మళ్లీ మొదటికి!

ABN , First Publish Date - 2021-01-20T05:30:00+05:30 IST

మళ్లీ మొదటికి!

మళ్లీ మొదటికి!

దివ్యాంగులకు రాయితీ రుణాల్లో గందరగోళం
గతంలోనే వేలాదిమంది దరఖాస్తు
ఆన్‌లైన్‌లో మళ్లీ చేసుకోవాలని ఉత్తర్వులు
పాత దరఖాస్తుదారుల్లో ఆందోళన
ఉమ్మడి జిల్లాలో 17వేల మందికి పైగా అర్హులు


ప్రభుత్వ రాయితీ రుణాల కోసం దివ్యాంగులు రెండేళ్లుగా ఎదురుచూస్తున్నారు. స్వయం ఉపాధి కల్పనకు, చిన్న తరహా పరిశ్రమల స్థాపనకు రుణాల కోసం దరఖాస్తులు పెట్టుకొని ఏళ్లు గడుస్తున్నా ఇంతవరకు  మంజూరు కాలేదు. వీరికి రుణాలు అందించేందుకు దివ్యాంగుల కార్పొరేషన్‌ ఏటా జిల్లాల వారీగా ప్రతిపాదనలను తీసుకొన్నా అవి అమలుకు నోచుకోవడం లేదు. జిల్లా దివ్యాంగుల కార్పొరేషన్‌ అధికారులు పంపిన ప్రణాళికలు బుట్టదాఖలవుతున్నాయి.

ఆంధ్రజ్యోతి, హన్మకొండ
ఉమ్మడి వరంగల్‌ జిల్లా వ్యాప్తంగా రాయితీ రుణాల కోసం సుమారు 5వేల మంది అర్హులైన దివ్యాంగులు గతంలో దరఖాస్తులు పెట్టుకున్నారు. రుణ మంజూరు కోసం రెండేళ్లుగా ఎదురుచూస్తున్నారు. మంజూరు కాకపోవడంతో నిరాశకు లోనవుతున్నారు. ఇప్పుడు తాజాగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలన్న ఆదేశాలు జారీ కాగా, గతంలో దరఖాస్తులు చేసుకున్నవారు కూడా ఇప్పుడు మళ్లీ కొత్తగా ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకోవాలంటున్నారు. దీనివల్ల తమకు నష్టం జరుగుతుందని పాత దరఖాస్తుదారులు వాపోతున్నారు. రుణాల కోసం తాజాగా ఆన్‌లైన్‌లో దరఖాస్తులను ఆహ్వానించడం వల్ల కొత్తవారిని, పాతవారిని ఒకే గ్రూపు కింద కట్టేస్తే పాతవారికి అన్యాయం జరుగుతుందంటున్నారు. తమ సీనియారిటీ పోతుందని, పైగా బ్యాంకుల చుట్టూ తిరిగి అధికారుల కాళ్లావెళ్లా పడి రుణ మంజూరుకు వారిని ఒప్పించి కాన్సెంట్‌ తీసుకున్నామంటున్నారు. ఇప్పుడు తాజా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్నట్లయితే మళ్లీ బ్యాంకు అధికారుల నుంచి అంగీకారం పొందడం కష్టమవుతుందని, రుణాల కోసం ఇన్నాళ్లు ఎదురు చూసింది వృఽథా అవుతుందని వాపోతున్నారు.

పారదర్శకత కోసమే..
దివ్యాంగులకు సబ్సిడీ రుణాల పథకంలో పారదర్శకత కోసమే ప్రభుత్వం కొత్తగా ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. గతంలో దివ్యాంగులకు రుణాలు ఇచ్చేందుకు వికలాంగుల సంక్షేమ శాఖ నేరుగా దరఖాస్తులను తీసుకునేది. ఇతర శాఖల రుణాలు  పొందినవారు కూడా అర్జీలు పెట్టుకునేవారు. దీంతో ఒక్కరే రెండు శాఖల ద్వారా రుణాలు పొందుతుండడంతో ఇతరులకు అన్యాయం జరుగుతందని భావించి ప్రభుత్వం ఈ ఏడాది నుంచి ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తుల స్వీకరణకు శ్రీకారం చుట్టింది. ఈనెల 31వరకు దరఖాస్తుల దాఖలుకు అవకాశం ఉంది.

