రేపటి నుంచి పాక్షిక లాక్‌డౌన్

ABN , First Publish Date - 2021-04-09T16:35:11+05:30 IST

ముంచుకొస్తున్న మహమ్మారి ముప్పును నియంత్రించేందుకు అధికార యంత్రాంగం చర్యలకు దిగింది. పార్టీల ప్రచారాలు, ఎన్నికల సందర్భంగా నిబం

రేపటి నుంచి పాక్షిక లాక్‌డౌన్

- వివాహాది శుభకార్యాల్లో వందమందికి మాత్రమే అనుమతి

- థియేటర్లలో 50 శాతమే  ప్రేక్షకులు

- మళ్లీ ఈ-పాస్‌ తప్పనిసరి

- ప్రభుత్వ చర్యలకు సహకరించండి

- గవర్నర్‌ భన్వరీలాల్‌ పురోహిత్‌ విజ్ఞప్తి


చెన్నై: ముంచుకొస్తున్న మహమ్మారి ముప్పును నియంత్రించేందుకు అధికార యంత్రాంగం చర్యలకు దిగింది. పార్టీల ప్రచారాలు, ఎన్నికల సందర్భంగా నిబంధనలకు నీళ్లొదిలి, నిర్లక్ష్యంగా వ్యవహరించిన ప్రభుత్వం.. ఎట్టకేలకు ఇప్పుడు ఆంక్షల్ని కాస్త కఠినతరం చేసింది. ఇచ్చిన కాస్త వెసులుబాటుకే స్వేచ్ఛా విహంగాల్లా తిరుగాడుతున్న జనానికి ముకుతాడు వేసేందుకు రంగం సిద్ధమైంది. ఇప్పటికీ జనం మాట వినకపోతే గతంలోలా పూర్తిస్థాయి లాక్‌డౌన్‌ విధించేందుకు ప్రభుత్వం ‘తాళం’ చేతబట్టింది. నిర్ణయం ప్రజల వ్యవహారశైలిని బట్టే వుంటుందని పరోక్షంగా హెచ్చరికలు జారీ చేసింది. 

రాష్ట్రంలో కరోనా వైరస్‌ వ్యాప్తి అధికమవుతుండటంతో ఈనెల 10 నుంచి కొన్ని కఠిన నిబంధనలతో పాక్షిక లాక్‌డౌన్‌ అమలు చేస్తూ ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. గత మార్చి నెల ప్రారంభంలో రాష్ట్రంలో కరోనా పాజిటివ్‌ కేసులు తగ్గుముఖం పట్టాయి. రోజుకు 450 చొప్పున నమోదయ్యాయి. అయితే శాసనసభ ఎన్నికల ప్రచారం, పోలింగ్‌కు అధిక సంఖ్యలో జనాలు గుమికూడటం, కరోనా నిరోధక నిబంధనలు పాటించకపోవడం వంటి కారణాలతో వైరస్‌ వ్యాప్తి అధికమైంది. ప్రస్తుతం రోజూ సుమారు 4 వేల పాజిటివ్‌ కేసులు నమోదవుతున్నాయి. రాజధాని నగరం చెన్నైలో రోజుకు 1500 చొప్పున పాజిటివ్‌ కేసులు బయటపడుతున్నాయి. ఈ నేపథ్యంలో వైరస్‌వ్యాప్తిని నిరోధించేందుకు చేపట్టాల్సిన చర్యలపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌రంజన్‌ బుధవారం సచివాలయంలో ఆరోగ్యశాఖ ముఖ్య కార్యాదర్శి జె.రాధాకృష్ణన్‌, డీజీపీ ఎల్‌కే త్రిపాఠీ ఇతర ప్రభుత్వ శాఖ అధికారులతో సమావేశమై చర్చలు జరిపారు. గురువారం ప్రధాని మోదీ వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా కరోనా వైరస్‌ వ్యాప్తి నిరోధానికి చేపట్టాల్సిన చర్యలపై రాష్ట్ర ముఖ్యమంత్రులతో సమీక్ష జరిపారు. ఈ సమీక్షా సమావేశంలో రాజీవ్‌రంజన్‌ తదితర అధికారులు సచివాలయం నుంచి పాల్గొన్నారు. అనంతరం కొన్ని కఠిన నిబంధనలతో ఈనెల 10 నుంచి 30వ తేదీ వరకూ పాక్షిక లాక్‌డౌన్‌ అమలు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ముఖ్యంగా విదేశాల నుంచి, పొరుగు రాష్ట్రాల నుంచి వచ్చేవారికి ఈ-పాస్‌ పద్ధతిని అమలు చేయనున్నట్టు ప్రకటించారు. అదే విధంగా ప్రజలు అధిక సంఖ్యలో గుమిగూడటాన్ని నిరోధించే దిశగా పలు నిబంధనలు విధించారు. థియేటర్లలో 50 శాతం ప్రేక్షకులను మాత్రమే అనుమతిస్తున్నట్లు ప్రకటించారు. వివాహాది శుభకార్యాలలో వందమంది మాత్రమే పాల్గొనాలని, అశుభ కార్యాలకు 50 మంది మాత్రమే హాజరుకావాలని స్పష్టం చేశారు. ప్రభుత్వ రవాణా సంస్థ బస్సులు, ప్రైవేటు సంస్థ బస్సులు, సిటీ బస్సులు, టవున్‌ బస్సులలో నిలబడి ప్రయాణించడాన్ని నిషేధిస్తూ నిబంధనలు విధించారు. 


