారు.


'మేము ఇస్తామన్న సీట్లు కంటే ఎల్జేపీ ఎక్కువ సీట్లు అడిగింది. దాంతో విషయం చెడిపోయింది. ఎన్డీయేను వీడకుండా తమ పార్టీని ప్రధాని, అమిత్‌షా ఎందుకు ఆపలేకపోయారంటూ కొంతమంది ఎల్జేపీ నేతలు వదంతులు సృష్టిస్తున్నారు' అని సుశీల్ మోదీ మీడియాతో మాట్లాడుతూ అన్నారు. అమిత్‌షాను, ప్రధాని మోదీని ప్రశ్నించడానికి వాళ్లెవరు? నితీష్ కుమార్‌ను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఎల్జేపీ వ్యతిరేకిస్తోందంటే వాళ్లు మోదీకి, షాకి కూడా వ్యతిరేకులని అన్నారు. ఓవైపు మోదీని ఎల్జేపీ ప్రశంసిస్తూనే మరోవైపు నితీష్ ‌కుమార్‌ను వ్యతిరేకించడం ఏమిటని అన్నారు.


ఎన్డీయే నుంచి బైటకు వచ్చిన ఎల్జేపీ ఈ ఎన్నికల్లో జేడీయూ పోటీ చేసే చోట్ల తమ అభ్యర్థులను నిలబెడుతోంది. మొదటి విడత ఎన్నికల్లో 27 మంది అభ్యర్థులను బరిలోకి  దింపింది. 243 సీట్ల బీహార్ అసెంబ్లీకి అక్టోబర్ 28, నవంబర్ 3, 7 తేదీల్లో పోలింగ్ జరుగనుంది. నవంబర్ 10న ఓట్లు లెక్కించి, ఫలితాలు ప్రకటిస్తారు.

Updated Date - 2020-10-16T20:25:54+05:30 IST