Abn logo
Jun 10 2021 @ 11:33AM

లేజీ గాయ్స్‌.. లాక్‌డౌన్‌తో పెరుగుతున్న సోమరితనం!

  • అర్ధరాత్రి వరకు గల్లీల్లో బాతాఖానీ
  • మధ్యాహ్నం ఎప్పుడో నిద్రలేవడం
  • ఆన్‌లైన్‌ ఆటల్లో మునిగి తేలుతున్న విద్యార్థులు

హైదరాబాద్ సిటీ/ఖైరతాబాద్‌ : నగరంలో లేజీగాయ్స్‌ పెరుగుతున్నారు. అర్ధరాత్రి వరకు రోడ్లపై సరదాలు, పొదెక్కే వరకు నిద్రపోవడం వారి సంఖ్య అధికమవుతోంది. ఆయా ప్రాంతాల్లో ఇప్పటికీ కొందరు యువకులు గ్యాంగులుగా ఏర్పడి రోడ్లు, వీధుల్లో అలజడి సృష్టిస్తున్నారు. విద్యాసంస్థలు మూత పడి ఉండటంతో కొందరు విద్యార్థులు సైతం వీరిని అనుసరిస్తుండటం ఆందోళన కలిగిస్తోంది.  


రాత్రంతా సెల్‌ఫోన్‌ గేమ్స్‌..

పాఠశాలలు, కళాశాలలు లేకపోవడతో 24 గంటల పాటు యువత ఇళ్లకే పరిమితం అవుతున్నారు. అర్ధరాత్రి వరకు, కొందరైతే తెల్లవారుజాము వరకు మొబైల్‌ ఫోన్లలో వివిధ సామూహిక గేమ్‌లు ఆడుతున్నారు. రాత్రి ఆలస్యంగా పడుకోవడం, మరుసటి రోజు మధ్యాహ్నం వరకు లేవకపోవడం అలవాటు చేసుకుంటుండటంతో తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. అర్ధరాత్రి వరకు మిత్రులతో మొబైల్‌ ఫోన్లలో ఆడుతూ ‘వాడొస్తున్నాడు.. వీడిని చంపేయ్‌’ అంటూ అరుస్తుండటంతో కుటుంబ సభ్యులు నిద్రలేని రాత్రుళ్లు గడపాల్సి వస్తోంది. కళాశాలల్లో ఆన్‌లైన్‌ తరగతులు జరుగుతున్నా.. చాలా మంది హాజరు కోసం లాగిన్‌ అయి నిద్ర పోవడం, ఇతర పనులు చేసుకోవడం చేస్తున్నారు. మరికొంత మంది వీధుల్లో అర్ధరాత్రి వరకు పిచ్చాపాటి కబుర్లు చెప్పుకుంటూ సమయాన్ని వృథా చేస్తున్నారు. చాలా మంది దిన చర్య మధ్యాహ్నానికి గాని ప్రారంభం కాకపోతుండడంతో వారిని అదుపు చేయలేక, ఇతరులకు చెప్పుకోలేక తల్లిదండ్రులు సతమతమవుతున్నారు. 


సమయానికి తినరు.. 

లాక్‌డౌన్‌తో చాలా మంది సమయపాలన పూర్తిగా మరచిపోయారు. యువతే కాకుండా పెద్దలు సైతం ఏ వేళకు చేసే పనులు ఆ వేళకు చేయడం లేదు. యువత ఉదయాన్నే నిద్రలేవడం పూర్తిగా మరచిపోయారు. మధ్యా హ్నం లేచి పనులు చేస్తున్నారు. చాలా మంది యువతతోపాటు పెద్దలు సైతం ఉదయం పూట అల్పాహారం తినడం మానేశారు. ఇది ఎంత మాత్రం మంచిదికాదని వైద్యులు హెచ్చరిస్తున్నారు. కొందరు యువత బయటి తినుబండారాలకు అలవాటు పడి ఇళ్లలో సరిగ్గా తినడంలేదు. కొందరైతే ఒక్కపూటే భోజనం చేస్తూ అనారోగ్యాన్ని కొనితెచ్చుకుంటున్నారు. ఇక ఇక్కడి యువత శారీరక శ్రమ లేకుండా గడుపుతున్నారు. ఉదయం లేవలేక పోవడంతో వాకింగ్‌, జాగింగ్‌ లాంటి వాటిని మర్చిపోయారు చాలా మంది. వేసవి శిక్షణా శిబిరాలు లేకపోవడంతో పిల్లల్లో శారీరక శ్రమ లేకుండాపోయింది. మరికొంత మంది యువకులు వ్యసనాలకు బానిసలుగా మారుతున్నారనే ఆందోళన తల్లిదండ్రుల్లో వ్యక్తమవుతోంది.

గమనిస్తుండాలి.. 

లాక్‌డౌన్‌ కారణంగా అందరి జీవన విధానాల్లో మార్పులొచ్చాయి. అందుబాటులో ఉన్న వనరులను వినియోగిస్తూ ముందుకు సాగాలి. ముఖ్యంగా యువత, పిల్లలకు రాత్రి సమయాల్లో ఫోన్‌లు అందుబాటులో లేకుండా చేయడం మంచిది. ఆన్‌లైన్‌ తరగతులకు 100లో 10 శాతం మంది మాత్రమే శ్రద్ధగా వింటున్నారనడంలో సందేహం లేదు. ప్రతిరోజూ అల్పాహారంతో పాటు భోజనాన్ని కుటుంబ సభ్యులంతా కలసి తినడం మంచిది. సెల్‌ఫోన్లలో పిల్లలు, యువత ఏం చేస్తున్నారో గమనిస్తూ ఉండాలి. రాత్రి సమయంలో వైఫై బంద్‌ చేయడం, ఫోన్లు వారికి అందుబాటులో ఉంచకుండా, త్వరగా పడుకునేలా చేయడం మంచిది. - డాక్టర్‌ అఫ్తాబ్‌ అలీ ఖాన్‌, సైక్రియాట్రిస్టు, గ్లెనిగల్‌ గ్లోబల్‌ ఆస్పత్రి.

Advertisement