లాక్‌డౌన్‌ నిబంధనలివే...

- థియేటర్లలో 50 శాతం ప్రేక్షకులకు అనుమతి

- షాపింగ్‌మాల్స్‌, వాణిజ్య సంస్థలలో 50 శాతం కస్టమర్లకు అనుమతి

- దుకాణాలు,షాపింగ్‌మాల్స్‌కు వచ్చే కస్టమర్లు మాస్కు ధరిస్తేనే అనుమతి

- హోటళ్లు, రెస్టారెంట్లు, టీషాపులకు వెళ్లేవారు మాస్కులు ధరించాలి

- ఆలయాల్లో వార్షిక ఉత్సవాలన్నీ రద్దు

- వివాహాది శుభకార్యాలలో 100 మందికి అనుమతి

- అశుభ కార్యాలలో 50 మందికి అనుమతి

- ప్రభుత్వ రవాణా సంస్థ, ప్రైవేటు సంస్థల బస్సులలో ‘నో స్టాండింగ్‌’

- కోయంబేడు, రాష్ట్రంలోని టోకు మార్కెట్లలో చిల్లర వ్యాపారాల రద్దు

- జిల్లా సంతలలో చిల్లర అమ్మకాలపై నిషేధం

- హోటళ్లలో, టీ షాపులలో 50 శాతం కస్టమర్లకు అనుమతి

- షాపులు, పండ్ల దుకాణాలు రాత్రి 11 గంటలకు. మూత

- ఆడిటోరియంలలో, ఫంక్షన్‌హాల్స్‌లో జరిగే సామాజిక, రాజకీయ, విద్యా, వినోదపరమైన వేడుకలు, సభలలో 200 మందికి అనుమతి

- క్రీడామైదానాల్లో పోటీలు తిలకించేందుకు ప్రేక్షకులకుఅనుమతి లేదు.

- సినిమా, టీవీ షూటింగ్‌లలో పాల్గొనేవారికి కరోనా పరీక్షలు తప్పనిసరి

- ఆలయాలు, మసీదులు, దర్గాలు, చర్చిలు రాత్రి 8 గంటలకు మూత

- ఆటోలు, టాక్సీలలో ఇద్దరు ప్రయాణికులకే అనుమతి

- పర్యాటక ప్రాంతాల్లో 50 శాతం పర్యాటకులకు అనుమతి

- 45 యేళ్లు దాటినవారికి వ్యాక్సినేషన్‌

- ఈత కొలనులలో క్రీడా శిక్షణ పొందేవారికి మాత్రమే అనుమతి

- విదేశాలు, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చేవారికి ఈ-పాస్‌ తప్పనిసరి

- కర్మాగారాలలో పనిచేసేవారందరికీ వ్యాక్సిన్‌ పంపిణీ


అర్థం చేసుకుని సహకరించండి : గవర్నర్‌ 

రోజురోజుకూ ఉధృతమవుతున్న కరోనాను అరికట్టేందుకు ప్రభుత్వం తీసుకున్న చర్యలకు ప్రజలంతా సహకరించాలని రాష్ట్ర గవర్నర్‌ భన్వరీలాల్‌ పురోహిత్‌ విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆయన గురువారం ప్రకటన విడుదల చేశారు. దేశం తీవ్రమైన ఆరోగ్య సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న పరిస్థితుల్లో కుటుంబాన్ని జాగ్రత్తగా చూసుకోవాలని, ముఖ్యంగా పెద్దలను సంరక్షించుకోవాలని ప్రజలకు సూచించారు. ప్రతి ఒక్కరూ మాస్కు ధారణ, సామాజిక దూరం, చేతుల్ని శానిటైజ్‌ చేసుకోవడం వంటివి పాటించాలన్నారు. అంతేగాక కోవిడ్‌ నుంచి రక్షించుకునేందుకు అర్హులైన వారంతా వ్యాక్సిన్‌ తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. కోవిడ్‌19 వ్యాప్తిని నివారించేందుకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలను అభినందించారు. 

Updated Date - 2021-04-09T16:35:11+05:30 IST