గోదాముకు తాళం వేసి రైతుల ఆందోళన

ABN , First Publish Date - 2021-11-26T09:29:29+05:30 IST

ధాన్యం కొనుగోళ్లలో జాప్యంపై రైతులు కన్నెర్ర చేశారు. వివిధ రూపాల్లో గురువారం తమ నిరసన తెలిపారు.

గోదాముకు తాళం వేసి రైతుల ఆందోళన

  • మద్దతు ధర కోసం ధాన్యానికి నిప్పు
  • పురుగుల మందుతో ట్యాంక్‌ ఎక్కి నిరసన 
  • రాష్ట్రవ్యాప్తంగా అన్నదాతల ఆగ్రహం
  • ఆగిన మరో రైతన్న గుండె! 
  • కొనుగోలు కేంద్రం వద్దే గుండెపోటు 
  • ఆస్పత్రికి తరలిస్తుండగా మృత్యువాత 
  • కామారెడ్డి జిల్లాలో విషాదం  


(ఆంధ్రజ్యోతి న్యూస్‌నెట్‌వర్క్‌): ధాన్యం కొనుగోళ్లలో జాప్యంపై రైతులు కన్నెర్ర చేశారు. వివిధ రూపాల్లో గురువారం తమ నిరసన తెలిపారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్‌ మండలం ఆవునూర్‌లో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రం గోదాముకు తాళం వేశారు. ఆపై ఆందోళనకు దిగారు. కొనుగోళ్లు వేగంగా జరగడం లేదని మండిపడ్డారు. సేకరించిన ధాన్యాన్ని వెంటవెంటనే సరఫరా చేయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. వనపర్తి జిల్లా పెద్దమందడిలో రైతులు ధాన్యాన్ని రోడ్డుపై పోసి నిప్పుపెట్టారు. వరికి గిట్టుబాటు ధర కల్పించాలని, కొనుగోలులో క్వింటాల్‌ ధాన్యానికి 10 కి లోల తరుగు తీయడాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేశారు. రైస్‌ మిల్లర్లకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అకాల వర్షాలతో చేతికొచ్చిన పంట నేలమట్టమైందని, వరి కల్లంలో తడిసిన వడ్లు మొలకెత్తాయని, తాము అన్ని విధాలుగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కరీంనగర్‌ జిల్లా చిగురుమామిడి మండలం ఇందుర్తిలో ధాన్యం కొనుగోళ్లలో మిల్లర్ల వైఖరికి నిరసనగా రైతులు పురుగుమందు డబ్బాలతో వాటర్‌ట్యాంక్‌ ఎక్కి నిరసన తెలిపారు.


ఆగిన మరో రైతన్న గుండె! 

సదాశివనగర్‌: కామారెడ్డి జిల్లాలో కొనుగోలు కేంద్రం వద్ద గుండెపోటుతో ఓ రైతు ఇటీవల మృతి చెందిన ఘటన మరవక ముందే.. గురువారం అదే తరహా విషాదం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. సదాశివనగర్‌ మండలం అడ్లూర్‌ ఎల్లారెడ్డి గ్రామానికి చెందిన రైతు కుమ్మరి రాజయ్య(50) తనకున్న ఎకరమున్నర పొలంలో వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. పండించిన ధాన్యాన్ని విక్రయించేందుకు రెండు రోజుల క్రితమే అడ్లూర్‌ ఎల్లారెడ్డి గ్రామంలోని కొనుగోలు కేంద్రం వద్దకు తీసుకొచ్చాడు. నిర్వాహకులు ధాన్యాన్ని కొనకపోవడంతో.. ఆరబోసిన వడ్ల కుప్పను రాత్రి 7గంటల సమయంలో ఒక వద్దకు చేర్చసాగాడు. అంతలో ఒక్కసారిగా గుండెపోటు వచ్చి, అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. తోటి రైతులు అతడిని కామారెడ్డి ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందాడు.

Updated Date - 2021-11-26T09:29:29+05:30 IST