ఓ వైపు కొవిడ్‌ భయం.. మరోపక్క లాక్‌డౌన్‌.. బస్తీవాసులు గాఢనిద్రలో ఉండగా..

ABN , First Publish Date - 2021-05-17T14:32:38+05:30 IST

ఓ వైపు కొవిడ్‌ మహమ్మారి భయం... మరోపక్క లాక్‌డౌన్‌ మధ్య...

ఓ వైపు కొవిడ్‌ భయం.. మరోపక్క లాక్‌డౌన్‌.. బస్తీవాసులు గాఢనిద్రలో ఉండగా..

  • కాంప్లెక్స్‌లోని ఐదిళ్లలో చోరీలు
  • రూ.21లక్షలు, 2కిలోల వెండి, 35 తులాల బంగారు ఆభరణాల చోరీ
  • రంగంలోకి దిగిన మూడు పోలీసు బృందాలు

హైదరాబాద్/అఫ్జల్‌గంజ్‌ : ఓ వైపు కొవిడ్‌ మహమ్మారి భయం... మరోపక్క లాక్‌డౌన్‌ మధ్య బస్తీవాసులు గాఢనిద్రలో ఉన్నారు. ఇదే అదునుగా భావించిన దొంగలు తమ ప్రతాపాన్ని చూపారు. ఇలా వరసగా ఐదుఇళ్లను లక్ష్యంగా చేసుకుని... భారీ చోరీలకు తెగబడటం స్థానికంగా కలకలం సృష్టించింది. దొంగలు ముందస్తు పక్క ప్రణాళికతో రెక్కీ నిర్వహించి చోరీలకు పాల్పడ్డారు.  ఈ వరుస ఇళ్ల చోరీలు ఆదివారం తెల్లవారుజామున జియాగూడలోని వేంకటేశ్వర్‌నగర్‌కాలనీలో జరిగాయి. స్థానికులు, కుల్సుంపుర ఇన్‌స్పెక్టర్‌ శంకర్‌ కథనం ప్రకారం వేంకటేశ్వర్‌నగర్‌కాలనీ నివాసి ఎం. శ్రీనివాస్‌ (55) ప్రింటింగ్‌ ప్రెస్‌ నిర్వహిస్తుంటాడు. అతను తన గ్రౌండ్‌ ఫ్లోర్‌లో ఉంటూ మిగతా మూడు ఫ్లోర్లలో నలుగురు వ్యక్తులకు అద్దెకిచ్చాడు. పక్కనే అతను తన తల్లి ఇంట్లో నిద్రపోయాడు.


కిరాయిదారులు కరోనా వేళ తమ సొంత ఊళ్లకు వెళ్లారు. దీన్ని అవకాశంగా తీసుకున్న దొంగలు తొలుత గ్రౌండ్‌ ఫ్లోర్‌లో శ్రీనివాస్‌ తలుపు తాళాన్ని బద్దలు కొట్టి లోపలికి చొరబడ్డారు. బీరువా తాళాన్నికూడా ఇనుపరాడ్లతో విరగొట్టారు. మిగిలిన మూడుఫ్లోర్‌లలో నలుగురి ఇళ్ల తాళాలు ధ్వంసం చేశారు.   ఆయా ఇళ్లలోని బీరువాలను విరగొట్టి 35 తులాల బంగారు ఆభరణాలు, రెండు కేజీల వెండి, .21 లక్షల నగదును దొంగిలించారు. ఉదయం ఇంటి యాజమాని శ్రీనివాస్‌ వచ్చి చూడగా బయటి తలుపు తాళం విరగొట్టి, వస్తువులు చిందరవందరగా పడి ఉన్నాయి. లోపల బీరువా ధ్వంసం చేసి ఉంది. మిగతా నలుగురి ఇళ్లలోనూ ఇదే పరిస్థితి ఉండడం చూసి పోలీసులను ఆశ్రయించారు.


కుల్సుంపుర పోలీస్‌ ఇన్‌స్పెక్టర్‌ శంకర్‌ తన బలగాలతో ఘటనా స్థలికి చేరుకుని చోరీ జరిగిన తీరును గమనించారు. తాళాలు బద్దలు కొట్టిన విధానం, గదుల్లో వస్తువులు చెల్లాచెదురుగా పడవేసి ఉండటాన్ని గమనించిన ఇన్‌స్పెక్టర్‌ అన్నీ తెలిసిన దుండగులే ఈ చోరీలకు పాల్పడ్డారని నిర్ధారించారు. దొంగలు ముందుగానే రెక్కీ నిర్వహించి చోరీలు చేసిఉండొచ్చని భావిస్తున్నారు. సంఘటనా స్థలంలో క్లూస్‌ టీం, డాగ్‌ స్వ్కాడ్‌ బృందం వచ్చి పరిశీలించింది. కొవిడ్‌ వేళ చోరీలు జరగడాన్ని పోలీసులు తీవ్రంగా పరిగణిస్తున్నారు. దొంగలను పట్టుకునేందుకు ప్రత్యేకంగా మూడు బృందాలు ఏర్పాటుచేసి రంగంలోకి దింపారు.

Updated Date - 2021-05-17T14:32:38+05:30 IST