సంగ్రామం బ్యాలెట్‌తోనే!

ABN , First Publish Date - 2021-01-27T06:45:54+05:30 IST

(రాజమహేంద్రవరం-ఆంధ్రజ్యోతి) పంచాయతీ ఎన్నికలు బ్యాలెట్‌ పద్ధతిలోనే జరగనున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికలను ఈ విధానంలో నిర్వహించడం ఇదే తొలిసారి. దీనిద్వారా పోలింగ్‌ తొంద

సంగ్రామం బ్యాలెట్‌తోనే!

ఏకగ్రీవ యత్నాలు ఫలించేనా 

స్టేజ్‌-1, 2 అధికారుల నియామకం

(రాజమహేంద్రవరం-ఆంధ్రజ్యోతి)

పంచాయతీ ఎన్నికలు బ్యాలెట్‌ పద్ధతిలోనే జరగనున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికలను ఈ విధానంలో నిర్వహించడం ఇదే తొలిసారి. దీనిద్వారా పోలింగ్‌ తొందరగా జరిగినా కౌంటింగ్‌ మాత్రం ఆలస్యం అవుతుంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ విభజన తర్వాత ఏపీలో జరుగుతున్న తొలి పంచాయతీ ఎన్నికలు ఇవి. అంతేగాక ఎన్నికల కమిషన్‌, రాష్ట్ర ప్రభుత్వం మధ్య ప్రచ్ఛన యద్ధం జరిగి చివరికి సుప్రీం కోర్టు వరకు వెళ్లింది. దీంతో బాగా ప్రాధాన్యత సంతరించు కున్నాయి. ఇక ఎన్నికల్లో తీవ్ర పోటీ ఉండబోతోంది. ఒక్కో పార్టీ నుంచి ముగ్గురు నలుగురు కూడా పోటీకి సిద్ధమ వుతున్నారు. పంచాయతీ అంటే అవగాహన లేని కొత్తవాళ్లు కూడా పోటీకి ఉవ్విళ్లూరుతున్నారు. పంచాయతీ ఎన్నికల్లో పార్టీ గుర్తులు ఉండకపోయినా పార్టీల ప్రభావం ఉంటుంది. స్థానిక సమీకరణాలు, అంశాలు, సమస్యలు కూడా ప్రభావం చూపుతాయి. ఈసారి త్రిముఖ పోటీకి ఎక్కువ అవ కాశం ఉంది.

వైసీపీ ఒంటరిగానే పోటీ చేయవచ్చు. టీడీపీతో కొన్నిచోట్ల ఇతర ప్రతిపక్షాలు కలిసే అవకాశం ఉంది. జనసేన-బిజేపీ కలిసి పోటీ చేస్తాయని ఆయా  పార్టీల నేతలు చెప్తున్నారు. కాంగ్రెస్‌, వామపక్షాలు, బీఎస్పీ, స్వతంత్రులు కూడా పోటీ చేస్తారు. ఏ పార్టీ అభిమానులు, ఏ పార్టీ అభ్యర్థితో కలిసినా కలవవచ్చు. ఇప్పటికే కొన్నిచోట్ల ఏకగ్రీవ ప్రయత్నాలు మొదలయ్యాయి. కోనసీమలో కొందరు పెద్దలు ఈ ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. కానీ గ్రామాల్లో పోటీచేసే అభ్యర్థులు ఎక్కువ ఉండడం, వివిధ పార్టీల నుంచి కూడా పోటీకి పలువురు సిద్ధం అవుతుండడంతో ఇవి ఫలిస్తాయా లేదా అనేది  అనుమానంగా ఉంది. గ్రామాల అభివృద్ధిని కాంక్షించే కొందరు పెద్దలు మాత్రం ఎన్నికల పేరట అనవసర ఖర్చు పెట్టడం కంటే అందరూ కలిసి మంచి వ్యక్తిని  ఎన్నుకుంటే  మంచిదనే  ప్రయత్నాలు చేస్తుండడం గమనార్హం.

ఎన్నికల నిర్వహణ అధికారులను రెండు రకాలుగా విభజిస్తారు. నామినేషన్ల ప్రక్రియ మొదటి నుంచి అభ్యర్ధుల తుది జాబితా ప్రకటించే వరకు బాధ్యతలు నిర్వర్తించే వారిని స్టేజ్‌-1 అధికారులు అంటారు. తర్వాత పోలింగ్‌, కౌంటింగ్‌, ఫలితాలు ప్రకటించే వరకు పనిచేసే వారిని స్టేజ్‌-2 అధికారులు అంటారు. జిల్లాలో  మొదటి దశకు 531, రెండో దశకు 378, మూడో దశకు 312, నాలుగో దశకు 416 మందిని స్టేజ్‌-1, స్టేజ్‌-2 అధికారులుగా నియమించారు. మొత్తం నాలుగు దశలకు కలిపి 161 మందిని రిజర్వులో ఉంచారు. 


Updated Date - 2021-01-27T06:45:54+05:30 IST