సైద్ధాంతిక పోరుగా స్థానిక ఎన్నికలు

ABN , First Publish Date - 2020-12-02T07:55:14+05:30 IST

కొన్ని చర్చలు క్రింది స్థాయి నుంచే ప్రారంభమవుతాయి. లోక్‌సభ ఎన్నికలను తలపించేలా జరిగిన గ్రేటర్ హైద రాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికలు...

సైద్ధాంతిక పోరుగా స్థానిక ఎన్నికలు

జీహెచ్ఎంసీ ఎన్నికల ఘట్టాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, ఆయన కుమారుడు కేటీఆర్ ఒక సైద్ధాంతిక పోరుగా మార్చేశారు. ప్రాంతీయ అస్తిత్వం, తెలంగాణ సంస్కృతి, అభివృద్ధి, మత రాజకీయాలు ఈ సిద్ధాంతంలో ప్రధానాంశాలు. ఈ ఎన్నికల ఫలితాలు భారతీయ జనతా పార్టీకి పాఠాలు నేర్పవచ్చు. అన్ని చోట్లా సర్జికల్ దాడులు, పాకిస్థాన్ బూచి, మతతత్వం వంటి రొడ్డకొట్టుడు సూత్రాలు పనికి వస్తాయా లేదా తేల్చుకునేందుకు బిజెపికి ఇది మంచి అవకాశం. కనీసం ఇప్పటికైనా నిజాయితీతో అభివృద్ధి గురించి మాట్లాడేందుకు ఈ ఎన్నికలు తోడ్పడితే అంతకంటే హర్షించదగింది ఏమీ లేదు.


కొన్ని చర్చలు క్రింది స్థాయి నుంచే ప్రారంభమవుతాయి. లోక్‌సభ ఎన్నికలను తలపించేలా జరిగిన గ్రేటర్ హైద రాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికలు జాతీయ స్థాయిలో చర్చని రేకెత్తించాయి. ఢిల్లీలో ఎక్కడకు వెళ్లినా హైదరాబాద్‌లో ఏమవుతున్నదని అడుగుతున్నారు. జాతీయ స్థాయి మీడియా ప్రతినిధులు మొత్తం ఢిల్లీ నుంచి హైదరాబాద్ గల్లీల్లో తిరగాల్సి వచ్చింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, పార్టీ జాతీయ అధ్యక్షుడు జగత్ ప్రకాశ్ నడ్డా, బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి భూపేందర్ యాదవ్, యుపి ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌తో పాటు పలువురు జాతీయ నేతలు ప్రచార రంగంలోకి దిగడం, నేరుగా ప్రచారానికి రాకపోయినప్పటికీ వాక్సిన్ పరిశోధనల ప్రగతిని సమీక్షించడం పేరుతో ప్రధానమంత్రి నరేంద్రమోదీ కూడా ఒక కన్ను వేసి పోవడంతో ఒక స్థానిక ఎన్నికలకు జాతీయ స్థాయి ప్రచారం లభించింది. ముఖ్యమంత్రి కేసీఆర్, ఆయన కుమారుడు కేటీఆర్ ఈ ఎన్నికల ఘట్టాన్ని సమర్థంగా ఒక సైద్ధాంతిక పోరుగా మార్చేశారు. ప్రాంతీయ అస్తిత్వం, తెలంగాణ సంస్కృతి, అభివృద్ధి, మత రాజకీయాలు ఈ సిద్ధాంతంలో ప్రధానాంశాలు. దీనితో ఈ ఎన్నికలు టీఆర్ఎస్ వర్సెస్ బిజెపి ఎన్నికలుగా మారాయి. బిహార్ అసెంబ్లీ, దేశ వ్యాప్తంగా ఉప ఎన్నికల్లో గెలిచిన ఉత్సాహంతో ఉన్న బిజెపి ఇక దేశంలో ఏ ఎన్నికనైనా అత్యంత సీరియస్‌గా తీసుకుని ఉధృతంగా రంగంలోకి దిగాలని నిర్ణయించినట్లు ఈ ఎన్నికల్లో వ్యవహరించిన తీరు స్పష్టం చేసింది. తన సహజ స్వభావంలో భాగంగా బిజెపి సర్జికల్ దాడులు, పాకిస్థాన్, నిజాం సంస్కృతి, మినీ భారత్, హైదరాబాద్ పేరు మార్పు వంటి అంశాలను ప్రస్తావించింది. హైదరాబాద్‌తో ఏ సంబంధం లేని బాబా రాందేవ్ కూడా హైదరాబాద్‌ను భాగ్యనగర్‌గా మార్చాలని హరిద్వార్ నుంచి డిమాండ్ చేశారు. దుబ్బాక ఉప ఎన్నికల్లో గెలిచిన బిజెపి ఆ గెలుపు మతపరమైన గెలుపుగా భ్రమించడం వల్ల హైదరాబాద్ ఎన్నికల ప్రచారాన్నికూడా మతపరంగా ప్రజలను విభజించేందుకు ఉపయోగించుకున్నది. ఈ రీత్యా బిజెపి జగన్నాథ రథయాత్ర కు తెలంగాణలో కేసీఆర్ అడ్డువేయగలిగితే దేశ వ్యాప్తంగా అనేక సంకేతాలు వెళతాయి. లేకపోతే బిజెపికి ఇక దేశంలో ఏ అడ్డూ ఉండదన్న అభిప్రాయానికి ఆస్కారం ఏర్పడుతుంది.


