విరామ సమయం.. విరగబడిన జనం..

ABN , First Publish Date - 2021-05-17T05:25:56+05:30 IST

విరామ సమయం.. విరగబడిన జనం..

విరామ సమయం.. విరగబడిన జనం..
హన్మకొండలో జనంతో కిక్కిరిసిన కుమార్‌పల్లి మార్కెట్‌ భౌతికదూరం పాటించకుండా, కొందరు మాస్కులు సరిగా ధరించకుండా ఉన్న దృశ్యం

 లాక్‌డౌన్‌ మినహాయింపు సమయంలో రద్దీ

 ఆదివారం మార్కెట్లలో పోటెత్తిన జనం

 మాస్కులు, భౌతికదూరం గాలికొదిలేసిన వైనం

 కరోనా నిబంధనలు పట్టించుకోని వ్యాపారులు

 కట్టడిపై దృష్టి సారించని పోలీసులు

హన్మకొండ టౌన్‌, మే 16 : లాక్‌డౌన్‌ మి నహాయింపు సమయమైన ఉదయం 6గం టల నుంచి 10 గంటల వరకు వరంగల్‌ నగరం జన సందోహంగా మారింది. ఎక్కడా కూడా కరోనా నిబంధనలు కానరాలేదు. పైగా ఆదివారం కావడంతో జనాలతో నగరంలోని రోడ్లు, మార్కెట్లు, కిరాణాషాపులు, వైన్‌షాపులు కిక్కిరిసిపోయాయి. ప్రధానంగా కుమార్‌పల్లి మార్కెట్‌, రాంనగర్‌, ఫాతిమానగర్‌, అమృత సెంటర్‌, కాజీపేట జంక్షన్‌, కాజీపేట జూబ్లీమార్కెట్‌, భీమారం జంక్షన్‌, గోపాల్‌పూర్‌ జంక్షన్‌, హన్మకొండలోని టైలర్‌ స్ట్రీట్‌, వరంగల్‌లోని పలు ప్రాంతాల్లో చికెట్‌ సెంటర్లు, మంటన్‌ షాపులు, చేపల మార్కెట్ల వద్ద రద్దీ కొన సాగింది. అలాగే పలు వైన్స్‌ షాపుల వద్ద జనాల సందడి కనిపించింది. 

ఆ నాలుగు గంటలు..

కరోనా కట్టడికి ప్రభుత్వం లాక్‌డౌన్‌ విధించగా.. నిత్యావసరాల కోసం ఉదయం నాలుగు గంటలు కొంత సమయం వెసులుబాటు ఇచ్చింది. అయితే ఈ సమయంలో నగర వాసుల్లో నిర్లక్ష్యం కట్టలుతెంచుకుంది. పైగా రోడ్లపైకి వచ్చే వారు కొంతమంది మాస్క్‌లు లేకుండా రావడంతో పాటు భౌతిక దూరం పాటించిన దాఖలాలు కనిపించడం లేదు. షాపుల యజమానులు సైతం కనీస నిబంధనలు పాటించడం లేదు. షాపుల ఎదుట గుంపులుగా జనాలున్నప్పటికీ వ్యాపారస్తులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో ప్రమాదకరంగా మారుతోంది. స్థానిక పోలీసులు సైతం చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. షాపుల యజమానులు, స్థానిక పోలీసులు ఇప్పటికైనా స్పందించి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. లేకుంటే కరోనా వైరస్‌ వ్యాప్తి రెట్టింపు అయ్యే ప్రమాదం ఉంది.

Updated Date - 2021-05-17T05:25:56+05:30 IST