చెక్కపల్లి పంచాయతీ కార్యాలయానికి తాళం

ABN , First Publish Date - 2021-04-17T06:01:33+05:30 IST

చెక్కపల్లి పంచాయతీ కార్యాలయానికి తాళం

చెక్కపల్లి పంచాయతీ కార్యాలయానికి తాళం

అభివృద్ధి పనుల బిల్లులు రాలేదని.. అప్పుల బాధ తాళలేకపోతున్నానని మాజీ ఉప సర్పంచ్‌ ఆవేదన

ముసునూరు, ఏప్రిల్‌ 16: మండల పరిధిలోని చెక్కపల్లి పంచాయతీలో అభివృద్ధి పనుల బిల్లులను కార్యదర్శి చెల్లించడం లేదంటూ శుక్రవారం మాజీ ఉప సర్పంచ్‌, టీడీపీ నాయకుడు కాటేపల్లి సత్యనారాయణ పంచాయతీ కార్యాలయానికి తాళం వేశారు. 2017-2018 వరకు మంచినీటి పైప్‌లైన్‌, బోర్లు, పంచాయతీ భవనం నిమిత్తం రూ.16,75,000, సీసీ రోడ్ల నిర్మాణంలో పంచాయతీ నుంచి ఇవ్వాల్సిన 30 శాతం నిధులు రూ.13 లక్షల బిల్లులు, ఇప్పటి వరకు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని సత్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. రెండేళ్ల నుంచి బిల్లుల కోసం తిరుగుతున్నప్పటికీ ఎమ్మెల్యే పాత బిల్లులు ఇవ్వద్దంటున్నారని కార్యదర్శి ఆరేపల్లి వెంకటేశ్వరావు చెబుతూ కాలం వెళ్లదీస్తున్నాడని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామ అభివృద్ధి కోసం లక్షలాది రూపాయాలు అప్పు చేసి పనులు చేశానని, అప్పు ఇచ్చిన వాళ్లు తీవ్రంగా ఒత్తిడి చేస్తున్నారని, ఏమి చేయాలో తెలియని పరిస్థితిలో పంచాయతీ కార్యాలయానికి తాళం వేశానన్నారు. తన బిల్లులు చెల్లిస్తారన్న ఆశతోనే ఈ పని చేశానని సత్యనారాయణ చెప్పారు. అయితే కార్యదర్శి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఎస్సై రాజారెడ్డి కార్యాలయానికి వేసిన తాళాన్ని సత్యనారాయణతోనే తీయించారు. ప్రభుత్వ కార్యాలయ సిబ్బందిని లోపల ఉంచి తాళాలు వేస్తావా అంటూ సత్యనారాయణ చొక్కా కాలర్‌ను పట్టుకుని పోలీస్‌ వాహనం ఎక్కించారు. దీనిపై స్థానిక సర్పంచ్‌, టీడీపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎస్సై ప్రవర్తించిన తీరు సరికాదన్నారు. అప్పుల బాధ తట్టుకోలేక పోతున్నాని, తన మనోవేదనను ఉన్నతాధికారులైనా అర్థం చేసుకుని బిల్లులు చెల్లించాలని సత్యనారాయణ విజ్ఞప్తి చేస్తున్నారు.   

  కార్యదర్శి ఫిర్యాదు..ముగ్గురిపై కేసు 

చెక్కపల్లి పంచాయతీ కార్యాలయానికి తాళం వేసి, కార్యదర్శిని భయభ్రాంతులకు గురిచేసిన ఘటనలో ముగ్గురిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై రాజారెడ్డి తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. శుక్రవారం మధ్యాహ్నం 12 గంటలకు సచివాలయ సిబ్బంది, ఉప సర్పంచ్‌ భర్త, కార్యదర్శులు లోపల ఉండగా కాటేపల్లి సత్యనారాయణ కార్యాలయానికి తాళం వేసి నిర్బంధించినట్లు కార్యదర్శి ఆరేపల్లి వెంకటేశ్వరావు ఫిర్యాదులో పేర్కొనట్లు ఎస్సై తెలిపారు.  బిల్లులపై ఉన్నతాధికారులతో మాట్లాడి చెబుతానని చెప్పినప్పటికీ, వినకుండా కాటేపల్లి శ్రీనివాసరావు, కంచర్ల రాజారావుతో కలిసి సత్యనారాయణ తనను భయభ్రాంతులకు గురిచేశాడని కార్యదర్శి ఆరేపల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. 

Updated Date - 2021-04-17T06:01:33+05:30 IST