హైదరాబాద్ సంస్కృతి ప్రతి పది సంవత్సరాలకూ మారుతుంది. సరోజినీ నాయుడు, దేవరకొండ బాలగంగాధర్ తిలక్ నుంచి వందలాది కవులు హైదరాబాద్‌పై కవితా గానం చేశారు. ఒకప్పుడు చార్మినార్ నుంచి లాల్ దర్వాజకు వెళ్లే రిక్షాలు ఇప్పుడు కనపడవు. వెండి రేకులను సాగదీసే చప్పుడూ వినపడదు. ఇరానీ కేఫ్ లోంచి పొగలు క్రక్కే చాయ్ ఘుమఘుమలూ పెద్దగా తాకవు. ఆబిడ్స్ నుంచి కోఠీ వరకు ఫుట్‌పాత్‌లపై పాత పుస్తకాల రెపరెపలూ ఆకర్షించవు. సారస్వత పరిషత్ హాళ్లూ, శ్రీకృష్ణ దేవరాయాంధ్ర భాషా నిలయాలూ, భారత గుణవర్థక సంస్థలు వెలిసిపోయినట్లు, నిర్వికారంగా మారినట్లు తయారయ్యాయి. అన్నిటికన్నా మించి ప్రాణానికి ప్రాణం ఇచ్చే, కరచాలనాల ద్వారా రక్తాన్ని ప్రవహించే దోస్తానా కూడా మాయమవుతోంది. భారతీయ జనతా పార్టీ ప్రవేశిస్తే హైదరాబాద్ రూపురేఖలు ఇంకా మారతాయా? మనిషికీ మనిషికీ మధ్య ఇంకా అగాధం ఏర్పడుతుందా అన్న చర్చా సాగుతోంది. ఎవరు ఏమన్నా హైదరాబాద్‌లో ఎన్ని మార్పులు వచ్చినా ఒకప్పటి బాల్యం, లేతదనం ఇంకా తచ్చాడుతూనే ఉన్నది. అత్యంత అధునాతన సంస్కృతి ఒక వైపూ, గతాన్ని ప్రతిబింబించే చిహ్నాలు, భాషా సంస్కృతులూ, మనస్తత్వాలు మరో వైపు హైదరాబాద్ విశిష్టతకు అద్దం పట్టాయి. అందుకే ఈ ఎన్నికలు మరో పరిణామానికీ, మరో సంస్కృతికీ దారితీస్తాయా, ఈ బాల్యం మరింత చిదిమివేయబడుతుందా అన్న భయాందోళనలూ వ్యక్తమవుతున్నాయి .


విచిత్రమేమంటే కాంగ్రెస్ పార్టీ తనను తాను ఒక బలమైన ప్రతిపక్షంగా నిలదొక్కుకునేందుకు ప్రయత్నించకపోవడం వల్ల ఇవాళ తెలంగాణలో కేవలం టీఆర్ఎస్‌పై బిజెపిని ఎదుర్కొనే భారం పడింది. ఈ పరిస్థితి కేవలం తెలంగాణ రాష్ట్ర సమితికి సంబంధించిన సమస్య కాదు. దేశంలో అన్ని ప్రాంతాల్లో పరిస్థితి ఇదే విధంగా ఉన్నది. రైతు బిల్లులకు వ్యతిరేకంగా హర్యానా, పంజాబ్, ఉత్తర ప్రదేశ్ రాష్ట్రాలనుంచి రైతులు పెద్ద ఎత్తున తమంతట తాము వచ్చి దేశ రాజధానిని చుట్టుముడుతుంటే ప్రతిపక్ష పార్టీలు కూడా నిశ్చేష్టగా చూస్తున్నాయి. కేంద్రం, హర్యానాలోని బిజెపి ప్రభుత్వాలు కూడా దీనితో ఎలా వ్యవహరించాలో తేల్చులేకపోతున్నాయి. ఈ రైతుల్లో అత్యధికులు యువకులు. ఇది ఇలాగే సాగితే దేశ అంతర్గత భద్రతకే ముప్పు వస్తుందని, జాతీయ ప్రయోజనాల రీత్యా కేంద్రం దీన్ని సానుకూలంగా పరిష్కరించాలని కాంగ్రెస్ ఎంపి మనీష్ తివారీ అన్నారు. పంజాబ్‌లో ప్రజల ఆగ్రహ ఉధృతిని గమనించిన అకాలీదళ్ ఎప్పుడో బిజెపి కూటమి నుంచి తప్పుకుంది. అన్ని అంశాలనూ ప్రక్కన పెట్టి అన్నదాతల ఆందోళనను పట్టించుకోవాలని ప్రధానమంత్రికి అకాళీదళ్ విజ్ఞప్తి చేసింది.


