జంతు సంరక్షకురాలిపై స్థానికుల దాడి.. తీవ్రగాయాలతో పోలీస్టేషన్‌‌కు వెళితే..

ABN , First Publish Date - 2020-07-05T22:28:46+05:30 IST

వీధికుక్కలను కాపాడబోతే తమను స్థానికులు తీవ్రంగా కొట్టారంటూ జంతు సంరక్షకురాలు అయేషా క్రిస్టీనా వాపోయారు.

జంతు సంరక్షకురాలిపై స్థానికుల దాడి.. తీవ్రగాయాలతో పోలీస్టేషన్‌‌కు వెళితే..

న్యూఢిల్లీ: వీధికుక్కలను కాపాడబోతే తమను స్థానికులు తీవ్రంగా కొట్టారంటూ జంతు సంరక్షకురాలు అయేషా క్రిస్టీనా వాపోయారు. ఢిల్లీలోని రాణీబాగ్‌లో ఈ సంఘటన జరిగినట్లు ఆమె తెలిపారు. దీనికి సంబంధించిన వీడియోను ఆమె తన సోషల్ మీడియాలో పోస్టు చేశారు. రాణిబాగ్‌లో వీధి కుక్కలకు ఆహారం పెట్టడానికి వెళ్లామని, ఇంతలో ఓ వ్యక్తి వచ్చి తమతో దుర్భాషలాడాడని, అక్కడి నుంచి వెళ్లిపోవాలని హెచ్చరించాడని అయేషా చెప్పారు. ‘‘అయితే మేము వెళ్లేది లేదని చెప్పడంతో అతడితో పాటు మరికొందరు మాపై దాడి చేశారు. తీవ్రంగా గాయపరిచారు. దీంతో అక్కడి నుంచి కారులో పారిపోయి, పోలీస్‌ స్టేషన్‌కు వస్తే ఇక్కడ మమ్మల్ని ఎవరూ పట్టించుకోవడం లేదు’ అంటూ క్రిస్టీనా అన్నారు. అయితే పోలీసులు మాత్రం కేసు నమోదు చేశామని, విచారణ చేస్తామని చెబుతున్నారు. క్రిస్టీనా బృందం కారులో వచ్చేస్తున్న సమయంలో అడ్డుగా వచ్చిన కొందరికి స్వల్ప గాయాలయ్యాయని, దానికి సంబంధించి కూడా విచారణ జరుపుతామని తెలిపారు.



Updated Date - 2020-07-05T22:28:46+05:30 IST