ఇంటి స్థలాల మీద పడండి!

ABN , First Publish Date - 2020-04-07T10:01:30+05:30 IST

కరోనా కలకలం రేపుతున్నా, లాక్‌డౌన్‌తో సర్వం స్తంభించినా.... ఇంటి స్థలాల సంగతి మాత్రం వదలొద్దని రాష్ట్ర సర్కారు నిర్ణయించుకుంది.

ఇంటి స్థలాల మీద పడండి!

పెండింగ్‌లో ఉన్న పనులు చేయండి

కరోనాలేని చోట్ల రోడ్లెక్కాల్సిందే

‘ప్రత్యేక అధికారి’ ఆదేశం

తహసీల్దార్లకు సమాచారం

కరోనా వేళ వింత ఆదేశాలు

సహాయ చర్యల్లో రెవెన్యూ బిజీ

ఇప్పుడు ఈ గోలేమిటని విస్మయం

అమరావతి, ఏప్రిల్‌ 6 (ఆంధ్రజ్యోతి): కరోనా కలకలం రేపుతున్నా, లాక్‌డౌన్‌తో సర్వం స్తంభించినా.... ఇంటి స్థలాల సంగతి మాత్రం వదలొద్దని రాష్ట్ర సర్కారు నిర్ణయించుకుంది. ‘‘కరోనా తీవ్రత లేని ప్రాంతాల్లో  రెవెన్యూ ఉద్యోగులు రోడ్డెక్కి ఇళ్ల స్థలాల పనులు చేపట్టాలి. లే అవుట్‌లను అభివృద్ధి  చేయాలి’’ అని ఆదేశాలు జారీ చేసింది. ఈ దిశగా వెంటనే చర్యలు తీసుకోవాలంటూ కలెక్టర్లు, జాయింట్‌ కలెక్టర్లకు సమాచారం ఇచ్చింది. పేరుకే అది సమాచారం. ఆచరణలో అదే సర్కారు ఆదేశంలా ఉంది.  కరోనాను జీవ విపత్తుగా ప్రకటించిన తర్వాత దాదాపు రెవెన్యూ యంత్రాంగమంతా సహాయక చర్యల్లో పాల్గొంటోంది. అధికారులు, సిబ్బంది క్షణం తీరిక  లేకుండా కరోనా కట్టడి పనుల్లో నిమగ్నమై ఉన్నారు.


ఇలాంటి సమయంలో... ఇంటి స్థలాలకోసం రోడ్డెక్కండి అంటూ ఓ ప్రత్యేక అధికారి  నుంచి సమాచారంతో కూడిన ఆదేశాలు రావడంతో అధికారులు బెంబేలెత్తిపోతున్నారు. పేదలకు ఇంటి స్థలాల పంపిణీని ఉగాది నుంచి ఏప్రిల్‌ 14కు వాయిదా వేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం అమలులో ఉన్న లాక్‌డౌన్‌ ఈనెల 14 వరకు కొనసాగుతుంది. ఆ తర్వాత కూడా కొనసాగించే అవకాశాలున్నాయని వార్తలు వస్తున్నాయి. మండల స్థాయి సిబ్బంది కరోనా సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు. లాక్‌డౌన్‌ ప్రభావం తీవ్రరూపం దాల్చడంతో రెవెన్యూకు  గుండెకాయలాంటి సీసీఎల్‌ఏ కార్యాలయం కూడా పనిచేయడంలేదు. జిల్లాల్లోనూ ఇదే పరిస్థితి. కలెక్టరేట్‌తోపాటు ఆర్‌డీవో కార్యాలయాలు లాక్‌డౌన్‌ వల్ల వెలవెలబోతున్నాయి.


సందర్శకులను కూడా రానివ్వడం లేదు. ఆన్‌లైన్‌లో ఈ-మెయిల్‌ ద్వారానే పిటిషన్లు తీసుకుంటున్నారు. ఇంతటి విపత్కర పరిస్థితుల్లో  ఇంటి స్థలాలపై దృష్టిపెట్టాలని ఆదేశించడం గమనార్హం. కరోనా ప్రభావం లేని గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ఇంటి స్థలాల కార్యక్రమాన్ని చేపట్టాలని ఓ ప్రత్యేక అధికారి జిల్లా జాయింట్‌ కలెక్టర్లను ఆదేశించారు. ‘‘కోవిడ్‌-19 ప్రభావం లేని మండలాల్లో తహసీల్దార్లు ఇంటి స్థలాలకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న వర్క్‌ను పూర్తిచేయాలి. పెండింగ్‌లో ఉన్న భూ సేకరణ బిల్లులను సిద్ధం చేయాలి. కరోనా ప్రభావం లేని మండలాల్లో లే అవుట్‌ డెవల్‌పమెంట్‌ వర్క్‌లను పూర్తిచేయాలి. సామాజిక దూరాన్ని పాటిస్తూనే ఈ పనులను పూర్తిచేయడానికి ప్రయత్నించాలి. ఇక పట్టణ ప్రాంతాల్లో, కరోనా ప్రభావం లేని ప్రాంతాల్లో ఆయా కమిషనర్లు టిడ్కో లబ్ధిదారుల ఎంపిక జాబితాను పూర్తి చేయడంతోపాటు  డిజిటల్‌ సంతకాలు చేయాలి’’ అని ఆదేశాలు వెళ్లాయి. ‘‘లాక్‌డౌన్‌ ఈనెల 14వరకు అమలులో ఉంటుంది. రెవెన్యూ అధికారులు, సిబ్బంది సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు.


ఈ సమయంలో వారిని ఇంటి స్థలాల పనికి ఎలా డైవర్ట్‌ చేయగలం? లాక్‌డౌన్‌ కఠినంగా అమలు చేస్తున్న వేళ కరోనా లేని ప్రాంతాల్లో లే అవుట్‌ల అభివృద్ధి చేపట్టడం సాధ్యమేనా? ఈనెల 14నే ఇంటిస్ధలాల పంపిణీకి సర్కారు గడువుగా నిర్ణయించింది. అప్పటి వరకు లాక్‌డౌన్‌ కొనసాగుతుంది కాబట్టి ఇంటి స్థలాలపై సీఎం  స్థాయిలో నిర్ణయం తీసుకోవాలి. సీనియర్‌ అధికారులు, జిల్లా కలెక్టర్లు  జేసీలతో చర్చించి ఓ నిర్ణయం తీసుకోవాల్సిన అంశంపై ప్రత్యేక అధికారి నేరుగా ఆదేశాలు ఇవ్వడం విడ్డూరంగా ఉంది. కరోనా సమస్య తీవ్రతను గుర్తించకుండా, అధికార యంత్రాంగం క్షేత్రస్థాయిలో ఏం చేస్తుందో తెలుసుకోకుండా ఇచ్చినట్లుగానే కనిపిస్తోంది’’ అని సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి ఒకరు అభిప్రాయపడ్డారు.

Updated Date - 2020-04-07T10:01:30+05:30 IST