కాంగ్రెస్ పార్టీ దేశ సమస్యలపై ప్రేక్షక పాత్ర వహించి, ప్రజాందోళనల్లో పాల్గొనే శక్తి కోల్పోయినందువల్ల ప్రాంతీయ పార్టీలు తమ అస్తిత్వాన్ని తామే తేల్చుకోవాల్సిన పరిస్థితిలో ఉన్నాయి. బిహార్‌లో కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకోవడం వల్ల రాష్ట్రీయ జనతాదళ్ అధికారంలోకి రాలేకపోయింది. మహారాష్ట్రలో శివసేన, ఎన్‌సిపి కూటమిని బలపరచాల్సిన తప్పని పరిస్థితిలో ఉన్నది. చాలా చోట్ల ప్రాంతీయ పార్టీలకు వారసులు నాయకత్వం వహిస్తున్నారు. పంజాబ్‌లో అకాళీదళ్‌కు ప్రకాశ్ సింగ్ బాదల్ కుమారుడు సుఖ్ బీర్ సింగ్ బాదల్, తమిళనాడులో డిఎంకెకు కరుణానిధి కుమారుడు స్టాలిన్, జార్ఖండ్‌లో శిబూ సోరేన్ కుమారుడు హేమంత్ సోరెన్, ఉత్తర ప్రదేశ్‌లో సమాజ్ వాది పార్టీకి ములాయం సింగ్ యాదవ్ కుమారుడు అఖిలేశ్ యాదవ్, బిహార్‌లో రాష్ట్రీయ జనతాదళ్‌కు లాలూ ప్రసాద్ యాదవ్ కుమారుడు తేజస్వి యాదవ్, మహారాష్ట్రలో శివసేనకు బాల్ థాకరే కుమారుడు ఉద్దవ్ థాకరే, కశ్మర్‌లో నేషనల్ కాన్ఫరెన్స్‌కు ఫరూక్ అబ్దుల్లా కుమారుడు ఒమర్ అబ్దుల్లా, పీడీపీకి ముఫ్తీ మహమ్మద్ కుమార్తె మహబూబా ముఫ్తీ దేశంలో బిజెపిని అడ్డుకునేందుకు సమాయత్తమవుతున్నారు. వీరి దారిలో తండ్రి కేసీఆర్‌కు తోడుగా కేటీఆర్ బిజెపికి వ్యతిరేకంగా సైద్ధాంతిక పోరులో దిగారు. ఈ రీత్యా కూడా జీహెచ్ఎంసి ఎన్నికల్లో బిజెపిని టీఆర్‌ఎస్ అడ్డుకోగలిగితే మిగతా ప్రాంతీయ పార్టీల నేతలకు ఒక నైతిక స్థైర్యం, స్పష్టమైన సంకేతాన్ని పంపినట్లవుతుంది. రైతు బిల్లులు, విద్యుత్ బిల్లులతో పాటు కేంద్రం రుద్దుతున్న అనేక అంశాలపై ఐక్యకార్యాచరణకు వీలవుతుంది. బిజెపి వందిమాగధ దళంలో కొనసాగాలా లేక తన వ్యూహం తాము రచించుకోవాలా అన్న విషయం కొందరు స్థానిక నేతలు తేల్చుకునేందుకు కూడా అవకాశం ఏర్పడుతుంది. వీటన్నిటిలో కదలిక కాంగ్రెస్‌లో కూడా చలనం తెచ్చి కనీసం తాను ప్రాబల్యంలో ఉన్న రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక తదితర రాష్ట్రాల్లోనైనా ఎముకలు కుళ్లిన, వయస్సు మళ్లిన నేతలను వదుల్చుకుని కొత్త రక్తానికి, వర్గాలకు అవకాశం ఇస్తే ప్రాంతీయ పార్టీలకు అండగా ఉండగలిగిన శక్తి ఏర్పడుతుంది. దేశంలో పూర్తిగా అస్తిత్వ పరీక్షలో ఉన్న వామపక్షాలకూ ఇదే వర్తిస్తుందని వేరే చెప్పనక్కర్లేదు. దేశ రాజధానిని చుట్టుముట్టిన రైతులు అనేకమంది ఎర్రజెండాలను ధరించడం, గత ఏడాది ముంబైలో జరిగిన రైతాంగ లాంగ్ మార్చ్‌ను కూడా వామపక్షాలు నిర్వహించడం