ఖాకీలు కనిపించకున్నా కెమెరాలు పట్టేస్తాయ్‌.. బయటికొస్తే వాహనాలు సీజ్‌

ABN , First Publish Date - 2020-03-27T12:42:09+05:30 IST

లాక్‌డౌన్‌ ఆంక్షలను ఉల్లంఘించి రోడ్డుపైకి వస్తున్న వాహనాలపై ట్రాఫిక్‌ పోలీసులు ప్రత్యేక నిఘా పెట్టారు.

ఖాకీలు కనిపించకున్నా కెమెరాలు పట్టేస్తాయ్‌.. బయటికొస్తే వాహనాలు సీజ్‌

  • ఉల్లంఘనులపై ఏఐ కన్ను.. 3 కి.మీ. దాటితే ఫైన్‌
  • చౌరాస్తాల్లో కెమెరాలు.. ఒక్క రోజే వెయ్యి కేసులు
  • మూడు రోజుల్లో 26,801 వాహనాలపై చర్యలు

హైదరాబాద్‌ : లాక్‌డౌన్‌ ఆంక్షలను ఉల్లంఘించి రోడ్డుపైకి వస్తున్న వాహనాలపై ట్రాఫిక్‌ పోలీసులు ప్రత్యేక నిఘా పెట్టారు. వాహనాలను ఆపి, ఎక్కడికక్కడ సీజ్‌ చేస్తున్నారు. పోలీసులు నేరుగా పట్టుకోలేని వాహనాలను నిఘా కెమెరాల ద్వారా గుర్తించి చలానాలు పంపిస్తున్నారు. ఒకరి కంటే ఎక్కువ మంది కూర్చొని, 3 కిలోమీటర్ల పరిధి దాటి తిరుగుతున్న, పదే పదే బయటికి వస్తున్న వాహనాలను ప్రత్యేక కెమెరాల ద్వారా గుర్తించి వాహనదారులపై కేసులు నమోదు చేస్తున్నారు. మూడు రోజుల్లో 2 వేల వాహనాలపై కేసులు నమోదు చేయగా.. 26,801 వాహనాలపై పలు చర్యలు తీసుకున్నారు. 


నిత్యావసర సరుకులు 3 కిలోమీటర్ల పరిధిలో లభించకపోవడంతో దూరంలోని షాపులకు వెళ్లిన పలువురు ఇలా జరిమానా బారిన పడుతున్నారు. హైదరాబాద్‌లోని 250 చౌరస్తాల్లో ట్రాఫిక్‌ లైట్లకు హెచ్‌డీ కెమెరాలను అమర్చి, ఆటోమెటిక్‌ నంబరు ప్లేట్‌ రీడింగ్‌ సాఫ్ట్‌వేర్‌ను లోడ్‌ చేశారు. బుధవారం ఒక్కరోజే వెయ్యి మందిని గుర్తించామని, వారి ఇళ్లకు నోటీసులు పంపిస్తామని ఓ సీనియర్‌ పోలీసు అధికారి తెలిపారు.

Updated Date - 2020-03-27T12:42:09+05:30 IST