బయోమెట్రిక్‌తో రుణం

ABN , First Publish Date - 2021-05-17T04:51:28+05:30 IST

మహిళా సంఘాల సభ్యులు ఆర్థికంగా ఎదగడానికి ప్రభుత్వం అందించే స్త్రీనిధి రుణాలు బయోమెట్రిక్‌ విధానంలో మంజూరు కానున్నాయి. గతంలో మహిళా సంఘాలకు మంజూరైన రుణాలు వారికి తెలియకుండా పక్కదారి (అక్రమాలు) పట్టేవి. దానిని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం నూతన విధానాన్ని తీసుకువచ్చింది.

బయోమెట్రిక్‌తో రుణం
మహిళా సంఘం సభ్యురాలి బయోమెట్రిక్‌ తీసుకుంటున్న గ్రామ వీవోఏ

పారదర్శకంగా స్త్రీనిధి లావాదేవీలు

ప్రత్యేకంగా రూపొందించిన యాప్‌

కొమరాడ, మే 16: మహిళా సంఘాల సభ్యులు ఆర్థికంగా ఎదగడానికి ప్రభుత్వం అందించే స్త్రీనిధి రుణాలు బయోమెట్రిక్‌ విధానంలో మంజూరు కానున్నాయి. గతంలో మహిళా సంఘాలకు మంజూరైన రుణాలు వారికి తెలియకుండా పక్కదారి (అక్రమాలు) పట్టేవి. దానిని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం నూతన విధానాన్ని తీసుకువచ్చింది. స్త్రీనిధి ద్వారా ఇప్పటివరకు వెబ్‌ అధారిత దరఖాస్తు ద్వారా రుణం ఇచ్చేవారు. సభ్యులు రుణం కోసం గ్రామ వీవోఏ సంబంధిత యాప్‌లో అభ్యర్థన పంపేవారు. సీసీ పరిశీలించి సంబంధిత డాక్యుమెంట్లను అప్‌లోడ్‌ చేసేవారు. వివిధ స్థాయిల్లో పరిశీలన అనంతరం సభ్యురాలి సంతకం ఆధారంగా గ్రూపు ఖాతాలో సొమ్ము జమ అయ్యేది. ఈ విధానంలో సభ్యురాలికి తెలియకుండా ఫోర్జరీ సంతకాలు, వేలి ముద్రలతో మంజూరైన రుణం పక్కదారి పట్టేది. తిరిగి చెల్లించే సమయంలో వెలుగు చూసినా సంబంధిత బాధ్యులపై తూతూ మంత్రంగా చర్యలు చేపట్టి విడిచిపెట్టిన సంఘటనలు లేకపోలేదు. కొంతమంది రుణాలు జమ చేయని సందర్భాలూ ఉన్నాయి. ఇలా జిల్లాలో లక్షలాది రూపాయలు దుర్వినియోగమయ్యాయి. ఈ పరిస్థితికి అడ్డుకట్ట వేసేందుకు బయోమెట్రిక్‌ విధానాన్ని ప్రభుత్వం తీసుకువచ్చింది. దీంతో ఇక ప్రతీ లావాదేవి సభ్యురాలి వేలిముద్ర(బయోమెట్రిక్‌) ఆధారంగా జరుగుతుంది.

ప్రత్యేక యాప్‌

బయోమెట్రిక్‌ విధానం అమలుకు ప్రత్యేకంగా మొబైల్‌ యాప్‌ను రూపొందించారు. ఇందులో సభ్యురాలి వేలిముద్ర ఆధారంగా రుణ అభ్యర్థన, అర్హత, లావాదేవీలు జరగనున్నాయి. బయోమెట్రిక్‌ పరికరాలకు అయ్యే ఖర్చు గ్రామ సంఘాలు, సమాఖ్యలకు వచ్చే వడ్డీ నిధుల నుంచి ఖర్చు చేయనున్నారు.

జగనన్న తోడు రుణాలు

మండలాల్లో ఇప్పటికే స్త్రీనిధి కింద జగనన్న తోడు లబ్ధిదారులకు కొత్త విధానం ద్వారానే రుణాలు మంజూరు చేస్తున్నారు. గ్రామాల్లో లబ్ధిదారుల నుంచి వేలిముద్రలు తీసుకుని లావాదేవీలు జరుపుతున్నారు. పూర్తిస్థాయిలో రుణాలకు సంబంధించిన లావాదేవీలు జూన్‌ ఒకటో తేదీ నుంచి జరుగుతాయని అధికారులు చెబుతున్నారు.

అక్రమాలకు చోటు ఉండదు

ఇకనుంచి స్త్రీనిధి రుణాలు మంజూరు బయోమెట్రిక్‌ విధానం ద్వారా జరగనున్నాయి. ఇందులో అక్రమాలకు చోటు ఉండదు. కొత్త విధానానికి సంబంధించిన పరికరాలు వీవోఏలకు అందిస్తున్నాం. కొత్త విధానంపై మండల అధికారులకు అవగాహన కల్పిస్తున్నాం. ఈ ఏడాది జిల్లా వ్యాప్తంగా రూ.167 కోట్ల స్త్రీనిధి రుణాలు మంజూరు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం.

- ఉమామహేశ్వరరావు, స్త్రీనిధి ఏజీఎం, విజయనగరం



Updated Date - 2021-05-17T04:51:28+05:30 IST