విస్మరించదగిన విషయం కాదు. ఇటీవల బిహార్‌లో సిపిఐ (ఎంఎల్) 19 సీట్లకు పోటీ చేసి 12 సీట్లు గెలుచుకోవడం పట్ల సర్వత్రా చర్చనీయాంశమవుతోంది. చారు మజుందార్, కానూసన్యాల్ వంటి నక్సలైట్ నేతలు స్థాపించిన ఈ పార్టీ అజ్ఞాత పోరాటాల ద్వారా ఏమీ సాధించలేమని గ్రహించి, తమ కేడర్‌ను ప్రధాన స్రవంతి రాజకీయాల్లోకి మలిచింది. ‘మాకు 19 సీట్ల బదులు 50 సీట్లు ఇచ్చి ఉంటే బిహార్‌లో మహాఘట్ బంధన్ అధికారంలోకి రాగలిగేది..’ అని ఆ పార్టీ నేత దీపాంకర్ భట్టాచార్య అన్నారు. బిహార్ ఎన్నికల ఫలితాల వల్ల లభించిన అనుభవాలు, కాంగ్రెస్, ప్రాంతీయ పార్టీలు, వామపక్షాలకు భవిష్యత్‌లో ఏ రకంగా వ్యవహరించాలో గుణపాఠాలు నేర్పితే జాతీయ స్థాయిలో కూడా మంచి ఫలితాలకు ఆస్కారం ఉన్నది. తెలంగాణ అనుభవాలు కూడా మరిన్ని పాఠాలు నేర్పవచ్చు. అనుభవాలు, పాఠాల ద్వారా ప్రత్యామ్నాయాలు ఏర్పడడం దేశంలో కొత్త కాదు. ఒకప్పుడు భారతీయ జనతా పార్టీ కూడా ఇలాగే సంఘర్షించి ప్రత్యామ్నాయాలను ఏర్పర్చుకున్నది. ఎటొచ్చీ అది ఏరు దాటినాక తెప్పతగలేసినట్లు స్వంతబలం పుంజుకోగానే తన విజయానికి కారణమైన ప్రాంతీయ పార్టీల పట్ల తూష్ణీభావాన్ని ప్రదర్శించింది. మహారాష్ట్రలో 1991లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలనుంచీ బిజెపి కంటే మెజారిటీ సీట్లు సాధిస్తూ వచ్చిన శివసేన 2009 నుంచీ బిజెపితో పోలిస్తే వెనుకబడిపోయి చివరకు బిజెపి తనను నియంత్రించే పరిస్థితికి చేరుకుంది. ఇవాళ శివసేన బిజెపి ఆధిక్యతను, తన అస్తిత్వాన్ని కాపాడుకునేందుకు ఒకప్పుడు తన శత్రువులైన ఎన్‌సిపి, కాంగ్రెస్‌తో చేతులు కలిపింది. ‘రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండర’ని సీనియర్ జర్నలిస్టు పొత్తూరి వేంకటేశ్వరరావు బంధువు, కాంగ్రెస్ నేత విబిరాజు ఆరు దశాబ్దాల క్రితమే చెప్పిన విషయం అనేక సార్లు రుజువైంది.


జీహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాలు దేశంలో విస్తరించడానికి దూకుడుగా ప్రయత్నిస్తున్న భారతీయ జనతా పార్టీకి కూడా పాఠాలు నేర్పవచ్చు. అన్ని చోట్లా సర్జికల్ దాడులు, పాకిస్థాన్ బూచి, మతతత్వం వంటి రొడ్డకొట్టుడు సూత్రాలు పనికి వస్తాయా లేదా తేల్చుకునేందుకు బిజెపికి ఇది మంచి అవకాశం. కనీసం ఇప్పటికైనా నిజాయితీతో అభివృద్ధి గురించి మాట్లాడేందుకు ఈ ఎన్నికలు తోడ్పడితే అంతకంటే హర్షించదగింది ఏమీ లేదు.


ఎ. కృష్ణారావు

(ఆంధ్రజ్యోతి ఢిల్లీ ప్రతినిధి)

Updated Date - 2020-12-02T07:55:14+05:30 IST