అర్హులు
ఐదేళ్లుగా ప్రభుత్వం నుంచి ఎలాంటి రుణం పొందనివా రు ఈ పథకానికి అర్హులు. దరఖాస్తుఫారంతో పాటు సద రం సర్టిఫికెట్‌, ఆధార్‌ కార్డు, కుల ధ్రువీకరణ, రేషన్‌కార్డు, ఆదాయం, విద్యార్హత సర్టిఫికెట్లను పొందుపరచాలి. దివ్యాంగులకు 40 శాతం కంటే ఎక్కువ వైకల్యం ఉండాలి. కుటుంబ వార్షిక ఆదాయం గ్రామీణప్రాంతాల్లో రూ.1.50లక్షలు, పట్టణ ప్రాంతాల్లో రూ.2లక్షలలోపు ఉండాలి. ఐదేళ్లలో ప్రభుత్వ సంస్థల నుంచి రాయితీని పొంది ఉండరాదు. 21 నుంచి 55 ఏళ్లలోపు వారు దరఖాస్తు చేసుకోవాలి.

17వేల మందికిపైగా..
ఉమ్మడి వరంగల్‌ జిల్లా వ్యాప్తంగా సదరం లెక్కల ప్రకారం సబ్సిడీ రుణాలకు అర్హులైన వారు 17,681మంది ఉన్నారు. ప్రభుత్వం వీరికి ఏటా స్వయం ఉపాధి కింద స్ర్తీ, శిశు, వయోవృద్ధులు, వికలాంగుల సంక్షేమ శాఖ ద్వారా సబ్సిడీ రుణాలు అందించాల్సి ఉంది. ఆర్థికంగా ప్రోత్సహించేందుకు ప్రత్యేక నిధులు కేటాయించి ఖర్చు చేయాల్సి ఉంది. స్వయం ఉపాధి చూపించడంతో పాటు అవసరమైన పనులు చక్కబెట్టుకునేలా శాఖ ద్వారా రుణాలను అందజేయాలి. బ్యాంకుల ద్వారా సబ్సిడీ రుణాలు మంజూరు చేసి వ్యాపారాలు చేసుకునేలా ప్రోత్సహించాలి. రుణం రూ.50వేల వరకు అయితే 100శాతం, రూ.లక్ష నుంచి రూ.2 లక్షల వరకు అయితే 80 శాతం, రూ.3 లక్షల నుంచి రూ.4లక్షల వరకు 70శాతం, రూ.10లక్షలు ఆపైన అయితే 60 శాతం సబ్సిడీతో రుణాలు ఇస్తారు. మిగతాది బ్యాంకు వాటా ఉంటుంది.

న్యాయం చేయాలి ...
- బిల్ల మహేందర్‌, దివ్యాంగుల సామాజిక వేదిక వ్యవస్థాపకుడు
రెండేళ్ల నుంచి ఉపాధి, పునరావాసానికి దివ్యాంగుల సంక్షేమ శాఖ రుణాలను మం జూరు చేయలేదు. ఈ ఆర్థిక సంవత్సరానికి కొత్తగా స్వయంఉపాధికి ఆన్‌లైన్‌ ద్వారా జనవరి 31లోపు దరఖాస్తు చేసుకోవాలని చెబుతూ గతంలో దరఖాస్తు చేసిన వారందరు మళ్లీ ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని చెప్ప డం విడ్డూరంగా ఉంది. దీనివల్ల గతంలో దరఖాస్తు చేసుకున్న దివ్వాంగులకు అన్యాయం జరుగుతుం ది. సీనియారిటీ పరంగా నష్టపోతారు. కనుక ముందుగా మాన్యువల్‌లో దరఖాస్తు చేసుకున్నవారికి ఆన్‌లైన్‌తో సంబంధం లేకుండా వారికి లబ్ధి చేకూర్చాలి. ఆ తర్వాత ఆన్‌లైన్‌ దరఖాస్తులు స్వీకరించాలి.

Updated Date - 2021-01-20T05:30:00+05:30 IST