‘లాక్‌డౌన్‌’ వంటలివి!

ABN , First Publish Date - 2020-04-04T06:13:01+05:30 IST

రుచికరంగా ఉంటూనే ఆరోగ్యకరమైన వంటలు కొన్ని ఉన్నాయి. ఈ ‘లాక్‌డౌన్‌’ కాలంలో ఖర్చు తక్కువ, అదే సమయంలో పెద్దగా సమయం పట్టని వంటలు ఇవి.

‘లాక్‌డౌన్‌’ వంటలివి!

రుచికరంగా ఉంటూనే ఆరోగ్యకరమైన వంటలు కొన్ని ఉన్నాయి. ఈ ‘లాక్‌డౌన్‌’ కాలంలో ఖర్చు తక్కువ, అదే సమయంలో పెద్దగా సమయం పట్టని వంటలు ఇవి.


పచ్చి మిరపకాయ పచ్చడి: ఇది రోగనిరోధక శక్తిని పెంచుతుంది. మెటబాలిక్‌ యాక్టివిటీని కూడా ఎక్కువ పరిమాణంలో ఉంచుతుంది. ఒక్క స్పూన్‌ పచ్చి మిరపకాయ పచ్చడి కలుపుకొని తింటే చాలు... ఎలాంటి ఆహారమైనా రుచిగా మారుతుంది.

కావాల్సినవి: వేయించిన పచ్చిమిర్చి అరకప్పు, వేయించిన చింతపండు చిన్న నిమ్మకాయంత, వేయించిన జీలకర్ర అర స్పూను, వెల్లుల్లి 5 రెబ్బలు, కరివేపాకు రెబ్బలు వేయించినవి 6, తగినంత ఉప్పు

తయారీ: అన్నీ కలిపి గ్రైండ్‌ చేసుకుంటే రుచికరమైన పచ్చడి రెడీ.


మామిడికాయ పచ్చడి: మామిడికాయ ముక్కలు కొద్దిగా నూనెలో వేగించాలి (ఆప్షనల్‌), కొబ్బరి పచ్చడి (కొబ్బరి తురిమి మిగిలిన పదార్థాలు కలపాలి), వంకాయ పచ్చడి (వంకాయను మంటపై కాల్చి, తొక్క తీసి గుజ్జును మిగిలిన పదార్థాలతో కలపాలి), దొండకాయ పచ్చడి, క్యాబేజీ పచ్చడి, దోసకాయ పచ్చడి, టొమాటో పచ్చడి)... వీటన్నింటిని పచ్చిమిర్చి పచ్చడిలాగే చేసుకోవాలి.

పప్పు దినుసుల పొడులు: కంది పొడి, పుట్నాల పొడి, పెసర పొడి, సెనగ పొడి. వీటిలో ఒక కప్పు పొడికి ఆరు పచ్చి మిర్చి, అర నిమ్మకాయంత చింతపండు వేగించి, గ్రైండ్‌ చేసి కలుపుకోవాలి. 6 పచ్చి వెల్లుల్లి రెబ్బలను దంచి, తగినంత ఉప్పుకలిపి మిక్స్‌ చేయాలి.

ఇంట్లోనే ఎక్కువగా కాలక్షేపం చేయాల్సిన ఈ కాలంలో రసం, లేదంటే చారు తరచుగా చేసుకోండి. రసం హైడ్రేషన్‌కి ఉపయోగపడుతుంది. మిరియాలు, కరివేపాకు, జీలకర్రలతో రసం చేసుకొంటే రుచితో పాటు ఆరోగ్యం కూడా. ప్రతి నాలుగు గంటలకు ఒకసారి రసం కప్పులో పోసుకుని తాగొచ్చు. టొమాటో రసం, చింతపండు రసం, శొంఠి రసం, ములక్కాడల రసం, ముల్లంగి రసం, పచ్చి పులుసు, వగైరా కూడా చేసుకోవచ్చు.


టొమాటో రసం: రెండు టొమాటోలు, కొద్దిగా చింతపండు, 4 పచ్చిమిర్చి, కొద్దిగా పసుపు, కారం, ఉప్పు, 4 దంచిన వెల్లుల్లి... వీటన్నింటి కలిపి బాగా మరగనివ్వాలి. తర్వాత తాలింపు వేసుకోవాలి. ఇలాగే చింతపండు రసం, శొంటి రసం, ముల్లంగి రసం వేసుకోవాలి.


బియ్యపు లడ్డు: ఒక కప్పు బియ్యం వేగించి పిండి పట్టాలి. ఒక స్పూను శొంఠి, ఒక కప్పు తురిమిన బెల్లం, అరకప్పు నెయ్యి, తగినంత పాలు కలిపి లడ్డూ చేసుకోవాలి.

పెసర స్వీట్‌: ఒక కప్పు పెసర పప్పు, అర కప్పు బెల్లం, తగినంత నీరు, అరకప్పు నెయ్యి, అర స్పూను శొంఠి, అర స్పూను మిరియాల పొడిని కలిపి మెత్తగా అయ్యేదాకా కుక్‌ చేస్తే రుచికరమైన స్వీట్‌ రెడీ.


పెసర లడ్డు: ఒక కప్పు పెసరపప్పు పిండి (పెసరపప్పు కమ్మటి వాసన వచ్చేదాకా వేగించి పిండి పట్టాలి), అర కప్పు మరిగిన వేడి నెయ్యి, అర కప్పు తురిమిన బెల్లం, అర టీ స్పూను శొంటి కలిపి లడ్డూ చేసుకోవాలి.


డాక్టర్‌ బి.జానకి, న్యూట్రిషనిస్ట్‌

drjanakibadugu@gmail.com

Updated Date - 2020-04-04T06:13:01+05:30 IST